Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పార్లమెంట్లో వామపక్ష ఎంపీల ఆందోళన
న్యూఢిల్లీ : జీతానికి అనుగుణంగా పీఎఫ్ పెన్షన్ను చెల్లించాలన్న సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని సీపీఐ(ఎం) పార్లమెంటరీ పార్టీ నేత ఎలమారం కరీం డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం పార్లమెంట్ ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద వామపక్ష ఎంపీలు ధర్నాకు దిగారు. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలనీ, కార్మిక సంఘాలు చాలా కాలంగా కోరుతున్న కనీస పెన్షన్ను రూ.9 వేలకు పెంచాలని ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు హోరెత్తించారు. ఈ సందర్భంగా ఎలమారం కరీం మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని విమర్శించారు. దాదాపు 27 లక్షల మంది పెన్షనర్ల పట్ల కేంద్ర ప్రభుత్వం క్రూరమైన విధానాలను అవలంభిస్తున్నదని విమర్శించారు. దేశానికి నిజమైన సంపద సృష్టికర్తలైన కార్మికుల పట్ల కేంద్రం అనుసరిస్తున్న విధానాలు దారుణంగా ఉన్నాయన్నారు. ఆందోళనలో సీపీఐ(ఎం) ఎంపీలు జాన్ బ్రిట్టాస్, వి శివదాసన్, ఎఎ రహీం, ఎఎం ఆరిఫ్, పిఆర్ నటరాజన్, బికాష్ రంజన్ భట్టాచార్య, సీపీఐఐ ఎంపీలు బినరు విశ్వం, పి. సంతోష్ కుమార్, కేరళ కాంగ్రెస్ ఎంపీ జోస్ కె మణి పాల్గొన్నారు.