Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నామినేటెడ్ సభ్యులకు ఓటింగ్ హక్కు లేదని సుప్రీంకోర్టు స్పష్టీకరణ
- 13న త్రిసభ్య ధర్మాసనం విచారణ
న్యూఢిల్లీ: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘోర పరాభవం పొందిన బిజెపి నామినేటెడ్ సభ్యుల ఓటింగ్‌తో పాగా వేయాలని చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఈ మేరకు సుప్రీంకోర్టులోనూ ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నామినేట్ చేయబడిన సభ్యులను కార్పొరేషన్ సమావేశాల్లో ఓటు వేసేందుకు రాజ్యాంగం అనుమతించడం లేదని సుప్రీం కోర్టు బుధవారం స్పష్టీకరించింది. ఢిల్లీ మేయర్ ఎన్నికలను వరుసగా మూడోసారీ కూడా ఉద్దేశ్యపూర్వకంగానే నిలుపుచేస్తున్నారంటూ ఆమాద్మీ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రొటెమ్ స్పీకర్లకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఎన్నికైన సభ్యులకు, నామినేటెడ్ సభ్యులకు మధ్య వ్యత్యాసానికి చాలా ప్రాధాన్యత వుందని ఈ కేసు విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ స్పష్టం చేశారు. దీనిపై ఈ నెల 13న త్రిసభ్య ధర్మాసనం సవివరమైన విచారణ చేపడుతుందన్నారు. అక్రమ మార్గాల ద్వారానైనా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బిజెపి ప్రయత్నిస్తోందని సీనియర్ ఆప్ నేత మనీష్ శిసోడియా విమర్శించారు. తాజాగా సుప్రీం చేసిన వ్యాఖ్యలతో బిజెపికి ఎదురుదెబ్బ తగిలిందన్నారు. ఆప్ మేయర్ అభ్యర్ధి షెల్లీ ఒబెరారు తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్ న్యాయవాది ఎఎం సింఘ్వి మాట్లాడుతూ ప్రజాస్వామ్య విధ్వంసానికి పాల్పడుతున్నవారిపై చేస్తున్న న్యాయపోరాటమని పేర్కొన్నారు. మున్సిపాలిటీ ఎన్నికలు సకాలంగా పూర్తి కావాలని రాజ్యాంగంలోని 243 యు అధికరణ పేర్కొంటోందని గుర్తు చేశారు. గతేడాది డిసెంబరు 4న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగా యని చెప్పారు. కానీ, మేయర్, డిప్యూటీ మేయర్, స్థాయీ సంఘం సభ్యుల ఎన్నికలు మాత్రమూ మూడుసార్లుగా నిలిచిపోతూ వస్తున్నాయని అన్నారు. రాజ్యాంగంలోని 243ఆర్(2)(4) ని నేరుగా ఉల్లంఘిస్తూ నామినేటెడ్ సభ్యులను ఓటు వేసేందుకు ప్రొటెమ్ స్పీకర్ అనుమతించారని ఆయన తెలిపారు. ఇదేమీ కేవలం శాసనం కాదని, రాజ్యాంగమే వారిని ఓటు వేయడానికి అనుమతించడం లేదని జస్టిస్ పి.ఎస్.నరసింహా వ్యాఖ్యానించారు. జనవరి 6, 24 తేదీల్లో రెండుసార్లు నిలిచిపోయిన నేపథ్యంలో సకాలంలో మేయర్ ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ జనవరి 27వ తేదీన ఒబెరారు సుప్రీంను ఆశ్రయించారు. నామినేటెడ్ సభ్యులు ఓటు వేయడానికి అనుమతించిన పక్షంలో మళ్లీ కోర్టుకు వెళ్లేందుకు అనుమతించాలని కూడా ఆమె అప్పుడే కోరారు.