Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 30 లక్షల మందికిపైగా: లోక్‌సభలో కేంద్రం వెల్లడి
న్యూఢిల్లీ : 2017-2022 మధ్యకాలంలో 30లక్షల మందికిపైగా భారతీయులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లారని లోక్‌సభలో కేంద్రం వెల్లడించింది. ''భారతీయుల విదేశీ పర్యటన ఉద్దేశం ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. కేంద్ర హోంశాఖ, విదేశాంగ శాఖ వద్ద కచ్చితమైన వివరాలు లేవు. అయినప్పటికీ మౌఖికంగా వారు తెలిపిన వివరాల ప్రకారం దాదాపు 30 లక్షలమందికిపైగా భారతీయులు విదేశాల కు వెళ్లారు'' అని కేంద్ర సహాయ మంత్రి సుభాష్ సర్కార్ తెలిపారు. జేడీ (యూ) ఎంపీ రాజీవ్ రంజన్ సింగ్, మరికొంత మంది ఎంపీలు అడిగిన ప్రశ్నలకు రాతపూర్వక సమాధానమిచ్చారు. ''విదేశాల్లో మన విద్యార్థులు ఎంత ఖర్చు చేస్తున్నారన్న వివరాలు కేంద్రం విడుదల చేయాలి. ఉన్నత విద్య కోసం భారతీయులు పెద్ద సంఖ్యలో విదేశాలకు వెళ్తున్నారు. దేశంలో విద్యా బడ్జెట్ కన్నా విదేశాల్లో మన విద్యార్థులు చేస్తున్న ఖర్చు చాలా ఎక్కువ. ఈ డబ్బును కాపాడుకోవటం కోసం దేశంలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా సంస్థల్ని తీసుకురావాలి. కేంద్రం ఈ దిశగా ఏమైనా ఆలోచిస్తుందా?'' అని రాజీవ్ రంజన్‌సింగ్ ప్రశ్నించారు. అయితే అలాంటి ప్రతిపాదనలేవీ తమ ముందు లేవని సర్కార్ సమాధాన మిచ్చారు.