Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైడ్రోజన్ వెంచర్‌కు బ్రేక్
- ఫ్రెంచ్ కంపెనీ టోటల్ ఎనర్జీస్ నిర్ణయం
- ఆడిట్‌పై స్పష్టత వచ్చే వరకూ కొనసాగనున్న నిలుపుదల
న్యూఢిల్లీ : హిండెన్‌బర్గ్ నివేదికతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బడా పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి మరో షాక్ తగిలింది. అదానికి చెందిన 4.12 లక్షల కోట్లకు పైగా (50 బిలియన్ డాలర్లు) విలువైన హైడ్రోజన్ ఎనర్జీ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టే ప్రణాళికను నిలిపివేస్తున్నట్టు ఫ్రెంచ్ కంపెనీ టోటల్ ఎనర్జీస్ తెలిపింది. ప్రారంభించిన ఆడిట్ ఫలితాలు వచ్చే వరకూ ఈ ప్రాజెక్టు హోల్డ్‌లోనే ఉంటుందని తెలిపింది. ఫ్రెంచ్ కంపెనీ నిర్ణయంతో అదానీ కంపెనీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టయిందని మార్కెట్ నిపుణులు తెలిపారు. అదానీ గ్రూపుతో భాగస్వామ్యం గురించి గతేడాది జూన్‌లో టోటల్ఎనర్జీస్ ప్రకటన చేసింది. అయితే, తమ సంస్థ ఇప్పటి వరకూ కాంట్రాక్టుపై సంతకం చేయలేదని ఫ్రెంచ్ గ్రూపు చీఫ్ ఎగ్జిక్యుటీవ్ ప్యాట్రిక్ పౌయన్నే తెలిపారు. గతేడాది జూన్‌లో ఫ్రెంచ్ కంపెనీ చేసిన ప్రకటన ప్రకారం.. అదాని న్యూ ఇండిస్టీస్ లిమిటెడ్ (అనిల్)లో 25 శాతం వాటాను టోటల్ ఎనర్జీస్ తీసుకుంటుంది. రాబోయే పదేండ్లలో గ్రీన్ హైడ్రోజన్ ఎకో సిస్టమ్‌లో 50 బిలియన్ డాలర్ల పెట్టుబడికి ( రూ. 4.12 లక్షల కోట్లకు పైగా) అదానీ గ్రూపు యోచించింది. ఇంతలో హిండెన్‌బర్గ్ నివేదిక రావడం.. అదానీ గ్రూపునకు ఒకదాని తర్వాత మరొకటి ఎదురు దెబ్బలు తాకటం మొదల య్యాయి. తాజాగా ఫ్రెంచ్ కంపెనీ రూపంలో మరోక దెబ్బ తాకింది.
మాకు ఒక స్పష్టత వచ్చే వరకు హైడ్రోజన్ ప్రాజెక్టు నిలుపుదలలోనే ఉంటుందని ప్యాట్రిక్ పౌయన్నే స్పష్టం చేశారు. అదానీ గ్రూపులో రూ. 25.55 వేల కోట్లు (3.1 బిలియన్ డాలర్ల) అవగాహనను టోటల్ఎనర్జీస్ కలిగి ఉన్నది. అయితే, తనపై వచ్చిన ఆరోపణలను అదానీ గ్రూపు తోసిపుచ్చింది. అదానీకి ఇప్పుడు ఇతర విషయాలు ఉన్నాయనీ, ఆడిట్ కొనసాగుతున్నందున నిలుపుదల శ్రేయస్కరమనీ పౌయన్నే తెలిపారు.