Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2014లో 1.28 లక్షల ఖాళీలు భర్తీ
- 2021లో కేవలం 64వేల నియామకాలు
- ప్రమోషన్లలోనూ అంతే..ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ప్రాతినిథ్యంలో తగ్గుదల
న్యూఢిల్లీ : కేంద్రంలో మోడీ సర్కార్ వచ్చింది మొదలు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు గణనీయం గా తగ్గాయని ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళన వాస్తవమని తేలిపోయిం ది. డైరెక్ట్ రిక్రూట్మేంట్ ద్వారా చేపట్టిన ఉద్యోగాల భర్తీలో తగ్గుదల 50శాతానికిపైగా ఉందని కేంద్రం విడుదల చేసిన తాజా గణాంకాలే చెబుతున్నాయి. మరొక ఆందోళనకర విషయం ఏమిటంటే, ఏడేండ్లుగా మోడీ సర్కార్ చేపట్టిన ఉద్యోగాల భర్తీలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోంది. నియామకాల్లో, ప్రమోషన్లలో ఆయా సామాజిక వర్గాల ప్రాతినిథ్యం క్రమంగా తగ్గుతూ వస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. 2014-2021 మధ్య ఏడేండ్లుగా కేంద్రం చేపట్టిన ఉద్యోగ నియామకాలపై పీఎంకే ఎంపీ అన్బుమణి రామ్‌దాస్ లోక్‌సభలో కేంద్రం నుంచి వివరాలు కోరారు. ఈ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర సహాయమంత్రి ఎ.నారాయణస్వామి లోక్‌సభలో కొన్ని గణాంకాలు విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సామాజిక వర్గాల వారీగా గణాంకాల్ని సభ ముందుంచారు. ఈ వివరాల ప్రకారం, డైరెక్ట్ రిక్రూట్మేంట్స్ ద్వారా ఉద్యోగాల భర్తీ 2014లో 1,28,629 కాగా..ఆ తర్వాత ప్రతిఏటా తగ్గుతూ వస్తోంది. 2021లో నియామకాలు 64,073కు పరిమితమైంది. ఉద్యోగాల భర్తీలో తగ్గుదల సగానికిపైగా ఉంది. అలాగే ఎస్సీ కేటగిరీలో నియామకాలు (2014లో) 21,673 నుంచి (2021నాటికి) 10,200కు పడిపోయింది. ఎస్టీ నియామకాలు 10,843 నుంచి 4573కు, ఓబీసీ కేటగిరిలో 40,513 నుంచి 19,660కి తగ్గింది. వాస్తవ గణాంకాలు ఓ వైపు ఇలా ఉంటే, ఓబీసీ రిజర్వేషన్ 27శాతానికి మించి నియామకా లున్నాయని సభలో నారాయాణ స్వామి వెల్లడించటం గమనార్హం. అంతేగాక ప్రమోషన్ల ద్వారా ఉద్యోగ నియామకాల్లోనూ కేంద్రం తీరు వివాదాస్పదంగా ఉంది. ప్రమోషన్ల నియామకాలు 1,73,363 నుంచి 1,40,908కి తగ్గింది. డైరెక్ట్ రిక్రూట్మేంట్, ప్రమోషన్ల ద్వారా మొత్తం నియామకాల్లోనూ తగ్గుదల కనపడింది. నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల ప్రాతినిథ్యం కూడా పడిపోయింది. ఎస్సీ కేటగిరిలో నియామకాలు 2014లో 32,599 ఉండగా, 2021 నాటికి 24,794కు పడిపోయింది. ఎస్టీ కేటగిరిలో 14,112 నుంచి 10,938కి తగ్గింది. రెండు పద్ధతులతో చేపట్టిన ఉద్యోగాల భర్తీలో ఎస్సీ, ఎస్టీల ప్రాతినిథ్యంలోనూ తగ్గుదల నమోదైంది. ఓబీసీ ప్రాతినిథ్యం 31.5 శాతం నుంచి 30శాతానికి పడిపోయింది.