Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశవ్యాప్తంగా బ్లాక్ డే విజయవంతం
- 300 జిల్లాల్లోని 12 వేలకు పైగా గ్రామాల్లో బడ్జెట్ ప్రతులు దగ్ధం
న్యూఢిల్లీ : రైతు, వ్యవసాయ కార్మిక వ్యతిరేక కేంద్ర బడ్జెట్ ను నిరసిస్తూ అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్), అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) ఇచ్చిన బ్లాక్ డే పిలుపు దేశవ్యాప్తంగా విజయవంతమైంది. దేశవ్యాప్తంగా వేలాది మంది రైతాంగం, వ్యవసాయ కార్మికులు ఆందోళనలో భాగమయ్యారు. 300 జిల్లాల్లోని 12 వేలకు పైగా గ్రామాల్లో బడ్జెట్ ప్రతులను దహనంచేశారు. కొన్ని గ్రామాల్లో ప్రధాని దిష్టిబొమ్మలను కూడా దహనం చేశారు. బహిరంగ సభల్లో రైతులు, కార్మికులు పెద్దఎత్తున పాల్గొని కార్పొరేట్ అనుకూల విధానాలపై పోరాడతామని కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించారు. నిరసనలను ఉద్దేశించి ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయూ నాయకులు మాట్లాడుతూ వ్యవసాయ, సామాజిక రంగాలకు బడ్జెట్ కేటాయింపులను భారీగా తగ్గించడం రైతాంగం, గ్రామీణ శ్రామిక వర్గాల బాధలను తీవ్రతరం చేస్తుందని విమర్శించారు. వ్యవసాయం కోసం బడ్జెట్ అంచనా 2022-23లో రూ.1,24,000 కోట్ల నుంచి ఈ ఏడాది రూ.1,15,531 కోట్లకు గణనీయంగా తగ్గిందని అన్నారు. అదేవిధంగా, ఉపాధి హామీ కోసం కేటాయింపులు 2022-23 సవరించిన అంచనాలో రూ.89,000 కోట్ల నుంచి ఈ బడ్జెట్లో రూ.60,000 కోట్లకు తగ్గించారని విమర్శించారు. సవరించిన అంచనా ప్రకారం 2022-23లో రూ.2,25,000 కోట్లుగా ఉన్న ఎరువుల సబ్సిడీలను ఈ ఏడాది రూ.1,75,000 కోట్లకు భారీగా తగ్గించారనీ, 2022-23 సవరించిన అంచనాలో మార్కెట్ జోక్యం, మద్దతు ధర పథకానికి రూ.1,500 కోట్ల కేటాయించారనీ, 2023-24 బడ్జెట్ అంచనాలో ఎలాంటి ప్రస్తావన లేదని విమర్శించారు. ఫిబ్రవరి 13న కేరళ, ఫిబ్రవరి 11న తమిళనాడులో బ్లాక్‌డేగా జరుపుతారని ఏఐకేఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్ ధావలే, విజూ కృష్ణన్, ఏఐఏడబ్ల్యూయు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ. విజయరాఘవన్, బి వెంకట్లు తెలిపారు.