Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడేండ్లలో 1.12 లక్షల మందికి పైగా ఆత్మహత్యలు
- మొత్తం ఆత్మహత్యలు 4.56 లక్షలకు పైనే..!
- పార్లమెంటులో కేంద్రం వెల్లడి
న్యూఢిల్లీ : మోడీ పాలనలో కార్మికుల జీవితాలకు భద్రత కరువైంది. రెక్కాడితే గానీ డొక్కాడని దినసరి కూలీల బతుకులు అర్ధాంతరంగా ముగుస్తున్నాయి. నూరేండ్ల ఆయుష్షు నిండకుండానే బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు తీవ్రమవుతున్నాయి. దేశంలో రోజువారీ కూలీల బలవన్మరణాలపై కేంద్రం పార్లమెంటులో వెల్లడించిన సమాచారం దీనిని తెలియజేస్తున్నది. కాంగ్రెస్ ఎంపీ తిరునవుక్కరసర్ అడిగిన ప్రశ్నకు సమాధానం కేంద్ర కార్మిక మంత్రి భూపెందర్ యాదవ్ సమాచారాన్ని తెలిపారు. దీని ప్రకారం.. 2019-21 మధ్య మూడేండ్లలో మొత్తం 1.12 లక్షల మందికి పైగా రోజువారీ కూలీలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. 2019లో 32,563 మంది, 2020 లో 37,666 మంది, 2021లో 42,004 మంది ఆత్మహత్య చేసుకొన్నారు. 2020, 2021 ఏడాదుల్లో కరోనా మహమ్మారి విజృంభించడం, మోడీ సర్కారు విధించిన లాక్డౌన్ వంటి పరిస్థితులు కార్మికులు, కూలీలకు నరకయాతనను చూపించిన విషయం తెలిసిందే. 2020 లో రైల్వే ట్రాకులపై 8,700 మందికి పైగా వ్యక్తులు చనిపోయారు. వీరిలో అధికం వలస కార్మికులే కావడం గమనార్హం. కాగా, ఈ మూడేండ్లలో దేశంలో మొత్తం 4.56 లక్షల మంది ( రోజువారీ కూలీలతో కలుపుకొని ) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇందులో గృహిణిలు 66,912 మంది, సొంతంగా వ్యాపారాన్ని చేసుకునే వారు 53,661 మంది, ఉద్యోగులు 43,420 మంది, నిరుద్యోగులు 39,950 మంది, వ్యవసాయ రంగం మరియు వ్యవసాయ పనుల్లో ఉన్నవారు 31,839 మంది ఉన్నారు.