Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై : పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ప్రధాని మోడీ తీరుపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మండిపడ్డారు. లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని మోడీని ఎన్నో ప్రశ్నలు అడిగారనీ, అయితే ఒక్కదానికి కూడా ఆయన సమాధానం చెప్పలేదన్నారు. ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకుండా గంటల తరబడి ఎలా మాట్లాడాలో మోడీ నుంచి నేర్చుకున్నానని వ్యంగ్యంగా చెప్పారు.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రతిపక్షాలను ఏకం చేసిందని ప్రధాని మోడీ పార్లమెంటులో చెప్పారని, ప్రతిపక్షాలు ప్రతీకార భావంతో రాజకీయాలు చేస్తున్నాయని ప్రధాని పార్లమెంటులో అంగీకరించడం ఇదే తొలిసారని స్టాలిన్ పేర్కొన్నారు. ఇది మన ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదని సూచించారు. మంగళవారం నిర్వహించిన 'ఉంగాళిల్ ఒరువన్' కార్యక్రమంలో భాగంగా వరుస ప్రశ్నలకు స్టాలిన్ తడుముకోకుండా సమాధానాలిచ్చారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో ప్రధానిపై, బీజేపీపై కాంగ్రెస్ సహా విపక్షాలు ఎన్నో ఆరోపణలు చేసినా ప్రధాని కానీ, మంత్రులు కానీ ఎలాంటి సమాధానమియ్యలేదని స్టాలిన్ గుర్తుచేశారు. చర్చను ముగిస్తూ ప్రధాని మోడీ చేసిన ప్రసంగంలో పెద్ద అంశాలు ఉన్నప్పటికీ.. బీబీసీ డాక్యుమెంటరీ గురించి కానీ, అదానీతో ఉన్న సంబంధాల గురించి కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదని దుయ్యబట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో అదానీ గ్రూపునకు సంబంధాలున్నాయని చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని స్టాలిన్ చెప్పారు. సుప్రీంకోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి స్వయంగా ఈ కేసును విచారిస్తున్నారంటే ఎంత ముఖ్యమైనదో అర్ధం చేసుకోవచ్చునన్నారు. అందుకే అదానీ అంశాన్ని పార్లమెంట్లో చర్చించాల్సిన అవసరం ఉన్నదని స్టాలిన్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఈ కేసు విచారణకు వెంటనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ కమిటీ వేసి వారికి అప్పగించాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలు చేసిన ప్రసంగంలోని కొన్ని భాగాలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించడం వలన అవి ప్రజల మనసుల్లోంచి తొలగిపోతాయని భావించరాదని స్టాలిన్ చెప్పారు. పార్లమెంట్లో ప్రధాని మోడీని రాహుల్ అడిగిన ప్రశ్నలన్నీ చట్టబద్ధమైనవే అని అన్నారు. ఈ ఆరోపణలపై ప్రధాని మౌనంగా ఉండటం తనకు విస్మయం కలిగిస్తున్నదని స్టాలిన్ పేర్కొన్నారు.