Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిస్కమ్‌ల బోర్డు నుంచి ఆప్ ప్రతినిధుల తొలగింపు
- లెఫ్టినెంట్ గవర్నరు నిర్ణయంపై ఆమాద్మీ ఆగ్రహం
- ఇది రాజ్యాంగ ఉల్లంఘనేనని విమర్శ
న్యూఢిల్లీ : ఢిల్లీలోని అధికార ఆమాద్మీ పార్టీకి, లెఫ్టినెంట్ గవర్నరు వికె సక్సేనాకు మధ్య మరో వివాదం రాజుకుంది. కేంద్రంలోని మోడీ సర్కార్‌కు కీలుబొమ్మలా బిజెపి అజెండాను ఢిల్లీలో బలవంతంగా రుద్దేందుకు సక్సేనా ప్రయత్నిస్తున్నారంటూ ఇప్పటికే పలు అంశాల్లో ఆయన జోక్యాన్ని ఆప్ నిరసించిన సంగతి విదితమే. తాజాగా ఆప్ కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా లెఫ్టినెంట్ గవర్నరు నిర్ణయం తీసుకున్నారు. ప్రయివేటు డిస్కమ్‌ల బోర్డు సభ్యులుగా ఉన్న ఆప్ అధికార ప్రతినిధి జాస్మిన్ షా, ఆప్ ఎంపి ఎన్డి గుప్తా కుమారుడు నవీన్ ఎన్డి గుప్తాను ఆయన తొలగించారు. గవర్నర్ తీసుకున్న ఈ నిర్ణయం రాజ్యాంగ ఉల్లంఘనేనని, చట్టానికి విరుద్ధమని ఆప్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యుత్‌పై ఉత్తర్వులు జారీ చేసే అధికారం ఎన్నికైన ప్రభుత్వానికే ఉంటుందని, గవర్నర్‌కి ఉండదని ఆప్ విమర్శిస్తోంది. గవర్నర్ సక్సేనా సుప్రీంకోర్టు ఆదేశాలను తోసిపుచ్చుతున్నారని, రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని ఈ సందర్భంగా ఆప్ నేత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా విమర్శించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి ఉండే హక్కులను గవర్నరు కాలరాస్తున్నారని వాపోయారు. కాగా, బివైపిల్, బిఆర్పిల్ (అనీల్ అంబానీ), ఎన్‌డిపిడిసిఎల్ (టాటా) బోర్డుల్లో ప్రభుత్వ నామినీలుగా ఉన్న జాస్మిన్, నవీన్ గుప్తా.. రాష్ట్ర ఖజానా ఖర్చుతో ప్రైవేటు డిస్కమ్‌లకు ఆర్థిక ప్రయోజనాలను అందించారని విద్యుత్ బోర్డు ప్రధాన కార్యదర్శి అందించిన నివేదిక ఆధారంగా లెఫ్టినెంట్ గవర్నర్ బోర్డు సభ్యులుగా ఉన్న వారిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారని ఆయన కార్యాలయం పేర్కొంది. అలాగే అనీల్ అంబానీ యాజమాన్యంలోని డిస్కమ్‌ల బోర్డులలో జాస్మిన్, నవీన్ గుప్తా ప్రైవేట ప్రతినిధులకు సహకరించి.. 8 వేల కోట్ల మేర ప్రయోజనం చేకూర్చారని లెఫ్టినెంట్ గవర్నర్ పేర్కొన్నారు. ఇక ఆ ఇద్దరి బోర్డు సభ్యుల స్థానంలో వేరొకరిని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం నామినేట్ చేసేంతవరకు సీనియర్ ప్రభుత్వ అధికారులను నియమించడం ఆనవాయితీ అని సక్సేనా తెలిపారు.