Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏపీలో ఊపిరాడక ఏడుగురు కార్మికులు మృతి
కాకినాడ : కాకినాడ జిల్లాలో బుధవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెద్దాపురం మండలం జి.రాగంపేట గ్రామంలో నిర్వహిస్తున్న ఆయిల్ కంపెనీకి చెందిన పరిశ్రమలో ఆయిల్ ట్యాంకర్ క్లీన్ చేయడానికి దిగి ఊపిరి ఆడక ఏడుగురు కార్మికులు మృతి చెందారు. వీరిలో ఐదుగురు అల్లూరి సీతారామరాజు జిల్లాకు, మిగిలిన ఇద్దరూ కాకినాడ జిల్లాకు చెందినవారు. తోటి కార్మికులు, స్థానికులు, మృతుల బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు... పెద్దాపురం మండలం జి.రాగంపేటలో అంబటి సుబ్బన్న అండ్ కో ఆయిల్ కంపెనీకి చెందిన పరిశ్రమను ఏడాది క్రితం నిర్మించారు. అప్పటి నుంచి ఉత్పత్తిని ప్రారంభించారు. బుధవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఫ్యాక్టరీలోని ఐదో నెంబరు ఆయిల్ ట్యాంకును శుభ్రం చేసేందుకు ప్యాకింగ్ సెక్షన్‌కు చెందిన ఇద్దరు కార్మికులను అందులోకి యాజమాన్యం దింపింది. 25 అడుగుల ఎత్తున్న ఈ ట్యాంకులోకి ఎలాంటి భద్రతా పరికరాలు ఇవ్వకుండా కార్మికులను పంపింది. వారు రాకపోయే సరికి మరో ఇద్దరిని, ఆ తర్వాత మరో ఇద్దరిని ఇలా విడత విడతలుగా ఏడుగురుని ట్యాంకులోకి దింపింది. ట్యాంకులో దిగిన కార్మికుల్లో ఏ ఒక్కరూ బయటకు రాకపోవడంతో తోటి కార్మికులు అనుమానం వచ్చి చూసేసరికి అందులో వారు విగత జీవులుగా పడి ఉన్నారు. ఘాటైన వాయువుల వల్ల ఊపిరాడక మృతి చెందారని తోటి కార్మికులు తెలిపారు. ట్యాంకు కింది భాగాన్ని కట్ చేసి మృతదేహాలను బయటకు తీశారు. మృతుల్లో పాడేరుకు చెందిన వెచ్చంగి కృష్ణ (35), వెచ్చంగి నరసింహ (38), వెచ్చంగి సాగర్ (20), కురతాడు బంజుబాబు (26), కుర్ర రామారావు (43), కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం పులిమేరుకు చెందిన కట్టమూరి జగదీష్ (25), యల్లమిల్లి దుర్గాప్రసాద్ (27) ఉన్నారు. వీరిలో కృష్ణ, నరసింహ, సాగర్ ఒకే కుటుంబానికి చెందిన వారు. ప్రమాద విషయం తెలియగానే పొలిమేరు గ్రామం నుంచి మృతులు బంధువులు ఫ్యాక్టరీకి చేరుకున్నారు. వారి రోదనలతో అక్కడ తీవ్ర విషాదం నెలకొంది.