Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ సర్కార్ విధానాలపై ప్రజలు తిరగబడాలి
- విస్తృత పోరాటాలతోనే సామాన్యుల మనుగడ : వ్యవసాయ కార్మిక సంఘం 10వ మహాసభలో వక్తలు
అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం 10వ మహాసభ
హౌరాలోని జ్యోతిబసునగర్ (శరత్చంద్ర ఆడిటోరియం)లోని కుమార్ షిరాల్కర్, సారంగధర్ పాశ్వాన్ వేదికపై బుధవారం ఘనంగా ప్రారంభమయ్యింది. అంతకుముందు సంఘం పతాకాన్ని ఆవిష్కరించిన అధ్యక్షులు రాఘవన్ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. బెంగాల్లో వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రారంభమైన అమరవీరుల టార్చ్ ర్యాలీలు ప్రదర్శనగా ఉదయం సభా ప్రాంగణానికి చేరుకున్నాయి. వాటిని నాయకులు విజయరాఘవన్, బిమన్‌బసు, ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీదీప్ భట్టాచార్య, ఏఐకేఎస్ నాయకులు హన్నన్ మొల్లా, విజూకృష్ణన్, సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ అందుకున్నారు.
హౌరా నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
కార్మికవర్గం పేదలపై కేంద్రం నిరంతరం దాడి చేస్తున్నదనీ, దేశాన్ని కార్పొరేట్ల చేతుల్లో పెడుతూ కార్మికులు, వ్యవసాయ కార్మికులను అణ గదొక్కుతున్నదని వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్షులు విజయ రాఘవన్ విమ ర్శించారు. అధికారంలో ఉన్న బీజేపీ అనుసరిస్తున్న కుట్రపూరిత విధానాలపై ప్రజలు తిరగబడాలని పిలుపునిచ్చారు. అప్పుడే సామాన్య ప్రజల మనుగడ సాధ్యమవుతుందని అన్నారు. కరోనా కాలాన్నీ ప్రధాని మోడీ పెట్టుబడిదారులకు లాభాలు కుమ్మరించుకునేందుకు ఉపయోగించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ మహాసభ నిర్వహణ కమిటీలను ప్రతిపాదించి వక్తలను వేదిక మీదకు ఆహ్వానించారు. నాలుగు సంఘాల నుంచి సౌహార్థ్ర ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయరాఘవన్ అధ్యక్షోపన్యాసం చేశారు. మోడీ విధానాలతో దేశవ్యాప్తంగా పేదలు మరింత అట్టడుగు స్థాయికి వెళ్లిపోతున్నారనీ, బిలియనీర్లు అంతకంతకూ పెరుగుతున్నారని తెలిపారు. ఉపాధిలేనివారి సంఖ్య 17 కోట్ల నుంచి 35 కోట్లకు చేరిందని వివరించారు. కోవిడ్ కాలం పేదల జీవనంపై తీవ్ర ప్రభావం చూపిందనీ, పెట్టుబడిదారులు దోచుకునేందుకు మోడీ ప్రభుత్వం ఈ కాలాన్ని ఉపయోగించిందని అన్నారు. పేదలు, కూలీలు నరకయాతన అనుభవించారనీ, వారిని కేంద్రం ఆదుకోకపోగా వారిపట్ల అమానవీయ పద్ధతులు అనుసరించిందని విమర్శించారు. ఉపాధి కోల్పోయిన పేదలకు రాయితీలు ఇవ్వకపోగా వారి మరణాలకు కారణమైందని అన్నారు. ఇదేకాలంలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ధనవంతుడిగా అదానీ ఎదిగాడని, మోడీ పూర్తి సహాయ సహకారాలతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను దెబ్బతీస్తున్నదనీ, ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తున్నదని తెలిపారు. ప్రపంచీకరణ విధానాలను మరింత వేగవంతంగా అమలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వరంగాన్ని పూర్తిగా అమ్మేస్తున్నారనీ, ఒకరిద్దరి చేతుల్లో పెడుతున్నారని అన్నారు. దీనికోసం పార్లమెంటరీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని తెలిపారు.
