Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక క్రమశిక్షణ అవసరమంటూ హెచ్చరికలు
- ప్రతిపక్షాలపై మరోమారు మోడీ మాటల దాడి
- ప్రజా సమస్యలపై మళ్లీ దాటవేత
న్యూఢిల్లీ : ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరోక్షంగా అక్కసు వెళ్లగక్కారు. భావితరాల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని ఆర్థిక క్రమశిక్షణ పాటించాలంటూ రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేశారు. దేశంలో ప్రజల వాస్తవ సమస్యలను, దేశం ఎదుర్కొంటున్న సవాళ్లపై ఎప్పటిలానే దాటవేత వైఖరిని కొనసాగించారు. బుధవారం లోక్‌సభలో ప్రతిపక్షాలపై దాడి చేసిన ప్రధాని మోడీ, గురువారం రాజ్యసభలో మరోసారి దాడి చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ప్రధాని సమాధానం ఇచ్చారు. రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలన్నారు. రాజకీయ పార్టీలు దేశ భావి తరాల బాలల భవితతో ఆటలాడుకోకూడదని అన్నారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాత పింఛను పథకం (ఓపీఎస్)ను అమలు చేయడానికి ప్రయత్నిస్తుండటాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. పొరుగు దేశాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న విషయాన్ని గుర్తు చేశారు.
ప్రధాని మోడీ మాట్లాడుతుండగా ప్రతిపక్ష సభ్యులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. అదానీ అక్రమాలపై సంయుక్త పార్లమెంటరీ సంఘంతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాల నినాదాల హోరులోనే ప్రధాని తన ప్రసంగాన్ని కొనసాగించారు. ప్రతిపక్షాలు ఎంత ఎక్కువ బురద జల్లితే, కమలం అంత గొప్పగా వికసిస్తుందని చెప్పారు. కొందరి భాష, ప్రవర్తన దేశానికి నిరాశ కలిగిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ అధ్యక్షులు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేను ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ.. ఖర్గే చెప్పినట్లుగా పునాదుల నిర్మాణానికి కాంగ్రెస్ ప్రయత్నించి ఉండవచ్చునని, అయితే కాంగ్రెస్ పాలనా కాలంలో కేవలం గోతులను మాత్రమే తవ్వారని పేర్కొన్నారు.
డిజిటల్ ఇండియా విస్తరించినందువల్ల డిజిటల్ ఆర్థిక వ్యవస్థ నూతన రంగం వికసిస్తోందని చెప్పారు. మన దేశంలో 90 వేల రిజిస్టర్డ్ స్టార్టప్స్ ఉన్నాయని, ఇవి ఉపాధికి నూతన అవకాశాలను అందుబాటులోకి తీసుకొచ్చాయని తెలిపారు. 2020లో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఇపిఎఫ్ఒ) పేరోల్‌లో కోటి మందికిపైగా నమోదయ్యారన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన వల్ల 60 వేల మందికిపైగా లబ్ధి పొందారన్నారు. వైద్యం కోసం అయ్యే ఖర్చులకు భయపడే మహిళలకు ఆయుష్మాన్ కార్డు ద్వారా బీమా ప్రయోజనాలను కల్పించినట్లు తెలిపారు. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న 110 జిల్లాలను గుర్తించి వాటి సత్వరం అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. 2014వ సంవత్సరానికి ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు గిరిజనుల కోసం సుమారు రూ.20,000 కోట్లు కేటాయించిందన్నారు. అయితే తన ప్రభుత్వం రూ.1.20 లక్షల కోట్లు కేటాయించిందని మోడీ గొప్పలు చెప్పారు. నాలుగు దశాబ్దాలకు పైగా ఏమీ చేయని కాంగ్రెస్‌ను దేశం తిరస్కరించిందని చెప్పారు.