Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇది పౌరులందరి బాధ్యత
- మహారాష్ట్ర న్యాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో జస్టిస్ చంద్రచూడ్
ముంబయి : భారత రాజ్యాంగ పీఠికలో మనకు మనం నిర్దేశించుకున్న 'అందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం' లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని సుప్రీంకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ కోరారు. రాజ్యాంగ లక్ష్యాల సాధన అనేది దేశ పౌరులందరి బాధ్యత అని ఆయన నొక్కి చెప్పారు. శనివారం నాగ్‌పూర్‌లోని మహారాష్ట్ర జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవ కార్యక్రమంలో జస్టిస్ చంద్రచూడ్ ప్రసంగించారు. ''అందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం సాధించాలి'' అంటూ పీఠికలో పేర్కొన్న వాగ్దానాన్ని నెరవేర్చడానికి పౌరులుగా ప్రతి ఒక్కరం పాటు పడాలని పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగమనేది స్వపరిపాలన, గౌరవం, స్వాతంత్య్రం యొక్క అత్యద్భుతమైన స్వదేశీ ఉత్పత్తిగా ఆయన అభివర్ణించారు. కానీ కొందరు దీనిపై పూర్తిగా ద్వేషపూరితమైన రీతిలో మాట్లాడుతుంటే, చాలామంది భారత రాజ్యాంగం సాధించిన విజయం గురించి విరక్తిగా మాట్లాడతారని అన్నారు. కానీ ఈ రెండింట్లోనూ వాస్తవికత లేదని అన్నారు. భారతదేశ వలసవాద నాయకులు మనపై రాజ్యాంగాన్ని రుద్దలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. మన రాజ్యాంగమనేది ఎలా ఆవిర్భవించిందో ఆ కోణంలో నుండి చూసినట్లైతే, అదొక అత్యద్భుతమైన అంశంగా గుర్తిస్తారని ఆయన స్పష్టం చేశారు. చేయాల్సిన పనులు ఇంకా చాలా వున్నప్పటికీ రాజ్యాంగం చేసిన పనులు, కృషి కూడా చాలా వుందని అన్నారు. యువ న్యాయ విద్యార్ధులు, న్యాయ పట్టభద్రులు రాజ్యాంగ విలువల మార్గదర్శకత్వంతో వృత్తి జీవితంలో ముందుకు సాగినట్లైతే వారెన్నటికీ విఫలమవరని ఆయన వ్యాఖ్యానించారు. రాజ్యాంగ పీఠిక గురించి ప్రస్తావిస్తూ, చిన్నదిగానే వున్నా రాజ్యాంగానికి ఇది బరువును చేకూర్చిందన్నారు. భారత ప్రజలుగా మనం ఈ రాజ్యాంగానికి కట్టుబడి వుండాలని ఆకాంక్షించారు. ఈనాడు అత్యంత సులభంగా మనం అనుభవిస్తున్న రాజ్యాంగ హక్కులు, సౌకర్యాలకు గానూ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌కు మన భారతీయులందరం రుణపడి వున్నామన్నారు.