Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పురస్కారాన్ని తిరస్కరించిన తమిళనాడు కవయిత్రి
- ఓడరేవు అభివృద్ధి సమయంలో రైతు, రైతు కూలీలకు అన్యాయంపై నిరసన
న్యూఢిల్లీ : అదానీ గ్రూప్ వివాదం రాజకీయేతర రంగాల్ని సైతం ప్రభావితం చేస్తోంది. ఈ ఏడాది దేవీ అవార్డు స్పాన్సరర్స్ అదానీ గ్రూప్ కావటంతో, అవార్డును తీసుకోవడా నికి తమిళనాడుకు చెందిన ఓ కవయిత్రి, సామాజిక కార్యకర్త, ఉపాధ్యాయురాలు నిరాకరించారు. తమిళనాడులోని రానిపెట్ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న సుకీర్తారాణి తమిళ భాషలో దళిత సాహిత్యంపై పేరొందిన రచనలు చేశారు. సామాజిక కార్యకర్తగా, కవయిత్రిగా ఆమె కృషిని గుర్తిస్తూ ఎన్నో అవార్డులు, పురస్కారాలు వెదుక్కుంటూ వచ్చాయి. ఆమె రాసిన తమిళ కవితలు తమిళనాడులోని కళాశాల పాఠ్యాంశాలలో ఉన్నాయి. ఇంగ్లీష్, హిందీ, మలయాళం, కన్నడ, జర్మన్ భాషల్లో అనువాదం పొందాయి. వివిధ రంగాల్లో కృషి చేసిన మహిళలకు ఇచ్చే దేవి అవార్డుకు ఈ ఏడాది ఆమె ఎంపికయ్యారు.
బుధవారం చెన్నైలో అవార్డుల బహుకరణ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా కార్యక్రమానికి పుదుచ్చెరి గవర్నర్ కిరణ్ బేడి హాజరై అవార్డులు అందజేశారు. అదానీ గ్రూప్, వెల్లూర్ ఇనిస్టిట్యూట్, ప్రముఖ దుస్తుల తయారీ బ్రాండ్ అహుజా సన్స్ ఈ ఏడాది దేవి అవార్డులకు స్పాన్సర్స్‌గా ఉన్నాయి. ఈవిషయం తెలుసుకున్న సుకీర్తారాణి, తాను అవార్డును తీసుకోవటం లేదని ప్రకటించారు. తాను నమ్మిన విలువలకు, సిద్ధాంతాలకు విరుద్ధంగా వెళ్లలేనని, అందువల్లే అవార్డు తీసుకోవటం లేదని ఆమె ప్రకటించారు.
''చెన్నైకి ఉత్తరంగా కట్టుపల్లి ఓడరేవు అభివృద్ధి ప్రాజెక్టు అదానీ గ్రూప్ దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఆ కంపెనీ వ్యవహారం మా అందరికీ తెలుసు. ఎంతోమంది రైతుల నుంచి భూములు లాక్కుంది. దీంతో రైతు కూలీలంతా దిక్కులేని వారయ్యారు. ఒక సామాజిక కార్యకర్తగా దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నా. అందువల్లే దేవి అవార్డును స్వీకరించలేదు'' అని వివరించారు.
ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ద న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రతిఏటా దేవీ అవార్డులు అందజేస్తోంది. 2023 ఏడాదికి గాను 12మంది మహిళలను అవార్డుకు ఎంపిక చేశారు. ''ఆయా రంగాల్లో కృషి చేసిన మహిళల్ని గౌరవిస్తూ అవార్డును అందజేస్తున్నారు. జడ్జిమెంట్ గ్రూప్‌ను గౌరవిస్తున్నా. నన్ను ఎంపిక చేసినందుకు వారికి కృతజ్ఞతలు. అయితే ఈ ఏడాది అవార్డు బహుకరణలో ముఖ్యమైన స్పాన్సర్ అదానీ గ్రూప్. కాబట్టి నేను అవార్డు తీసుకోవటం లేదు''అని మీడియాకు తెలిపారు. అదానీ గ్రూప్ అక్రమాల్ని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ బట్టబయలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అదానీ గ్రూప్ ఆగడాలపై తనకు ఇంతకు ముందే అనుభవాలున్నాయని ఆమె తెలిపారు.