Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంతర్జాతీయంగా మోడీ సర్కార్‌పై విశ్వసనీయత కన్నా ఎక్కువే..
- ఐటీ దాడులు..ఆమోదనీయం కాదు : ప్రముఖ పాత్రికేయుడు ఎన్.రామ్
- ఇవి కచ్చితంగా ప్రతీకార దాడులే..
న్యూఢిల్లీ : బీబీసీపై ఐటీ దాడుల్ని ప్రముఖ పాత్రికేయుడు, 'ద హిందూ' మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎన్.రామ్ తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయంగా మోడీ సర్కార్‌కు ఉన్న విశ్వసనీయత కన్నా..బీబీసీ విశ్వసనీయత చాలా చాలా గొప్పదని చెప్పారు. ప్రపంచ మీడియాలో బీబీసీ లాంటి సంస్థ మరోటి లేదన్నారు. ఇంతటి ప్రముఖ సంస్థను ఐటీ దాడులతో బెదిరించటాన్ని, వేధించటాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. 'ఇండియా : ద మోడీ క్వశ్చన్' డాక్యుమెంటరీ విడుదలను సహించలేక, కేంద్రం బీబీసీపై ప్రతీకారదాడులకు దిగిందని అన్నారు. బుధవారం ప్రముఖ ఆంగ్ల న్యూస్ వెబ్‌పోర్టల్ 'ద వైర్'తో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. బీబీసీని లక్ష్యంగా చేసుకొని కేంద్ర దర్యాప్తు సంస్థలు సాగిస్తున్న ఐటీ సర్వే..ప్రతీకారం, కక్ష్యసాధింపు తప్ప మరోటి కాదన్నారు. ''ఇదెంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదు. ఐటీ సర్వే, సోదాల పేరుతో జరిగేదంతా కూడా మీడియాపై సెన్సార్షిప్ తప్ప మరోటి కాదు. బీబీసీని బెదిరించడానికి జరిగిన దాడి. ఇలాంటి చర్యలకు బెదిరిపోయే సంస్థ కాదు బీబీసీ. సెన్సార్షిప్ కోసం జరుగుతున్న తతంగం ఇది. మూర్ఖుల కామెడీగా కనపడుతోంది'' అని అన్నారు.
రిషీ సునాక్ స్పందన అత్యంత పేలవం..
ఐటీ దాడులపై బ్రిటీష్ ప్రభుత్వం, ఆ దేశ ప్రధాని రిషీ సునాక్ స్పందించిన తీరును కూడా ఎన్.రామ్ తప్పుబట్టారు. బ్రిటీష్ ప్రభుత్వం, రిషీ సునాక్ స్పందన అత్యంత పేలవంగా ఉందన్నారు. బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్ ఈ విధంగా స్పందించటం చాలా కొత్తగా ఉందన్నారు. ''ఆత్మగౌరవం కలిగిన ప్రభుత్వంగా బ్రిటన్ నుంచి నేను ఊహించిన స్పందన రాలేదు. మోడీ సర్కార్ చర్యలపై ఆందోళన వ్యక్తం చేస్తుందని అంచనావేశాను. రిషీ సునాక్ చాలా కురచగా కనపించాడు''అంటూ ఘాటుగా విమర్శించారు. మంగళవారం బీబీసీపై ఐటీ దాడులు ఎందుకు జరిగాయన్న దానిపై ఐటీ అధికారులు మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. 2012 నుంచి ఆదాయ వ్యయాలకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తున్నట్టు మీడియాకు వెల్లడించారు. ఈ పరిశీలన సోదాలు కాదు, సర్వే మాత్రమేనని ఐటీ శాఖ విభాగం పేర్కొనటం గమనార్హం.
పసలేని ఆరోపణలు..
''ఈ ప్రకటనలో పేర్కొన్న ఆరోపణలు ఏకపక్షం. సరైన ఆధారాల్లేనివే. ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేయటం తప్ప ఇందులో (ఐటీ ఆరోపణల్లో) సారాంశం లేదు. విచారణలో నిలబడేవి కాదు. గతంలోనూ ఐటీ చేసిన ఏ ఆరోపణలూ నిరూపితం కాలేదు'' అని వివరించారు. బీబీసీ డాక్యుమెంటరీకి, ఐటీ దాడులకు సంబంధముందా? అన్న ప్రశ్నపై మాట్లాడుతూ, ''స్పష్టంగా కనపడుతోంది. 99శాతం మంది అభిప్రాయం అదే. ప్రతీకారంతోనే ఐటీ దాడులు చేశారన్నది స్పష్టంగా కనపడుతోంది. మంగళవారం రాత్రి, బుధవారం కూడా ఐటీ సోదాలు నిర్వహించారు. బీబీసీని ఒక రకమైన డిఫెన్స్‌లో పడేయాలన్నదే వ్యూహం. మీడియా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రపై దాడులు ఇంతకు ముందూ ఉన్నాయి. అయితే ఇప్పుడు బీబీసీపై జరిగిన దాడి చాలా పెద్దది. భారత్ ప్రతిష్టను ఎక్కువగా నష్టపరిచింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, ప్రజాస్వామ్యానికి భారత్ తల్లిలాంటిదని ప్రధాని మోడీ చెప్పుకుంటున్నారు. తాజా ఉదంతంతో ఆ మాటలకు విశ్వసనీయత తగ్గిందని'' అన్నారు.
రెండో రోజూ ఐటీ సోదాలు
- అధికారుల ప్రశ్నలకు సమగ్ర సమాధానమివ్వండి : సిబ్బందికి బీబీసీ సూచన
భారత్‌లో బీబీసీ కార్యాలయాలపై బుధవారం ఐటీ సోదాలు కొనసాగాయి. ప్రస్తుతానికి వీటిని ఐటీ సర్వేగా దర్యాప్తు సంస్థ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. పన్ను ఎగవేతలకు పాల్పడుతోందన్న అనుమానంతో సర్వే నిర్వహిస్తున్నా మని ఒక ప్రకటనలో ఐటీ శాఖ తెలిపింది. ఈక్రమంలో బీబీసీ తన సిబ్బందికి మెయిల్ చేసింది. ఐటీ అధికారులకు సిబ్బంది అంతా సహకరించాలని, వారు అడిగిన ప్రశ్నలకు సమగ్రంగా సమాధానం ఇవ్వాలని సూచించింది. జీతభత్యాల గురించి అడిగిన ప్రశ్నలకు వివరంగా బదులివ్వాలని కోరింది. బ్రాడ్కాస్ట్ విభాగంవారు కార్యాలయాలకు రావాలని, మిగిలిన సిబ్బంది ఇంటి నుంచి పనిచేయాలని చెప్పింది.
అలాగే ఈ సర్వే గురించి సామాజిక మాధ్యమాల్లో స్పందించవద్దని ఇప్పటికే సిబ్బందికి సంస్థ స్పష్టం చేసింది. గోద్రా మారణకాండ వెనుక అప్పటి గుజరాత్ సీఎం నరేంద్రమోడీ ప్రమేయం ఉందంటూ 'ఇండియా : ద మోడీ క్వశ్చన్' పేరిట రెండు భాగాలుగా విడుదలైన డాక్యుమెంటరీలో బీబీసీ పేర్కొంది. ఈ డాక్యుమెంటరీ ఎక్కడా ప్రసారం చేయరాదు..అంటూ కేంద్రం నిషేధం విధించింది. ఐటీ శాఖను రంగంలోకి దింపి..సోదాలు చేపట్టింది.