Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మతం ఆయుధంగా రాజ్యాంగంపై బీజేపీ దాడి
- ఆహార సబ్సిడీకి బడ్జెట్లో 90 వేల కోట్ల కోత : బృందా కరత్
న్యూఢిల్లీ : అమృత కాలం అంటూ బీజేపీ చేస్తున్న నినాదంపై సీపీఐ(ఎం) స్పందించింది. దీనిని విష కాలంగా అభివర్ణించాలని తెలిపింది. రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని ఆయుధంగా వాడుకుంటూ దేశ రాజ్యాంగంపై దాడిని బీజేపీ ప్రారంభించిందని ఆరోపించింది. '' తమ ప్రభుత్వం పేదలకు ఉచిత రేషన్ ఇస్తున్నదని ప్రధాని మోడీ చెప్తున్నారు. ఈ ఏడాది బడ్జెట్లో ఆహార సబ్సిడీకి రూ. 90 వేల కోట్ల కోత విధించారు. ఇది అమృత కాలం కాదు.. విష కాలం'' అని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యలు బృందా కరత్ అన్నారు. త్రిపురలోని అమర్పుర్లో నిర్వహించిన ర్యాలీలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. వారు (బీజేపీ) రాజకీయాలతో మతాన్ని కలుపుతున్నారని అన్నారు. వారి హిందూత్వ భావజాలానికి హిందూ మతానికి సంబంధం లేదని తెలిపారు. ఎన్నికల్లో ప్రయోజనాల కోసం మన ప్రజల మధ్య విభజన తీసుకురావడానికి ఇది ఒక రాజకీయ ఆయుధం అని అన్నారు. రాజ్యాంగ సంస్థలను ధ్వంసం చేస్తూ అధికార బీజేపీ బుల్డోజర్ రాజకీయాలను నడిపిందని ఆరోపించారు. భారత దేశ ప్రజాస్వామ్య పునాదిని కాషాయ పార్టీ నాశనం చేస్తున్నదన్నారు. అనామక ఎలక్టోరల్ బాండ్లను జారీ చేస్తూ బీజేపీ కోట్ల రూపాయలను పోగు చేసుకుంటున్నదని బృందా కరత్ ఆరోపించారు. ''ఆదివాసుల హక్కుల కోసం పోరాడుతున్న లెఫ్ట్ ఫ్రంట్‌తో చేతులు కలపాలని మేము వారికి (టిప్రా మోతా) చెప్పాము. కానీ వారు స్పందించలేదు.ఈ ఎన్నికల్లో తమకు, వామపక్ష-కాంగ్రెస్ కూటమికి మధ్య విభేదాలతో బీజేపీ లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నది'' అని ఇంతక ముందు త్రిపురను పాలించిన రాచరిక కుటుంబానికి చెందిన టిప్రా మోతాను ఉద్దేశిస్తూ ఆమె అన్నారు.త్రిపురలో ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైంది. బీజేపీ ఎలాగైనా మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి మత, 'విద్వేష' రాజకీయాలకు ఇప్పటికే తెర లేపింది. అయితే, బీజేపీ వైఫల్యాలను ప్రజలకు తెలియపరుస్తూ సీపీఐ(ఎం) పార్టీ ప్రచారంలో ముందుకెళ్తున్నది.