Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశ ఆర్థిక అవసరాలను సమతుల్యం చేసే బడ్జెట్
- కొత్త పన్ను విధానంతో ప్రజల చేతుల్లో అధిక ఆదాయం
- బడ్జెట్‌పై చర్చకు ఆర్థిక మంత్రి సమాధానం
న్యూడిల్లీ : ప్రతిపక్షాలపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఎదురుదాడికి దిగారు. లోక్‌సభలో బడ్జెట్‌పై జరిగిన సాధారణ చర్చ ముగిసిన తరువాత శుక్రవారం నిర్మలా సీతారామన్ సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పకుండా, ఎదురుదాడికి దిగారు. ఆహార సబ్సిడీల్లో కోత విధించారన్న ప్రతిపక్షాల ఆరోపణల పట్ల కూడా ఆమె స్పందించారు. ప్రతిపక్షాల వాదనల్లో పస లేదని, తాము ఆహార సబ్సిడీలను రూ.1.97 లక్షల కోట్లతో రెట్టింపు చేశామని స్పష్టం చేశారు. 2023-24లోనూ ఇదే ఒరవడి కొనసాగుతుందని అన్నారు.
కాంగ్రెస్ చేస్తున్న అవినీతి ఆరోపణలకు ఘాటుగా స్పందించారు. 'అవినీతి గురించి కాంగ్రెస్ మాట్లాడుతుండటం ఆశ్చర్యంగా ఉంది. మీరు మీ నోళ్లను డెటాల్‌తో శుభ్రం చేసుకోండి భయ్యా. ఒకవేళ అలా చేసుకున్నా మీ నోళ్లు శుభ్రం కావు' అంటూ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. కొన్ని నెలల కిందట హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే పెట్రోల్ ధరలపై వ్యాట్ పెంచేసిందని నిర్మలా సీతారామన్ దుయ్యబట్టారు. దీంతో అక్కడ ఇంధన ధరలు పెరిగాయన్నారు. 'కాంగ్రెస్ సంప్రదాయం ఇదే. ఆరోపణలు చేస్తారు. సభ నుంచి వాకౌట్ చేస్తారు. అంతేగానీ ఎవరి మాటా వినరు' అంటూ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లాత్ బడ్జెట్ ప్రసంగంలో తప్పుల గురించి కూడా నిర్మలమ్మ ప్రస్తావించారు.'రాజస్థాన్ కష్టాల్లో ఉంది. తప్పులు ఎవరైనా చేస్తారు. కానీ గతేడాది బడ్జెట్ చదవాల్సిన పరిస్థితి ఎవరికీ రాకుండా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా' అంటూ వ్యంగ్యంగా అన్నారు.
దేశ ఆర్థిక అవసరాలను సమతుల్యం చేసే బడ్జెట్ అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కొత్త పన్ను విధానం ప్రజల చేతుల్లో అధిక ఆదాయాన్ని ఉంచుతుందని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోందని అన్నారు. ఆర్థిక వ్యవస్థకు కొత్త రెక్కలు తొడిగేందుకు మూలధన వ్యయం పెంపు మార్గాన్ని ఎంచుకున్నామని వివరించారు. చైనాలో కరోనా సంక్షోభం వల్ల అంతర్జాతీయంగా వస్తు ధరలు పెరిగాయని, ఓవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరుగుతోందని, ఇలాంటి పరిస్థితులు, అంతర్జాతీయ ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నడుమ సంక్షోభం నుంచి కోలుకుంటూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని వివరించారు. నూతన ఆదాయ పన్ను వ్యవస్థలో ఎలాంటి షరతులూ లేని రిబేట్ పెంపుదల నిర్ణయం తీసుకున్నామని సభకు వివరించారు.
ఉభయ సభల్లో ప్రతిపక్షాలు వాకౌట్
పార్లమెంటు ఉభయ సభల్లో శుక్రవారం ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే గురువారం చేసిన కొన్ని వ్యాఖ్యలపై ఛైర్మన్ జగదీప్ సింగ్ ధన్ఖర్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ప్రతిపక్ష ఎంపిలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. శుక్రవారం ఉదయం రాజ్యసభలో గందరగోళం మధ్య, కార్యక్రమాల సమయంలో జరిగిన ప్రతి ఉల్లంఘననూ లోతుగా పరిశీలిస్తానని ధన్ఖర్ అన్నారు. 'రెండు వైపుల నుంచి జరిగే ప్రతి ఉల్లంఘనలపై నా లోతైన పరిశీలన ఉంటుంది' అని ఆయన అన్నారు. మదురైలోని ఎయిమ్స్ ఏర్పాటుపై వాదనకు దిగడంతో లోక్‌సభలో కాంగ్రెస్, డిఎంకె, సిపిఎం, సిపిఐ ఎంపిలు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాకు వ్యతిరేకంగా వాకౌట్ చేశారు.
కాంగ్రెస్ ఎంపి రజనీ పాటిల్ సస్పెండ్
సభలో వీడియో రికార్డు చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపి రజనీ పాటిల్‌ను సస్పెండ్ చేశారు. బడ్జెట్ సెషన్ నుంచి కమిటీ నివేదికకు లోబడి కాంగ్రెస్‌కు చెందిన రజనీ పాటిల్ రాజ్యసభ నుంచి సస్పెండ్ అయ్యారు. అవమానకర రీతిలో సస్పెన్షన్ జరిగిందని, ఎంపికి స్పష్టత ఇచ్చే అవకాశం లేదని ఎస్పి ఎంపి జయా బచ్చన్ అన్నారు.