Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వామపక్ష-కాంగ్రెస్ కూటమిదే అధికారం : ఏచూరి
- టిప్రా మోతాతో స్థానిక స్థాయి ఒప్పందం కుదిరే అవకాశం : సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఏచూరి
అగర్తల : త్రిపురలో ఈనెల 16న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో లెఫ్ట్, కాంగ్రెస్ కూటమి విజయం సాధిస్తుందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడదని చెప్పారు. టిప్రా మోతాతో ఎన్నికలకు ముందు ఎలాంటి సర్దుబాటు లేకపోయినప్పటికీ.. ఆదివాసీ పార్టీతో స్థానిక స్థాయిలో అవగాహన కుదిరే అవకాశం ఉన్నదని అన్నారు. లౌకిక ప్రజాస్వామిక శక్తులకు అనుకూలంగా ప్రజలు తీర్పును ఇస్తారని అన్నారు.
రాష్ట్రంలోని ప్రజలు ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారనీ ఏచూరి తెలిపారు. 'ప్రజాస్వామ్యంపై దాడి', ఉగ్రవాదం, దుష్పరిపాలన, అవినీతి పాలనపై త్రిపుర ప్రజలు విసుగు చెందారని అన్నారు. కొన్ని రోజులలో ఎన్నికలు జరగనున్న తరుణంలో అధికార పార్టీ ధన, అధికార బలాన్ని తీవ్రంగా ఉపయోగించేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు. ఇప్పటికే బెదిరింపులకు తెరలేపిందని తెలిపారు.
కేంద్ర పారామిలటరీ బలగాల కొరత పేరుతో అసోం, గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి సాయుధ పోలీసు బలగాలు మోహరించబడ్డాయని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, చట్టాన్ని నిలబెట్టేలా సాధ్యమైన అన్ని చర్యలూ తీసుకోవాలని ఢిల్లీలో ఎన్నికల సంఘాన్ని ఒక బృందం కలవనున్నట్టు తెలిపారు. లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి సీఎం అభ్యర్థిని ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎంపిక చేసుకుంటారని ఏచూరీ అన్నారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలన్న ఆలోచనలో ప్రజలు ఉన్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర సెక్రెటరీ జితేంద్ర చౌదరి అన్నారు. బీజేపీ దుష్టపాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యంపై దాడి జరిగిందని అన్నారు. రాష్ట్రంలో ధన ప్రవాహం జరుగుతున్నదనీ, గత కొన్ని రోజుల్లోనే రూ. 4 కోట్ల సీజ్ జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో సీఈఓ తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. 60 స్థానాలున్న త్రిపుర అసెంబ్లీ ఎన్నికలను ఈనెల 16న జరగనున్నాయి. 28 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.