Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగిసిన మొదటి విడత సమావేశాలు...
న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ మొదటి విడత సమావేశాలు ముగిశాయి. దీంతో పార్లమెంట్ ఉభయ సభలు మార్చి 13కి వాయిదా పడ్డాయి. మార్చి 13 నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మొదలైనప్పటి నుంచి అదానీ అంశంపై చర్చ జరపాలంటూ ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో అదానీ గ్రూపు మోసాలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయడంతో పాటు కాంగ్రెస్ ఎంపీ రజనీ పాటిల్ సస్పెన్షన్ ను ఎత్తివేయాలంటూ ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలో సభను మార్చి 13 వరకు వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధన్కర్ ప్రకటించారు. సోమవారం రాజ్యసభ కార్యకలాపాలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్ష ఎంపీల నిరసనలు కొనసాగాయి. రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడేందుకు చైర్మెన్ అనుమతి ఇవ్వాలంటూ ప్రతిపక్ష ఎంపీలు పట్టుబట్టడంతో చైర్మెన్ అందుకు అంగీకరించారు. దీన్ని వ్యతిరేకిస్తూ అధికార పార్టీ సభ్యులు కూడా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. దీంతో ఖర్గే చేసిన వ్యాఖ్యలను తొలగిస్తున్నట్టు చైర్మెన్ వెల్లడించారు. ఇలా అధికార, ప్రతిపక్ష ఎంపీల నినాదాలు చేయడంతోపాటు పలువురు ఎంపీలు పోడియం వద్ద ఆందోళన చేపట్టారు. ఇలా సభ్యుల ఆందోళనల నడుమ సభను వాయిదా వేస్తున్నట్టు చైర్మెన్ ప్రకటించారు. అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, రాజ్యసభ నేత పీయూశ్ గోయల్ మీడియాతో మాట్లాడారు. సభా కార్యకలాపాలను అడ్డుకున్నందుకు ప్రతిపక్ష నేతలు ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీనికి ప్రతిపక్ష నేతలు కౌంటర్ ఇచ్చారు. తాము సభ సజావుగా నడవాలని కోరుతున్నామని, అదానీ అంశంపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అయితే ప్రభుత్వం అందుకు సిద్ధపడటం లేదని, పారిపోతోందని విమర్శించారు.
రెండు విడతలుగా...
షెడ్యూల్ ప్రకారం బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా (జనవరి 31 నుంచి ఏప్రిల్ 6 వరకు) జరగనున్నాయి. తొలి విడతలో భాగంగా జనవరి 31న మొదలైన ఈ సమావేశాలు సోమవారం (ఫిబ్రవరి 13) వరకు కొనసాగాయి. మొదట పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించారు. అదే రోజు ఆర్థిక సర్వే ప్రవేశ పెట్టారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆ తరువాత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపైన, బడ్జెట్ పైన చర్చ జరిగింది. అయితే, కొంత విరామం తరువాత రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చి 13న తిరిగి ప్రారంభమవుతాయి.