Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ తీరుతో భయం గుప్పెట్లో త్రిపుర ఓటరు
- బెదిరింపులు.. దాడులు.. విధ్వంసాలతో కాషాయపార్టీ భయానక తీరు
- వామపక్ష పార్టీల నాయకులపై వరుస దాడులు
- పార్టీ కార్యాలయాలు, అనుబంధ సంస్థల ఆఫీసుల ధ్వంసం
- నగదు, మద్యం ప్రవాహం.. అధికార దుర్వినియోగం
- నేడే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు
ఈశాన్య రాష్ట్రం త్రిపుర అసెంబ్లీ ఎన్నికల సమరానికి సిద్ధమైంది. నేడు ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార బీజేపీ-ఐపీఎఫ్టీ కూటమి, ప్రధాన ప్రతిపక్షం సీపీఐ(ఎం) నేతృత్వంలోని కూటమి, ఇతర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు నేడు ఎన్నికల సంగ్రామంలో ఓటరు తీర్పును కోరనున్నారు. బీజేపీ పాలనలో మాత్రం త్రిపురలో రాజకీయ పరిస్థితులు గతంలో ఎన్నడూ లేనంతగా కిందకు దిగజారాయి. అధికార పార్టీకి కాస్త వ్యతిరేకంగా ఉన్నా.. ప్రతిపక్షానికి మద్దతు ఇచ్చినా.. భౌతిక దాడులు, బెదిరింపులు, హత్యా రాజకీయాలతో బీజేపీ చౌకబారు రాజకీయాలు చేసిందని విశ్లేషకులు, ప్రతిపక్ష పార్టీల నాయకులతో పాటు సాధారణ ఓటరూ అభిప్రాయపడ్డారు.
అగర్తల : గతంలో ఎన్నికలు ఎప్పుడున్నా.. ప్రజలు టీస్టాళ్ల వద్దనో, దుకాణాల వద్దనో.. తమ అభిప్రాయాలు స్వేచ్ఛగా పంచుకునే వారు. అయితే, ఇప్పుడు మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధంగా మారింది. బీజేపీ పాలనలో రాజకీయాలపై చర్చ చేసుకునేంత స్వేచ్ఛకూడా ఇప్పుడు త్రిపురలో కనబడటం లేదు. 2018లో బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి త్రిపురలో రాజకీయాలు దారుణంగా దిగజారాయని విశ్లేషకులు తెలిపారు. ఐదేండ్ల బీజేపీ పాలనలో ప్రజాస్వామ్య విలువలు పడిపోయాయాన్నారు. ఈ ఐదేండ్ల పాలనలో లోక్‌సభ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, ఇతర ఉప ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కునూ స్వేచ్ఛగా వినియోగించుకోలేకపోయారని అన్నారు. దీంతో ఈ ఎన్నికల్లోనూ ఇవే పరిస్థితులు ఎదురవుతాయేమోనన్న భయంలో త్రిపుర ఓటరు ఉన్నారని విశ్లేషకులు తెలిపారు.
రాష్ట్ర చరిత్రలో గతంలో చూడని పరిస్థితులను మించిన దృశ్యాలు బీజేపీ పాలనలో కనబడ్డాయన్నారు. ఐదేండ్ల పాలనలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, ఎంపీ ఎన్నికలలో బెదిరింపుల, హింస వంటివి చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు. 2008, 2013, 2018 ఎన్నికలలో ఎన్నడూ కనిపించిని ఆందోళన ఇప్పుడు త్రిపుర ఓటరులో కనిపిస్తున్నదన్నారు. గతేడాది డిసెంబర్ 31న 'జీరో హింస'కు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) కిరణ్ గిట్టె పిలుపునిచ్చే స్థాయికి వెళ్లడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నదని అన్నారు. అయినప్పటికీ.. ప్రజలలో మాత్రం భయం పోవడం లేదు. ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఓటరు లేవనెత్తుతున్న ప్రశ్న ఒక్కటే.. ' ఈ సారి మనం ఓటు వేయగలమా?' అని.
రాష్ట్రంలో బీజేపీ పాలనపై ప్రజలు విసుగు చెందారని సీపీఐ(ఎం), కాంగ్రెస్‌లు ఆరోపించాయి. దీంతో బీజేపీ ప్రభుత్వాన్ని అధికారానికి దూరం చేయడమే లక్ష్యంగా సీపీఐ(ఎం)-కాంగ్రెస్ కూటమి ఎన్నికల బరిలో నిలుస్తున్నది. విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు మా ఐక్యత కోరుకున్నారని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జితేంద్ర చౌదరీ, ఆలిండియా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ డాక్టర్ అజరు కుమార్ అన్నారు. గత ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య ఓట్లు చీలి అది బీజేపీకి లాభం చేకూర్చిందని రాజకీయ విశ్లేషకులు తెలిపారు.
