Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రంపై రాష్ట్రాలు గరం గరం
- ప్రతిదానిపై పన్నులు వేస్తున్న మోడీ సర్కార్
- రాష్ట్రాలకు ఇచ్చే దగ్గర కఠిన నియంత్రణలంటూ కేరళ, తెలంగాణ, తమిళనాడు ఆర్థికమంత్రుల నిలదీత
న్యూఢిల్లీ : మార్కెట్ నుంచి రుణాల సేకరణ, పన్నుల్లో కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో మోడీ సర్కార్‌కు, వివిధ రాష్ట్రాలకు మధ్య వివాదం తీవ్రస్థాయికి చేరింది. పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకులు..ఇలా అన్నింటిపైనా పన్నులు వేస్తున్న కేంద్రం, రాష్ట్రాలకు ఇచ్చే దగ్గర అనేక ఆటంకాలు కల్పిస్తోందని రాష్ట్రాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అభివృద్ధి కార్యక్రమాల కోసం రుణాలు సేకరించకుండా కేంద్రం అడ్డుపడుతోందని బడ్జెట్ ప్రసంగాల్లో కేరళ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆయా రాష్ట్రాల ఆర్థికమంత్రులు ఆర్బీఐకి లేఖలు కూడా రాశారు.
''అభివృద్ధి ప్రాజెక్టుల పనులు ముందుకు కదలాలంటే రాష్ట్రాలు అప్పులు చేయాల్సిన పరిస్థితి. దీనిని దృష్టిలో పెట్టుకొని మరిన్ని రుణాలు సేకరించేలా వెసులుబాటు కల్పించాలని రాష్ట్రాలు కోరుతున్నాయి. ఈ విన్నపాన్ని కేంద్రం పట్టించుకోకపోగా, అనేక అడ్డంకులు సృష్టిస్తోంది. వీటిని ఎదుర్కొంటూ సమస్యల్ని అధిగమిస్తూ కేరళ ముందుకు వెళ్తోంది'' అని కేరళ ఆర్థిక మంత్రి బాలగోపాల్ కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతవారం కేరళ బడ్జెట్ సందర్భంగా తన ప్రసంగంలో పై వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రాలకు పెద్దమొత్తంలో నిధులు అందుబాటులో ఉంచరాదన్న విధానాన్ని మోడీ సర్కార్ గతకొన్నేండ్లుగా అనుసరిస్తోంది. అత్యవసరమైతే తప్ప రుణాలు దక్కకూడదనినే విధానంతో అనుమతులు నిరాకరిస్తోంది. దీనిపై ముఖ్యంగా దక్షిణాది నుంచి కేరళ, తమిళనాడు, తెలంగాణ నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తోందని, సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కల్పిస్తోందని బడ్జెట్ ప్రసంగంలో తెలంగాణ మంత్రి హరీశ్‌రావు కేంద్రంపై విరుచుకుపడ్డారు. మార్కెట్ రుణాలు రూ.53,970 కోట్లు సేకరించే అవకాశమున్నా, కేంద్రం తీరువల్ల రూ.15వేల కోట్ల రుణాలు రాకుండా పోయాయని ఆయన వాపోయారు.