Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదానీ-మోడీ పొత్తు బట్టబయలు : రాజ్యసభలో సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్
న్యూఢిల్లీ: అదానీ మోసాలపై విచారణ చేయాల్సిన అవసరం ఉన్నదని సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మోడీ-అదానీ పొత్తును బట్టబయలు చేశారు. అదానీ నల్లధనం లావాదేవీలు, స్టాక్ ఫ్రాడ్‌లో ప్రభుత్వం భాగస్వామిగా ఉన్నదనీ, అందుకే జేపీసీ విచారణకు సిద్ధంగా లేదని విమర్శించారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో జాన్ బ్రిట్టాస్ మాట్లాడుతూ అదానీ మోసాలపై విచారణ అవసరమన్నారు. అదానీ ఆవు కంటే గొప్ప పవిత్రమైన ఆవు అయ్యాడనీ, నల్లధనాన్ని కాపాడేందుకు జాతీయత ముసుగు వేసుకున్నారని ధ్వజమెత్తారు. హిండెన్‌బర్గ్ నివేదికపై స్పందించడానికి వచ్చిన అదానీ అధికారి జాతీయ జెండా ముందు మాట్లాడారనీ, దేశభక్తిని కాపాడాలని పిలుపునిచ్చారని అన్నారు. అలా చెప్పిన గొప్ప వ్యక్తి ఆస్ట్రేలియా పౌరుడనీ, అదానీ బ్లాక్ మనీ డీల్ కొత్తది కాదని విమర్శించారు. గతంలో పనామా, ప్యారడైజ్, పండోర పేపర్లు విడుదలయ్యాయనీ, వీటిలో రెండు మనీలాండరింగ్ పేపర్ కంపెనీలకు సంబంధించినవి ఉన్నాయని అన్నారు. అందులో అదానీ సన్నిహితుడి పేరు కూడా ఉన్నదనీ, 1989లో ఒక వ్యాపారవేత్తతో కుమ్మక్కై ప్రభుత్వం పడిపోయిందని గుర్తు చేశారు. మోడీ ప్రభుత్వాన్ని అదానీ కూల్చేస్తాడనీ, ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందనడానికి అదానీ ఎఫ్‌పీవో ఉపసంహరణే నిదర్శనమని పేర్కొన్నారు.
కేరళలో బీజేపీ అత్యాశే..
కేరళలో ఐదు లోక్‌సభ సీట్లు గెలుచుకోవాలన్న బీజేపీ కోరిక అదానీ అత్యాశ లాంటిదని జాన్ బ్రిట్టాస్ ఎద్దేవా చేశారు. కేరళలో బీజేపీని గెలిపించాలని ప్రకాశ్ జవదేకర్ బయలుదేరారనీ, ఆయన బూట్లు మాయమవడమే తప్ప మరో గత్యంతరం లేదని బ్రిట్టాస్ అన్నారు. కేరళను సోమాలియా అని, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని ఆరోపించిన వారు ఇప్పుడు సీట్ల కోసం పరుగులు తీస్తున్నారని ఎద్దేవా చేశారు. కేరళ సంస్కృతిని కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.