Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికల సమయాల్లో మోడీ సర్కారు భారీ హామీలు
- ఎన్డీయే-1 నుంచి ఎన్డీయే-2 వరకు ఇదే తీరు
- నెరవేరని పక్కా ఇండ్లు.. ప్రతి ఇంటికీ విద్యుత్.. రైతుల ఆదాయం
రెట్టింపు వాగ్దానాలు
- ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ.. స్మార్ట్ సిటీ.. బుల్లెట్ ట్రైన్లదీ అదే దారి
- ముగిసిన 2022 డెడ్‌లైన్.. కొత్తగా '2047' ముందుకు
- కేంద్రం తీరుపై ప్రజలు, రైతుల ఆగ్రహం
కేంద్రంలోని మోడీ సర్కారు చేసే హామీల ప్రకటనలు.. వాటి అమలుకు తీసుకుంటున్న చర్యలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి. 2014లో తొలిసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మోడీ సర్కారు..2019లో రెండోసారీ అధికారాన్ని చేపట్టిన తర్వాత.. పలు వాగ్దానాల అమలుకు 2022ను డెడ్‌లైన్‌గా విధించింది. పక్కా ఇండ్లు, ఇంటింటికీ విద్యుత్ కనెక్షన్, రైతుల ఆదాయం రెట్టింపు, స్మార్ట్ సిటీల ఏర్పాటు, బుల్లెట్ ట్రైన్లను తీసుకురావడం, దేశాన్ని ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడం, అంతరిక్షానికి మానవ సహిత ఉపగ్రహాన్ని పంపడం వంటివి మోడీ సర్కారు చేసిన మేజర్ హామీలు. అయితే, ఇప్పటికీ ఈ హామీలేవీ నెరవేరకపోగా.. కొత్తగా '2047 ఏడాది' రాగాన్ని మోడీ సర్కారు తీస్తున్నది.
న్యూఢిల్లీ : అమలుకు సాధ్యం కాని భారీ హామీలతో కేంద్రంలో మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలను వంచిస్తున్నది. పలు సందర్భాలలో భారీ వాగ్దానాలను ప్రకటించి.. అందుకు నిర్ణీత గడువునూ విధించుకొని.. అమలులో మాత్రం పూర్తిగా విఫలమైంది. దేశం 2022లో 75వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకోబోయే సందర్భంగా ఈ హామీలను పూర్తి చేస్తామని అనేక వేదికలలో మోడీ చెప్పారు. ఇప్పుడు ఆ గడువు కూడా ముగిసింది. దీంతో చేసేదేమీ లేక మోడీ సర్కారు మౌనం వహించింది. మోడీ సర్కారు ప్రకటించిన అమలు చేయని వాటిలో పలు కీలక వాగ్దానాలు ఉన్నాయి.
ప్రతి ఇంటికీ 24 గంటల విద్యుత్
2022 నాటికి దేశంలోని ప్రతి ఇంటికీ 24 గంటల విద్యుత్ సౌకర్యాన్ని కల్పిస్తామని 2015 సెప్టెంబర్‌లో మోడీ ప్రకటించారు. మోడీ విధించుకున్న గడువు కూడా ముగిసింది. భారత్‌లోని అనేక ఇండ్లు ఇప్పటికీ విద్యుత్‌కు నోచుకోక ఇక్కట్లను ఎదుర్కొంటున్నాయి. దేశంలోని అనేక గ్రామాలకు ఇప్పటికీ విద్యుత్ సౌకర్యం అందకపోవడం గమనార్హం.
ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ
2022 నాటికి భారత్ ఐదు ట్రిలియన్ డాలర్ల (దాదాపు రూ. 4.12 కోట్ల కోట్లు)ఆర్థిక వ్యవస్థగా మారుతుందని 2018 సెప్టెంబర్‌లో ప్రధాని ప్రకటించారు. 2018 నుంచి అనేక ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యక్రమాల్లో, ఎన్నికల ర్యాలీలు, విదేశాల్లో సైతం మోడీ ఈ ప్రకటనను తరచుగా వినిపించారు. కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు సైతం ఇవే మాటలను పెద్దగా వినిపించారు. గడువు ముగియడంతో ప్రధానితో పాటు మంత్రులు, బీజేపీ నాయకులు ఈ ప్రకటనపై ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. భారత ఆర్థిక వ్యవవస్థ ఇప్పటికి మూడు ట్రిలియన్ డాలర్ల వద్దే ఆగిపోవడం గమనార్హం.ఇటు అమెరికా పరిశోధక ఏజెన్సీ అదానీపై సంచలన రిపోర్టును ప్రకటించిన అనంతరం రెండు వారాల్లోనే భారత ఆర్థిక వ్యవస్థ ర్యాంకు ఐదు నుంచి ఆరుకు పడిపోయింది.
బుల్లెట్ ట్రైన్
బుల్లెట్ ట్రైన్ గురించి మోడీ సర్కారు, బీజేపీ నాయకులు గొప్ప ప్రచారాలు చేశారు. 2022 నాటికి భారత్‌లో బుల్లెట్ రైలు పరుగులు తీస్తుందని నాలుగేండ్ల క్రితం ప్రధాని చెప్పారు. గల్ఫ్ దేశం ఒమన్‌లోని ప్రవాస భారతీయుల సమక్షంలో ఈ డెడ్‌లైన్‌ను మోడీ ప్రకటించారు. అయితే ఆ హామీ కూడా నెరవేరలేదు. కేవలం మహారాష్ట్రలో బీజేపీ మద్దతుతో నడుస్తున్న ఏక్నాథ్ శిండే ప్రభుత్వం మాత్రమే భూసేకరణ కోసం పనులు చేపడుతుండటం గమనార్హం.
