Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: విద్వేష ప్రసంగాల్ని మొగ్గ దశలోనే అడ్డుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలున్నా..మోడీ సర్కార్ ఆ ఆదేశాల్ని పెడచెవిన పెడుతోంది. దాంతో హిందూత్వ శక్తులు చెలరేగిపోతున్నాయి. ఢిల్లీ వేదికగా విద్వేష ప్రసంగాలకు అడ్డుఅదుపు లేకుండా పోతోంది. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో 'సనాతన్ ధర్మ సన్సద్' పేరుతో ఒక కార్యక్రమం నిర్వహించగా, అందులో పాల్గొన్న హిందూత్వ సంస్థల నాయకులు మైనార్టీలపై విద్వేషాన్ని వెళ్లగక్కారు. ఈ ప్రసంగాలపై పోలీసులకు ఫిర్యాదులు వెల్లువెత్తగా, కేవలం ట్విట్టర్ ఖాతాలను నిలుపుదల చేస్తూ చర్యలు తీసుకున్నారు. విద్వేష ప్రసంగాలు చేసిన నాయకులపై ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేయక పోవటం విమర్శలకు దారితీసింది. ధీరేంద్ర శాస్త్రి, ఆయన మద్దతుదారుల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 5న ఢిల్లీలో 'సనాతన్ ధర్మ సన్సద్' ఏర్పాటుచేశారు. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించిన భక్త హరి మహరాజ్, మరికొంత మంది మైనార్టీలపై విద్వేషాన్ని వెళ్లగక్కుతూ ప్రసంగించారు. ఈ ప్రసంగాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయినా ఢిల్లీ పోలీసులు చర్యలు చేపట్టడం లేదు. వీడియోలు ప్రసారం కాకుండా ట్విట్టర్‌కు నోటీసులు జారీచేసి పోలీసులు చేతులు దులుపుకున్నారు. అంతకు మించి నిందితులపై ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. ఒక వర్గం వారిని లక్ష్యంగా చేసుకొని విద్వేష ప్రసంగాలు చేశారని వీడియో దృశ్యాలతో స్పష్టమైన ఆధారాలున్నా పోలీసులు కేసులు నమోదుచేయక పోవటంపై విమర్శలు వస్తున్నాయి. ''పోలీసుల నుంచి నోటీసు మాకెందుకు వచ్చిందో తెలియటం లేదు. ఇది మమ్మల్ని ఆశ్చర్యపర్చింది. విద్వేష ప్రసంగాలు చేసినవారికే నోటీసులు పంపాల్సింది'' అంటూ ట్విట్టర్ స్పందించింది.
రామచరిత మానస్‌ను జాతీయ పుస్తకంగా, గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని, ధీరేంద్ర శాస్త్రికి 'జెడ్ ప్లస్' కేటగిరి భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని 'ధర్మ సన్సద్' డిమాండ్ చేసింది. మైనార్టీలపై హింసకు దిగాలని మెజార్టీ హిందువుల్ని రెచ్చగొడుతూ సభ ప్రారంభమైన కొద్ది సేపటికి ప్రసంగాలు మొదలయ్యాయి. ఇండియాను హిందూ రాష్ట్రగా మార్చాలని మద్దతుదారులకు ధీరేంద్ర శాస్త్రి, మిగతా నాయకులు పిలుపునిచ్చారు. రామ్చరిత్ మానస్‌ను వ్యతిరేకిస్తున్న రాజకీయ నాయకుల్ని ముఖ్య అతిథి భక్త హరి తీవ్రంగా దూషించాడు. ఒక వర్గం వాళ్లని ప్రత్యేకంగా పేర్కొంటూ, ''వాళ్లని ఎప్పుడు చంపుతావు? నీ దగ్గర ఆయుధాల్లేవా? కూరగాయలు కోసే కత్తి వుందికదా? కత్తులు, తుపాకులు తెచ్చుకో. చూడండి...మన దేవుళ్లందరి దగ్గరా ఏదో ఒక ఆయుధం ఉంటుంది. అలాగే నీ దగ్గర కూడా ఒక ఆయుధం ఉండాలి. మత పుస్తకాలు, ఆయుధాలు సమన్వయం చేసుకుంటూ ముందుకువెళ్లూ'' అంటూ భక్త హరి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.