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2018 నుంచి భయానక వాతావరణం నెలకొని ఉన్నది. రాష్ట్రంలో మంత్రుల ప్రమాణస్వీకారానికి ముందు బీజేపీ కార్యకర్తలు సీపీఐ(ఎం) పార్టీ కార్యాలయాలు, లెనిన్ విగ్రహ ధ్వంసానికి దిగడం గమనార్హం. పంచాయతీ ఎన్నికలు, ఇతర స్థానిక ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు.. ఇలా ఏ ఒక్కటీ ఈ ఐదేండ్ల కాలంలో శాంతియుతంగా జరగలేదని విశ్లేషకులు తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికలలో తూర్పు త్రిపుర ఎంపీ నియోజకవర్గంలోని 160 బూత్‌లలో రీపోలింగ్ జరిగింది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ తీరు ఎంత దారుణంగా ఉన్నదో ఇలాంటి ఘటనలే తెలియజేస్తాయని జితేంద్ర చౌదరీ అన్నారు.
లోక్‌సభ ఎన్నికలు ముగిసిన కొన్ని నెలలకు వచ్చిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ 96.6 శాతం సీట్లను సాధించిందని దూరదర్శన్ న్యూస్ రాసుకొచ్చింది. 6,646 సీట్లలలో 5,652 సీట్లు ఏకగ్రీవం అయ్యాయని పేర్కొన్నది. ఎన్నికలు జరగకుండా అంత భారీ మొత్తంలో సీట్లు ఏకగ్రీవం కావడమనేది ఎన్నికలు సక్రమంగా జరిగాయనడానికి నిదర్శనం కాదని విశ్లేషకులు తెలిపారు.
ఈ ఎన్నికల్లో బెదిరింపులు, డబ్బు పంపకం, అధికార దుర్వినియోగం కీలక పాత్ర వహించిందని చెప్పారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇలాంటి పరిస్థితులే ఎదురు కావనడానికి హామీ ఏమిటని ప్రశ్నించారు.
కరోనా కాలంలో 2020లో త్రిపుర ట్రైబల్ ఏరియా అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ (టీటీఏఏడీసీ) పదవీ కాలం ముగిసింది. ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం జరపకుండా చాలా కాలం పాటు వాయిదా వేశారు. అయితే, షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరపాలని త్రిపుర హైకోర్టు ఆ సమయంలో ఒక ఉత్తర్వును జారీ చేయడం గమనార్హం.
సుదీర్ఘ వాయిదా అనంతరం 2021 ముగింపులో రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికలు జరిగాయి. హింస, రిగ్గింగ్ ఘటనలు చోటు చేసుకున్నాయి. అభ్యర్థులు పోలింగ్ బూత్‌లలోకి వెళ్లే అవకాశమూ లేకుండా పోయింది. బయటి వ్యక్తులు ఈవీఎంల బటన్లు నొక్కుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తం కావడం గమనార్హం. ఈ ఘటనలతో అదనపు బలగాల మోహరింపునకు ఆ సమయంలో సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.
2022, జులైలో రాష్ట్రంలో నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. హింస చోటు చేసుకున్నదని సాక్షాత్తూ సీఈఓనే ధ్రువీకరించారు. అయితే ఆ తర్వాత మాత్రం ఈసీ ఎలాంటి దిద్దుబాటు చర్యలకూ దిగలేదు. మహిళలు, చిన్నారులు, విద్యార్థులు, జర్నలిస్టులు అనే తేడాలు లేకుండా.. వామపక్ష పార్టీలు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులపై బీజేపీ కార్యకర్తల దాడులు గత ఐదేండ్లలో నిత్యకృత్యమయ్యాయి. ఓటర్లను బెదిరించడం.. వినకపోతే భౌతిక దాడులకు దిగడం వంటివి కాషాయపార్టీ చేసింది. ఇండ్లు, దుకాణాలు, పార్టీ కార్యాలయాలు, సొంత వ్యాపారాలు.. ఇలా ప్రతిపక్ష పార్టీలు, సంబంధిత నాయకులు, వ్యక్తులకు చెందినవాటికి నష్టం చేకూర్చే చర్యలకు దిగింది. ఓటర్ల వద్దకు, పోలింగ్ బూత్‌ల దగ్గరకు సీపీఐ(ఎం) అభ్యర్థులెవరూ వెళ్లకుండా చూడాలని బీజేపీ పార్టీ నాయకులే వారి కార్యకర్తలకు పిలుపునివ్వడం గమనార్హం.
