Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అతివాద హిందూ సంస్థల సభ్యులకు ఆఫర్
- ఇలాంటివి పలు పోస్టులు గుర్తింపు
- తొలుత నిరాకరించి.. తర్వాత తొలగించిన ఫేస్బుక్
- 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' కథనం
న్యూఢిల్లీ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలనలో మైనారిటీలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఒకపక్క సీఏఏ వంటి చట్టాలు.. మరోపక్క హిందూత్వశక్తులు, సంస్థల దాడులు వారిని ఇప్పటికే ఆందోళనలకు గురి చేశాయి. వీటిని ఉక్కుపాదంతో అణచివేసి రాజ్యాంగం ప్రకారం మైనారిటీలకు రక్షణ కల్పించాల్సిన మోడీ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నది. దీంతో అతివాద హిందూత్వ సంస్థలు ఇంకా రెచ్చిపోతున్నాయి. మరో అడుగు ముందుకేసి సామాజిక మాద్యమం ఫేస్బుక్ వేదికగా ఆయుధాల కొనుగోలుకు తెరలేపుతున్నాయి. ప్రముఖ వార్త సంస్థ 'ది వాల్ స్ట్రీట్ జర్నల్'లో దీనిపై కథనం వెలువడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఈ కథనం ప్రకారం.. భారత్‌లో హింసాత్మక చరిత్ర కలిగిన అతివాద హిందూ సంస్థకు అంకితమైన ఫోరమ్‌లోని సభ్యులకు.. ఫేస్బుక్ వినియోగదారులు ప్లాట్‌ఫారమ్ హ్యాండ్గన్లు, రైఫిల్స్, షాట్గన్లు, బుల్లెట్లు విక్రయించడానికి ఆఫర్ చేశారు. భారత్‌లో మతపరంగా మైనారిటీలైన వారిపై దాడులను పర్యవేక్షించే ఒక గ్రూపును ఏర్పాటు చేసిన రఖీబ్ హమీద్ నాయక్ దృష్టికి ఈ విషయం వచ్చింది. ఇలాంటివి 8 పోస్టులను ఆయన గుర్తించారు. దీనిపై ఫేస్బుక్ మాతృ సంస్థ అయిన మెటాకు ఆయన ఫిర్యాదు చేయటం మొదలుపెట్టారు.
సంస్థ నిబంధనల ప్రకారం.. ఫేస్బుక్ వేదికగా ఆయుధాల అమ్మకం, కొనుగోలు నిషేధం. అయితే, ఇలాంటి పోస్టులను తొలగించడానికి ఫేస్బుక్ తొలుత నిరాకరించింది. ఆ పోస్టులేవీ కంపెనీ నిబంధనలను ఉల్లంఘించలేదని తెలిపింది. అయితే, ఈ పోస్టులపై 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' దర్యాప్తునకు దిగింది. దీంతో అప్రమత్తమైన ఫేస్బుక్.. ఆయుధాల అమ్మకాలకు సంబంధించిన పోస్టులను తొలగించటం గమనార్హం. బజరంగ్దళ్, ఆరెస్సెస్‌కు అనుబంధ సంఘం అయిన వీహెచ్‌పీ వంటి హిందూత్వ సంస్థలకు అనుకూలంగా ఉండే ఫేస్బుక్ గ్రూపులలో ఈ ఆయుధాల అమ్మకాలకు సంబంధించిన ఆఫర్లు రావటం ఇప్పుడు ఆందోళనను కలిగిస్తున్నది.