అంతరిక్షంలోకి మానవ సహిత ఉపగ్రహం
అంతరిక్షంలోకి తమ సొంత వాహకనౌకలో ఒక భారతీయుడు 2022 నాటికి వెళ్తాడని మోడీ హామీ ఇచ్చారు. ఈ లక్ష్యం నెరవేరితే మానవ సహిత ఉపగ్రహాన్ని పంపిన నాలుగో దేశంగా భారత్ నిలిచేది. కానీ, 2022 ముగిసినా కూడా మోడీ ప్రకటించిన హామీ కార్యరూపం దాల్చకపోవడంతో భారత్‌కు ఆ ఘనత సాధించే అవకాశం కలగానే మిగిలిపోయిందని విశ్లేషకులు అన్నారు. ప్రస్తుతం ఈ హామీని మోడీ కూడా మర్చిపోయి ఉండొచ్చని తెలిపారు.
స్మార్ట్ సిటీ
ఇతర పథకాలు, ప్రకటనలను పక్కనబెడితే మోడీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం స్మార్ట్ సిటీ పథకం. 2015లో దీనిని తీసుకొచ్చింది. స్మార్ట్ సిటీ పథకం కింద వంద నగరాలను ఎంపిక చేసి పలు వసతుల కల్పన కోసం 2022ను గడువు తేదీగా మోడీ సర్కారు విధించింది. అయితే, ఈ గడువు ముగిసినా.. దేశంలో ఒక్క స్మార్ట్ సిటీని కూడా తయారు చేయలేకపోవడం మోడీ సర్కారుకే చెల్లిందని నిపుణులు, విశ్లేషకులు అన్నారు. ఈ ప్రకటనలు, పథకాల అమలుకు 2022 ను గడువుగా నిర్ణయించుకున్న మోడీ సర్కారు.. వాటిని పూర్తి చేయడంలో మాత్రం పూర్తిగా విఫలమైంది. ఇప్పుడు భారత్ 100 ఏండ్ల స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకోబోయే ఏడాది అంటూ 2047 ఏడాదిని ప్రధాని మోడీ ముందుకు తీసుకొచ్చారు. రెండు దఫాలుగా దేశాన్ని పాలించి ఇచ్చిన కీలక హామీలలో ఏ ఒక్కదానిని కూడా నెరవేర్చని ఎన్డీయే ప్రభుత్వాలు.. కొత్త టార్గెట్‌తో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు, నిపుణులు అన్నారు.
పక్కా గృహాలు
2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానిగా మోడీ చేసిన అతిపెద్ద ప్రకటనల్లో ఒకటి దేశంలోని ప్రతి ఒక్క కుటుంబానికీ పక్కా గృహాన్ని కట్టించటం. 2022లో భారత్ 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను జరుపుకోబోయే సందర్భంలో ప్రతి ఒక్కరికీ ఈ ఇండ్లు అందేలా చూస్తామని మోడీ హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం పక్కా గృహాలకు టారులెట్లు, విద్యుత్, నీటి వసతులు వంటివీ కల్పిస్తామని తెలిపారు. ఎర్రకోటపై ఇచ్చే ప్రసంగంతో పాటు 2021లో దేశంలో జరిగిన పలు ఎన్నికల ర్యాలీలో ఇదే ప్రస్తావనను మోడీ తీసుకొచ్చారు. అయితే, 2022 గడిచిపోయింది.
కోట్లాది కుటుంబాలు ఇప్పటికీ ఇండ్లు లేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. పలుకుటుంబాలు మురికి ప్రాంతాల్లో నివసిస్తున్నాయి. గడవు ముగిసిపోవడంతో ఇప్పుడు మోడీ నోటి నుంచి ఈ ప్రకటనకు సంబంధించిన మాట కానీ లేదా కొత్త గడువు కానీ రాకపోవడం గమనార్హం.
రైతుల ఆదాయం రెట్టింపు
దేశంలోని అన్నదాతల్లో ఆశలు చిగురింపజేసిన హామీ రైతు ఆదాయాలను రెట్టింపు చేస్తామని హామీ ఇవ్వడం. 2022 నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామని 2017 నుంచి మోడీ అనేక సందర్భాలలో ఈ వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. 2021కు వరకు ప్రతి బడ్జెట్లోనూ కేంద్రం ఈ హామీని పునరుద్ఘాటించింది. అయితే, కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద సాగు చట్టాలకు రైతన్నల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి ఈ హామీ గురించి మోడీ మాట్లడటం ఆపేశారు. 2022 ముగిసినా.. ఇప్పటికీ దేశంలోని రైతుల ఆదాయం రెట్టింపు కాకపోవడం గమనార్హం. అదీ చాలక 2023-24 బడ్జెట్లో మోడీ సర్కారు వ్యవసాయానికి బడ్జెట్లో కోతలు విధించింది.