Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదానీ వ్యవహారంపై నిపుణుల కమిటీకి ఓకే
- సుప్రీం సూచనకు ఒప్పుకున్న సర్కార్
- సర్వోన్నత న్యాయస్థానానికి వెల్లడించిన సొలిసిటర్ జనరల్
అమెరికా సంస్థ హిండెన్‌బర్గ్ నివేదిక అదానీ గ్రూపుతో పాటు భారత స్టాక్ మార్కెట్‌ను ఒక కుదుపు కుదిపింది. ఇది రాజకీయంగానూ తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ విషయాన్ని పార్లమెంటులో ప్రతిపక్షాలు లేవనెత్తాయి. దీనిపై విచారణ జరిపించడానికి జేపీసీ వేయాలని డిమాండ్ చేశాయి. మొత్తానికి అదానీ వ్యవహారం మోడీ సర్కారుకు మాయని మచ్చ తెచ్చిపెట్టిందని విశ్లేషకులు తెలిపారు.
న్యూఢిల్లీ : అదానీ గ్రూపు వ్యవహారంపై ఎట్టకేలకు కేంద్రం దిగొచ్చింది. సుప్రీంకోర్టు సూచన మేరకు మదుపరుల రక్షణ విషయంలో సెబీ యంత్రాంగాన్ని పటిష్టపరిచేందుకు కేంద్రం ముందుకొచ్చింది. ఈ మేరకు నిపుణుల కమిటీ ఏర్పాటుకు అంగీకరించింది. ఈ విషయాన్ని కేంద్రం సర్వోన్నత న్యాయస్థానానికి వెల్లడించింది. అదానీ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. కేంద్రం, సెబీ తరఫున భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహత వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా కమిటీ ఏర్పాటుపై కేంద్రం సమ్మతిని సుప్రీంకోర్టుకు తుషార్ మెహతా తెలిపారు. భవిష్యత్తులో పెట్టుబడిదారులకు రక్షణ ఎలా ఉంటుందో సూచించడానికి ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరమూ లేదని చెప్పారు. పరిస్థితిని ఎదుర్కోవడానికి సెబీ సమర్థవంతంగా ఉన్నదని తెలిపారు.
కమిటీ నిర్వహణ గురించి చెప్పాలని సుప్రీంకోర్టు తుషార్ మెహతను కోరింది. ప్రతిపాదిత విధి విధానాలపై బుధవారం లోగా నోట్ సమర్పించాలని కేంద్రాన్ని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే పిటిషన్ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. కమిటీపై వివరణనిస్తూ.. కమిటీకి సంబంధించిన పేర్లను త్వరలోనే అందజేస్తామనీ, విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఆ పేర్లను సీల్డు కవర్లో అందించనున్నట్టు తుషార్ మెహత చెప్పారు. కమిటీ ఏర్పాటు విషయంలో ఏదైనా విషయం అనుకోకుండా బయటకు వెళితే నిధుల ప్రవాహంపై ప్రభావం పడే అవకాశం ఉన్నదని తెలిపారు. హిండెన్‌బర్గ్ నివేదిక అనంతరం తలెత్తిన పరిస్థితులపై సెబీ సహా ఇతర అత్యున్నత సంస్థలు దర్యాపు చేస్తున్నాయని వివరించారు. హిండెన్‌బర్గ్ నివేదికపై దర్యాప్తు జరపాలని కోరుతూ విశాత్ తివారీ, మనోహర్‌లాల్ శర్మ లు వేసిన రెండు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఈనెల 10న విచారణ జరిపింది. ఈ ధర్మాసనంలో సీజేఐ చంద్రచూడ్‌తో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జె.బి పార్ధివాలలు ఉన్నారు. స్టాక్ మార్కెట్లో లక్షల కోట్ల రూపాయలు ఆవిరి కావడంపై కోర్టు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. భారత మదుపరులను రక్షించాల్సి ఉన్నదని అభిప్రాయం వ్యక్తం చేసింది. రెగ్యులేటరీ ప్రక్రియపై కేంద్రం, సెబీ అభిప్రాయాలను కోరింది. దీనిపై విశ్రాంత న్యాయమూర్తి పర్యవేక్షణలో నిపుణుల కమిటీని వేయాలని సూచించింది. దీంతో ఈ వేర్వేరు పిటిషన్లపై సోమవారం కొనసాగిన విచారణలో కమిటీ ఏర్పాటుకు కేంద్రం తన సమ్మతిని తెలిపింది.