Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్రిపుర ఎన్నికల ర్యాలీలో ప్రకాశ్ కరత్
అగర్తలా : త్రిపురలో అధికారంలోకి వస్తే పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించడమే ప్రభుత్వం తీసుకోబోయే మొదటి నిర్ణయంగా వుంటుందని సీపీఐ(ఎం) సీనియర్ నేత ప్రకాశ్ కరత్ చెప్పారు. పశ్చిమ త్రిపుర జిల్లాలోని ఖాయెర్పూర్లో ఎన్నికల ర్యాలీలో ఆదివారం కరత్ ప్రసంగించారు. రాష్ట్రంలో వామపక్ష సంఘటన ప్రభుత్వం అధికారంలో వున్నంతవరకు కొత్త పెన్షన్ పథకం అమలు కాలేదని గుర్తు చేశారు. 2018లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కొత్త పెన్షన్ను అమలు చేసిందని విమర్శించారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిందనీ, అక్కడ పాత పెన్షన్ పథకాన్ని తిరిగి పునరుద్ధరించారని గుర్తు చేశారు. త్రిపురలో కూడా వామపక్షాలు అధికారంలోకి వస్తే అదే జరుగుతుందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి దిగజారిందని, 2020 జనవరి నుంచి 2022 డిసెంబరు మధ్య కాలంలో 707 లైంగికదాడి కేసులు నమోదయ్యాయని కరత్ పేర్కొన్నారు. మహిళలపై నేరాలు పెరగడంతో రాష్ట్రానికి చెడ్డపేరు వచ్చిందన్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవటానికి బీజేపీ పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తోందని కరత్ విమర్శించారు. బీజేపీ వ్యవహరిస్తున్న ఈ తీరు పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలన్నారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకు గానూ బీజేపీ కుట్రలను భగం చేయాలన్నారు. త్రిపుర వంటి చిన్న రాష్ట్రంలో ప్రతిపక్షాలు విజయం సాధిస్తే, జాతీయవ్యాప్తంగా దాని ప్రభావం, పర్యవసానాలు వుంటాయన్నారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదాన్ని కాపాడేందుకు దేశవ్యాప్తంగా జరిగే ఉద్యమాలు ఊపందుకునేందుకు ఈ రాష్ట్రంలో వామపక్షాల విజయం దోహదం చేస్తుందని తెలిపారు.