బరిలో 259 మంది
ఈనెల 4న నామినేషన్ల ఉపసంహరణ తర్వాత చివరకు ఎన్నికల బరిలో 259 మంది నిలిచారు. మొత్తం 60 స్థానాలకు గానూ బీజేపీ 55 మందిని, ఐదింటిలో దాని మిత్రపక్షం ఐటీపీఎఫ్టీ నిలుపుతున్నది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వామపక్ష కూటమి 46 స్థానాలు ( ఇందులో సీపీఐ(ఎం) 43 స్థానాలు, సీపీఐ, ఆర్ఎస్పీ, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చెరొక స్థానాల్లో), అలాగే ఈ కూటమిలో భాగంగా ఉన్న కాంగ్రెస్ 13 స్థానాల్లో తమ అభ్యర్థులను నిలుపుతున్నాయి. ఇంకొక స్థానాన్ని ఇండిపెండెంట్‌కు ఇచ్చాయి. ఇక టీఎంసీ పార్టీ 28 స్థానాల్లో, టిప్రా మోతా 43 సీట్లలో అభ్యర్థులను నిలిపింది. ఇతర చిన్న పార్టీల నుంచి 14 మంది, ఇండిపెండెంట్లు 55 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. త్రిపురలో మొత్తం 28 లక్షల మంది ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్దేశించనున్నారు. మొత్తం 3337 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. 28 బూత్‌లను తీవ్ర సమస్యాత్మక బూత్‌లుగా గుర్తించారు.
మద్యం.. నగదు ప్రవాహం
ఈ ఎన్నికల్లో అధికార బీజేపీ మద్యం, నగదును విచ్చల విడిగా ప్రయోగిస్తున్నది. రాష్ట్రమంతటా ఇవే పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇందుకు బీజేపీ తన చేతిలో ఉన్న అధికారాన్ని వినియోగిస్తున్నది. గోమతి జిల్లాల్లో లక్షల రూపాయాల్లో నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 15 కార్టున్ల మద్యం, 7500 గంజా మొక్కలను ధ్వంసం చేసినట్టు ఎన్నికల అధికారి
చెప్పారు.
త్రిపుర ఎన్నికల్లో అమిత్ షా ప్రత్యక్ష జోక్యం
ఎన్నికల సంఘానికి సీపీఐ(ఎం) లేఖ
త్రిపుర శాసనసభ ఎన్నికల్లో కేంద్ర హౌంమంత్రి అమిత్ షా ప్రత్యక్ష్యంగా జోక్యం చేసుకొని ప్రభావితం చేస్తుండటంపై సీపీఐ(ఎం) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌కు సీపీఐ(ఎం) ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరి లేఖ రాశారు. సీపీఐ(ఎం) త్రిపుర రాష్ట్ర కార్యదర్శి రాసిన లేఖను ఆయన జత చేశారు. శాసనసభ ఎన్నికల్లో నేరుగా కేంద్ర హౌంమంత్రి జోక్యం చేసుకోవడం చాలా ఆందోళనకర అంశమని ఏచూరి పేర్కొన్నారు. ఇదివరకు జరిగిన ఇసి సమావేశంలో కేంద్ర హౌంమంత్రి జోక్యం చేసుకొనే వీలుందని తాము ఆందోళన వ్యక్తం చేశామని ఆయన తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా నిర్వహిస్తామని ఆ సమావేశంలో ఈసీ హామీ ఇచ్చిందని ఏచూరి గుర్తు చేశారు. ఆ హామీకి భిన్నంగా కేంద్ర హౌంమంత్రి జోక్యం చేసుకుంటున్న వ్యవహారాలపై మీడియాలో కథనాలు వస్తున్నాయన్నారు. తక్షణమే జోక్యం చేసుకొని ఎన్నికల కోడ్ ఉల్లంఘించి జరుగుతున్న జోక్యాలను తక్షణమే అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక పరిశీలకుల ద్వారా నివేదికలు తెప్పించుకొని కేంద్ర హౌంమంత్రితో సమావేశమైన ఎన్నికల అధికారులపైనా, బీజేపీ వాళ్లపైనా చర్యలు తీసుకుంటారని భావిస్తున్నామని ఆయన తెలిపారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.