మతోన్మాద ఎజెండాతో దోపిడీకి..
ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంఘాలను అన్ని రంగాల్లోకి జొప్పిస్తున్నారని తెలిపారు. దోపిడీకి సహకరిస్తున్న బీజేపీ ప్రభుత్వం దాన్ని బయటకు రానీయకుండా ఉండేందుకు మత ఘర్షణలు రెచ్చగొడుతోందని వివరించారు. ఒకవైపు దేశంలో బీజేపీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటే కేరళలోని వామపక్ష ప్రభుత్వం అక్కడి ప్రజలను ఆదుకునేందుకు ముందుకొచ్చిందని గుర్తుచేశారు. నగదు బదిలీ ద్వారా ఆకలి సమస్య లేకుండా చేసిందనీ, ఉపాధి కల్పించిందని అన్నారు. దీన్ని కూడా కేంద్రంలోని బీజేపీ తట్టుకోలేకపోతున్నదనీ, రకరకాల వేధింపులకు దిగుతున్నదని తెలిపారు. బీజేపీని గద్దె దించడమే ఏకైక ఎజెండాగా వ్యవసాయ కార్మికులు పోరాటం నిర్వహించాలనీ, ఈ క్రమంలో అందరినీ కలుపుకుపోవాలని సూచించారు. అలాగే బెంగాల్లో కార్మిక ఉద్యమం అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే ముందుకెళుతోందని అన్నారు.
పేదరికం పోవాలి : సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్
పేదరికం పోవడం ద్వారానే ప్రజల మనుగడ సాధ్యమవుతుందనీ, దీనికోసం కార్మిక, వ్యవసాయ కార్మిక సంఘాలు ఉమ్మడిగా పోరా డాలని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్ అన్నారు. అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం పదో మహాసభలో ఆయన సౌహార్థ్ర సందేశమిచ్చారు. ఇటీవల కాలంలో అన్నిరంగాల కార్మికులు తీవ్ర దుర్భర పరిస్థితులను, అలాగే మతోన్మాదుల దాడులను ఎదుర్కొంటున్నారని వివరించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ప్రక్రియ మరింత వేగవంతమైందని తెలిపారు. దేశంలో రాజ్యాంగ వ్యవస్థను బీజేపీ దెబ్బతీస్తున్నదనీ, నియంతృత్వ విధానాలు అమలు చేస్తున్నదని వివరించారు. దీన్ని అడ్డుకోవాలంటే ప్రజలను మరింత చైతన్యం చేయాలని తెలిపారు. కలిసి పనిచేయడానికి ఉన్న అన్ని అవకాశాలనూ గుర్తించి ముందుకెళ్లాలని అన్నారు.
అన్ని పోరాటాలకు మా మద్దతు : భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నిర్మల్
దేశంలో కీలకమైన పరిస్థి తుల్లో ఏఐఏడబ్ల్యూయూ మహాసభలు జరుగుతు న్నాయనీ, పేదరికం పోవా లనీ, సామాన్య ప్రజల మను గడ కోసం సంఘం నిర్వ హించే అన్ని పోరాటాలకు బీకేఎంయూ తరుపున పూర్తి మద్దతు ఇస్తున్నామని తెలిపారు. ఏఐఏడబ్ల్యూయూ మహాసభలో సౌహార్థ్ర సందేశమిచ్చారు.
కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా నిలబడాలని అన్నారు. ఇప్పటికే అనేక రంగాల్లోకి చొచ్చుకొస్తూ ప్రజల మధ్య చీలికలు తెస్తోందని అన్నారు. ఈ తరహా చర్యల వల్ల నష్టపోయేది పేదలు, ముఖ్యంగా వ్యవసాయ కార్మికులేనని అన్నారు. దీన్ని ఐక్యంగా అడ్డుకోకపోతే దేశం తీవ్ర ఇబ్బందుల్లో పడుతుందని అన్నారు.
