Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : అదానీ గ్రూపు సంస్థల అక్రమాలకు సంబంధించిన వ్యవహారంపై శుక్రవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సన్నిహితుడైన గౌతమ్ అదానీకి చెందిన ఈ గ్రూపు సంస్థలు అనేక అక్రమాలకు పాల్పడినట్టు హిండెన్‌బర్గ్ సంస్థ విడుదల చేసిన నివేదికపై దర్యాప్తు జరిపేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. అత్యవసర ప్రాతిపదికన దీనిపై విచారణ చేపట్టేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వద్ద లిస్టు చేశారని ఈ పిల్ దాఖలు చేసిన న్యాయవాది విశాల్ తివారి గురువారం తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి దాఖలైన పిటిషన్లు శుక్రవారం నాడు విచారణకు రానున్నాయనీ, తన పిటిషన్‌నూ అదే రోజు విచారణ చేపట్టాల్సిందిగా న్యాయవాది విశాల్ చేసిన విజ్ఞప్తికి జస్టిస్ చంద్రచూడ్ అంగీకరించి, అనుమతించారు. 'ఇదే తరహా పిటిషన్లు శుక్రవారం విచారణకు రానున్నాయి. ఇవి కూడా హిండెన్‌బర్గ్ పరిశోధన నివేదికలకు సంబంధించి నవే. దేశ ప్రతిష్టతను దెబ్బతీయడమే గాకుండా, ఆర్థికంగానూ తీవ్ర నష్టాన్ని కలిగించిన ఈ వ్యవహారంపై అత్యవసర విచారణ అవసరం' అని న్యాయవాది విశాల్ విజ్ఞప్తి చేయగా.. 'సరే.. జత చేయండి' అని సీజేఐ పేర్కొన్నారు.