Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చీర, జాకెట్టు చించి బీజేపీ శ్రేణుల అరాచకం
- బీజేపీ ఎమ్మెల్యేకు సహకరించటంలేదంటూ బరితెగింపు
అగర్తల : త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో ఎనలేని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న బీజేపీ రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిని సైతం ఎన్నికల్లో వినియోగించుకునేందుకు బరితెగిస్తోంది. సహకరించని నేతలపై భౌతిక దాడులకు పాల్పడుతోంది. ధర్మనగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే విశ్వబంధుసేన్ తరపున ప్రచారానికి సహకరించలేదనే అక్కసుతో సొంత పార్టీకి చెందిన సీనియర్ నేత, పైగా త్రిపుర మహిళా కమిషన్ చైర్పర్సన్ బర్నాలి గోస్వామిపై మహిళా మోర్చా నాయకులతో దాడి చేయించారు. ఈ దాడిలో ఆమె చేతికి గాయాలయ్యాయి. ఈ దాడితో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన గోస్వామి అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ అయిన తనపైనే బీజేపీ గూండాలు ఇంత దాడికి ఒడిగట్టారంటే ఇక సామాన్య ప్రజానీకం పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అని ఆందోళన వ్యక్తం చేశారు. 'బీజేపీ జెండాలు పట్టుకున్న కొందరు నన్ను చుట్టుముట్టారు. చీర లాగేశారు. జాకెట్టు చించేసి..దాడి చేశారు. మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌కే రక్షణ లేకపోతే..ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి?' అని ఆమె ప్రశ్నించారు. స్థానికుల కథనం ప్రకారం..బర్నాలీ గోస్వామి ఈ ఎన్నికల్లో తనకు టిక్కెట్ వస్తుందని భావించారు. బర్నాలీ గోస్వామి ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న బలమైన నేత. అయితే ఆమెకు టిక్కెట్ దక్కనీయకుండా స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే విశ్వబంధు సేన్ అడ్డుకున్నారనీ, ఈ క్రమంలో ఆమె పార్టీ ప్రచారానికి దూరంగా ఉంటున్నారని బీజేపీకి చెందిన విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రచారానికి దూరంగా ఉండటంతో ఆగ్రహించిన ఎమ్మెల్యేనే ఈ దాడి చేయించినట్లు చెబుతున్నారు. కాగా ఈ దాడిని సిపిఎం తీవ్రంగా ఖండించింది. బర్నాలి గోస్వామి కన్నీటి పర్యంతమవుతూ విడుదల చేసిన వీడియోను సీపీఐ(ఎం) పోస్టు చేసింది.
తిపురలో ముగిసిన ప్రచారం
త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారం ముగిసింది. గురువారం నాటి ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైందని ఎన్నికల ముఖ్య అధికారి కిరణ్‌కుమార్ తెలిపారు. 60 స్థానాలున్న త్రిపుర అసెంబ్లీకి జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ వామపక్షాలు, కాంగ్రెస్‌కు, బీజేపీ కూటమికి మధ్య నెలకొంది.