Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగపూర్ కంపెనీకి సంబంధాలు : హిండెన్‌బర్గ్
న్యూఢిల్లీ : అదానీ గ్రూపుపై హిండెన్‌బర్గ్ మరో బాంబు పేల్చింది. దేశంలో సంచలనం సృష్టించిన రూ.3,600 కోట్ల అగస్టా వెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కుంభకోణం కేసుతో అదానీ గ్రూపునకు సంబంధాలున్నాయని పేర్కొంది. ఈ కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన మొదటి ఛార్జిషీట్, రెండవ అనుబంధ ఛార్జిషీట్‌లోనూ చేర్చిన సింగపూర్‌కు చెందిన కంపెనీ అదానీ గ్రూప్ సంబంధిత సంస్థ అని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికలో పేర్కొంది. కాగా.. 2018లో ఈడీ దాఖలు చేసిన మూడో చార్జిషీట్లో అనూహ్యాంగా ఆ పేరును తొలగించారని వెల్లడించింది. సింగపూర్‌లోని అధికారులు పంపిన లేఖ ఆధారంగా ఆ స్కామ్ నుంచి పేరును తొలగించారని సమాచారం. సింగపూర్ కేంద్రంగా పని చేస్తున్న గుడామి ఇంటర్నేషనల్ పీటీఈ సంస్థ అదానీ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ సంబంధిత సంస్థగా ఉంది. అదానీ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీనే 2002లో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌గా మార్చుతూ ఆ కంపెనీ బీఎస్ఈకి సమాచారం ఇచ్చింది. గుడామి ఇంటర్నేషనల్ కంపెనీలో అదానీకి చెందిన డైరెక్టర్ కీలక వాటాదారులుగా ఉన్నారు. గుడామి ఇంటర్నేషనల్ కంపెనీ నిలిచిపోయిందని, పొరపాటున పేరు ఇచ్చామని 2017లో సింగపూర్ అధికారులు లేఖ ఇచ్చారు. దీంతో ఈడీ తన ఛార్జ్‌షీట్ నుంచి అదానీ సంబంధిత కంపెనీ పేరును తొలగించడం విశేషం.
అగస్టావెస్ట్‌ల్యాండ్ వీవీఐపీ హెలికాప్టర్ల కేసులో 2014లో ఈడీ దాఖలు చేసిన తొలి చార్జిషీట్లో సింగపూర్‌కు చెందిన కంపెనీ పేరు ఉంది. ప్రధాన నిందితుడు గౌతమ్ ఖైతాన్ కన్సల్టెన్సీ సర్వీసెస్‌తో నకిలీ ఇన్వాయిస్లను పెంచడం ద్వారా గుడామి వ్యాపారం చేస్తున్నాడని ఛార్జిషీట్ ప్రధానంగా ఆరోపించింది. 2017లో దాఖలు చేసిన రెండవ అనుబంధ ఛార్జిషీట్లో కూడా గుడామి ఇంటర్నేషనల్ పీటీఈ లిమిటెడ్‌ను ప్రస్తావించింది. మధ్యవర్తి రాజీవ్ సక్సేనాపై దాఖలు చేసిన ఈ ఛార్జిషీట్‌లోనూ ఆ కంపెనీల గురించి మరోసారి చేర్చింది. ఖైతాన్పై 2009లో ఈడీ అధికారులు దాడి చేసినప్పుడు ఆ సమయంలో ఆ కంపెనీ ఉద్యోగి నుంచి ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకుంది. ఫోరెన్సిక్ పరీక్షలో గుడామితో సహా డొల్ల కంపెనీల ద్వారా నిధులు పొందిన అనేక కంపెనీల పేర్లను గుర్తించారు. అగస్టావెస్ట్‌ల్యాండ్ స్పా 2.43 కోట్ల యూరోలను ట్యునీషియా ఆధారిత కంపెనీ ఐడీఎస్ టాన్సియాకు బదిలీ చేసింది. ఇందులోంచి 1.24 కోట్ల యూరోలు కైతాన్కు చెందిన ఇంటెర్స్టెల్లర్ టెక్నలాజీస్కు బదిలీ చేయబడ్డాయి. ఇంటర్స్టెల్లర్ నగదు తీసుకోవడం, చెల్లింపుల ఆధారంగా చేసుకుని ఈడీ ఛార్జిషీట్లో చేర్చింది.
రెవెన్యూ లక్ష్యాలకు కోత
హిండెన్‌బర్గ్ రిపోర్ట్ ప్రభావం నేపథ్యంలో అదాని గ్రూపు తన రెవెన్యూ వృద్ధి లక్ష్యం అంచనాలకు కోత పెట్టుకుందని సమాచారం. అదేవిధంగా తాజా పెట్టుబడుల వ్యయాలను నిలిపివేసినట్టు తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి అదానీ గ్రూపు రెవెన్యూ వృద్ధి లక్ష్యాన్ని 15-20 శాతానికి తగ్గించుకుంది. ఇంతక్రితం 40 శాతం వృద్ధి అంచనా వేసింది. మరోవైపు అదానీ గ్రూపు షేర్ల పతనం కొనసాగింది. సోమవారం అదాని ఎంటర్ప్రైజెస్ షేర్ 7.63 శాతం తగ్గి రూ.1,706కు పడిపోయింది. అదాని పవర్ 4.99 శాతం, అదాని విల్మర్ 5 శాతం, అదాని పోర్ట్ 5.39 శాతం, ఎన్డీటీవీ 4.98 శాతం చొప్పున నష్టపోయాయి.