Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉభయ సభల్లో ప్రతిపక్షాల ప్రశ్నలు
న్యూఢిల్లీ: పార్లమెంటులో 'అదానీ' ప్రకంపనలు బుధవారం కూడా కొనసాగాయి. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ నివేదిక చేసిన ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అదానీ గ్రూప్ షేర్ల విలువ పతనమవడం అతి పెద్ద కుంభకోణమని విమర్శించారు. ప్రభుత్వ రంగంలోని ఎల్ఐసీ, ఎస్బీఐ ఈ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టినందువల్ల ఇది సామాన్యుల సొమ్ముకు సంబంధించిన విషయమని పేర్కొన్నాయి. అదానీ గ్రూప్‌పై తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. బుధవారం రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ, శివసేన థాకరే వర్గం, బీఆర్ఎస్ వాయిదా తీర్మానాలను ఇచ్చాయి. రూల్ 267 ప్రకారం కె. కేశవరావు (బీఆర్ఎస్), సంజరు సింగ్ (ఆప్), శివసేన (ఠాక్రే) ఎంపీలు సంజరు రౌత్, ప్రియాంక చతుర్వేది ఇచ్చిన నోటీసులను చైర్మన్ జగదీప్ ధంఖర్ అనుమతించలేదు. దీంతో ఆయా పార్టీల సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
రాజ్యసభలో..
రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ..ప్రధాని మోడీ సభలో ఎక్కువ సమయం గడపాలని హితవు పలికారు. ఆయన మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. బాధ్యతాయుతంగా వ్యవహరించవలసిన మంత్రులు, ఎంపీలు హిందూ-ముస్లిం అంటూ మాట్లాడుతున్నారన్నారు. మాట్లాడటానికి ఇతర అంశాలేవీ వారికి దొరకలేదా? అని నిలదీశారు. దేవాలయాల్లోకి ప్రవేశించే ఎస్సీలను కొడుతున్నారన్నారు. వారిని హిందువులుగా పరిగణిస్తే, దేవాలయాల్లోకి వారిని ఎందుకు ప్రవేశించనివ్వడం లేదని ప్రశ్నించారు. వారు చదువుకోవడానికి అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఎస్సీల ఇండ్లల్లో భోజనం చేస్తున్నట్లు కనిపించే ఫొటోలను చాలా మంది మంత్రులు చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం చెప్పినదానినే రాష్ట్రపతి, గవర్నర్లు పునరుద్ఘాటించడం తరచూ జరుగుతోందన్నారు. అయితే ఈసారి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మైనారిటీల గురించి మాట్లాడతారని తాను ఆశించాననీ, కానీ తనకు నిరాశే మిగిలిందని అన్నారు. నిజం మాట్లాడితే తాను జాతి వ్యతిరేకిని అవుతానా? అని నిలదీశారు. ''నేను దేశ వ్యతిరేకిని కాను. ఇక్కడ ఉన్నవారిలో ఎవరితో పోల్చుకున్నా నేను గొప్ప దేశభక్తుడిని. నేను భూమి పుత్రుడిని. మీరు దేశాన్ని దోచుకుంటున్నారు. నన్ను దేశ వ్యతిరేకి అంటున్నారు'' అని మండిపడ్డారు. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మాట్లాడుతూ ప్రధాని మోడీపై పదే పదే వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారని అన్నారు. జగ్దీప్ ధంఖర్ మాట్లాడుతూ దేశానికి మనం చెడు సందేశాన్ని పంపిస్తున్నామన్నారు. వ్యూహాత్మకంగానే ఈ విధంగా చేస్తున్నారన్నారు. రాజ్యసభ ప్రారంభం కాగానే అదానీ గ్రూప్ అంశాన్ని ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తడంతో గందరగోళం ఏర్పడింది.
రాహుల్ గాంధీపై ప్రివిలేజ్ నోటీస్
లోక్‌సభలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి రాహుల్ గాంధీపై ప్రివిలేజ్ మోషన్‌ను ప్రతిపాదించారు. పార్లమెంటు నిబంధనల ప్రకారం ఓ ఎంపీ ముందుగా నోటీసు ఇవ్వకుండా ఎటువంటి ఆరోపణలు చేయరాదన్నారు. ఓ కాంగ్రెస్ నేత (రాహుల్ గాంధీ) మంగళవారం నిరాధారమైన ఆరోపణలు చేశారన్నారు. ఆయన స్టేట్మెంట్ను రికార్డుల నుంచి తొలగించాలన్నారు. బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే కూడా రాహుల్ గాంధీపై ప్రివిలేజ్ మోషన్‌ను ప్రతిపాదించారు. సభలో లేని వ్యక్తిపై ఆరోపణలు చేయరాదన్నారు. సభలో లేని వ్యక్తి తనను తాను సమర్థించుకోవడం సాధ్యం కాదు కాబట్టి ఆ వ్యక్తిపై ఆరోపణలు చేయరాదన్నారు. ముందుగా నోటీసు ఇచ్చి, స్పీకర్ అనుమతి పొందాలన్నారు.
జాతీయ జెండాలో ఆకుపచ్చ రంగు తొలగిస్తుందా?
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసి మాట్లాడుతూ త్రివర్ణ పతాకం నుంచి ఆకుపచ్చ రంగును మోడీ ప్రభుత్వం తొలగిస్తుందా? అని ప్రశ్నించారు. ఆకుపచ్చ రంగుతో మోడీ ప్రభుత్వానికి అన్ని సమస్యలు ఎందుకని ప్రశ్నించారు.