Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : లఖింపూరి ఖేరి కేసులో 8మంది నిందితులకు అలహాబాద్ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అక్టోబర్ 3, 2021న లఖింపూరి వద్ద చోటుచేసుకున్న హింసలో నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 8మంది నిందితులకు లక్నో బెంచ్ ధర్మాసనం మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. కేంద్ర సహాయ మంత్రి కుమారుడు, ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రా సైతం ప్రస్తుతం మధ్యంతర బెయిల్పై ఉన్నాడు. ఉత్తరప్రదేశ్, న్యూఢిల్లీలో ఉండరాదని సుప్రీంకోర్టు అతడికి నిబంధనలతో కూడిన బెయిల్ మంజూరుచేసింది. తాజాగా బెయిల్ పొందిన వారిలో మాజీ కేంద్రమంత్రి అఖిలేష్ దాస్ మేనల్లుడు అంకిత్ దాస్ కూడా ఉన్నాడు. ఆశిష్ మిశ్రాకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని ఆధారంగా చేసుకొని నిందితులు అలహాబాద్ కోర్టులో పిటిషన్ వేశారు.
దీనిపై విచారణ జరిపిన జస్టిస్ రాజేశ్ సింగ్ చౌహాన్ ధర్మాసనం 8మంది నిందితులకు కూడా మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీచేసింది. బాధితుల తరఫు వాదనలు వినిపించిన న్యాయవాదుల బృందం నిందితులకు బెయిల్ ఇవ్వరాదంటూ కోర్టును కోరాయి. కేసుపై తదుపరి విచారణలో మధ్యంతర బెయిల్పై విచారణ జరుపుతామని, సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు నిందితుల బెయిల్ గడువు పెంచాలా? లేదా? అన్నది నిర్ణయిస్తామని న్యాయమూర్తి పేర్కొన్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా లఖింపూరి వద్ద అక్టోబర్ 3, 2021న రైతులు పెద్ద సంఖ్యలో నిరసనలు చేపట్టారు. శాంతియుతంగా నిరసనలు చేపడుతున్న రైతులు, అక్కడికి వచ్చిన జర్నలిస్టులపైకి కేంద్ర సహాయ మంత్రి అజరు మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా, అతడి అనుచరులు దాడికి తెగబడ్డారు. తాను నడుపుతున్న మహింద్రా థార్ వాహనంతో నిరసనకారులపైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ అనేకమంది రైతులు చనిపోయారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొని..పెద్ద ఎత్తున హింసకు దారితీసింది. ఈ కేసులో ఆశిష్ మిశ్రా, ఆయన మద్దతుదారుల్ని నిందితులుగా పేర్కొంటూ పోలీసులు అరెస్టు చేశారు.