అమరవీరులకు నివాళి...
దేశంలో వివిధ ఘటనల్లో అశువులు బాసిన అమరవీరులకు మహాసభ నివాళులర్పించింది. ఏఐఏడబ్ల్యూయూ జాయింట్ సెక్రటరీ అమియపాత్ర తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వ్యవసాయ కార్మిక ఉద్యమంలో చనిపోయిన 33 మందికి సంతాపం ప్రకటించారు.
అలాగే వామపక్ష ప్రజాతంద్ర ఉద్యమాల్లో ఉంటూ మరణించిన 95 మందికి సంతాపం తెలిపారు. రైతాంగ పోరాట సమయంలో మరణించిన 735మందితోపాటు లఖింపూర్ ఖేరీ ఘటనలో మృతిచెందిన వారికీ మహాసభ సంతాపం ప్రకటించింది. వీరితోపాటు బెంగాల్, త్రిపుర, కేరళలో ఉన్మాదుల చేతుల్లో హత్యకు గురైన వామపక్ష నాయకులు, కార్యకర్తలకు మహాసభ సంతాపం ప్రకటించింది. ఆత్మహత్యలకు పాల్పడిన రైతులు మహిళలు, యువత, విద్యార్థులకూ సంతాపం ప్రకటించారు. హిందూత్వ వాదుల చేతుల్లో హతులైనవారికి, సీఏఏ ఆందోళనల్లో ప్రభుత్వ హింసలో ప్రాణాలు కోల్పోయిన వారికీ, వేర్పాటువాదులు, ఉగ్రవాదుల చేతుల్లో హత్యకు గురైన వారికీ సంతాప సూచకంగా ఒక నిముషం మౌనం పాటించారు.
మహాసభ నిర్వహణకు వేర్వేరు కమిటీల ఏర్పాటు
మహాసభ నిర్వహణకు వేర్వేరు కమిటీలను ప్రధాన కార్యదర్శి వెంకట్ ప్రతిపాదించారు. దీనికి మహాసభ ఆమోదం తెలిపింది. అధ్యక్షవర్గం : ఎ.విజయరాఘవన్, అమియపాత్ర, ఒ.ఎస్. అంబిక, ఎ.లాజర్, వి.వెంకటేశ్వర్లు, భూప్‌చంద్ ఛానూ, బ్రిజ్‌లాల్ భర్తీ
తీర్మానాల కమిటీ : వి.శివదాసన్, ఎన్.చంద్రన్, తుషార్‌ఘోష్, ఆర్.వెంకట్రాములు, దుర్గాస్వామి, శ్యామల్దే, చంద్రప్ప హౌష్కేర,
అర్హతల కమిటీ : విక్రమ్‌సింగ్, సిబి దేవదర్శనమ్, ఎ.అమృతలింగం, డి.సుబ్బారావు, బి.ప్రసాదు, బోలాప్రసాదు దివాకర్, సరితా శర్మ, ప్రేమసింగ్, నిర్బన్ సర్దార్
మినిట్స్ కమిటీ : బలిరామ్ బుంబే, నిర్మల్‌నాయక్, పి.అరవిందాక్షన్ మాస్టారు, షకీర్ హుస్సేన్, సతీష్‌కుమార్, గీతా సాగర్ రామ్, నయన్భూయాన్, టి.బాబూమోహన్
స్టీరింగ్ కమిటీ : ఎ.విజయరాఘవన్, బి.వెంకట్, ఎం.వి.గోవిందన్మాస్టార్, అమియ పాత్ర, భానూలాల్ సాహా, నిత్యానందస్వామి, ఎ.లాజర్భూప్, చాంద్ఛాను, కె.కోమలకుమారి, తుషార్‌ఘోష్, వి.వెంకటేశ్వర్లు, బ్రిజ్‌లాల్ భార్తి, వి.శివదాసన్, విక్రమ్‌సింగ్.