Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై సీబీఐ దర్యాప్తునకు నిరుద్యోగ యువత డిమాండ్
- అవకతవకలపై ఆందోళనకారుల్లో పెల్లుబికిన ఆగ్రహం
- పోలీసుల వీరంగం..పలువురికి గాయాలు
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో నిరుద్యోగ యువత ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పేపర్ లీకులకు వ్యతిరేకంగా వారు చేసిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ ఆందోళనల్లో పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. నిరుద్యోగ యువత ఆందోళన చేస్తున్న డెహ్రాడూన్లోని గాంధీ పార్క్ వద్దకు పోలీసులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు వారిపై లాఠీచార్జ్ జరిపారు. పోలీసు చర్యతో పలువురు యువకులు గాయపడ్డారు. ఉత్తరాఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన వివిధ నియామక పరీక్షలలో చోటు చేసుకున్న అవకతవకలపై సీబీఐ ద్వారా దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ యువత డెహ్రాడూన్లో బుధవారమే ధర్నాకు దిగింది. నియామక పరీక్షల్లో ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా వారు నినాదాలు వినిపించారు. అయితే, వారి ధర్నాను బలవంతగా ఎత్తివేయడానికి పోలీసులు ప్రయత్నించారు. పోలీసుల చర్య నిరసనకారుల్లో ఆగ్రహాన్ని తెప్పించింది. తమ డిమాండ్లను వినిపించడానికే డెహ్రాడూన్ రోడ్డును దిగ్బంధించినట్టు రాష్ట్ర నిరుద్యోగ సంఘం అధ్యక్షుడు బాబీ పన్వార్ తెలిపారు. '' యువత చాలా ఆగ్రహంగా ఉన్నది. పోలీసులు లాఠీ చార్జీ చేశారు. కొందరిని నిర్బంధించి విడిచిపెట్టారు. రాష్ట్రంలో రిక్రూట్మెంట్ స్కామ్లలో, నియామక సంస్థలపై సీబీఐ దర్యాప్తునకు మేము డిమాండ్ చేస్తున్నాము'' అని పన్వార్ అన్నారు. ఈ ఘటనపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. పోలీసు చర్యను ఖండించింది. యువత గళాన్ని బలవంతంగా అణచివేసేలా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించింది. యువతపై దాడులను నిరసిస్తూ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో తమ పార్టీ ప్రదర్శలను చేపడుతుందని కాంగ్రెస్ తెలిపింది. యువత తప్పుదోవ పట్టొద్దనీ, నియామక పరీక్షలు పారదర్శకంగా జరపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అంతకముందు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ నిరసనకారులను కోరారు.