Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర బడ్జెట్లో కోతలు
- పథకాలకు కేటాయింపుల్లో కత్తిరింపులు
- గ్రామీణ భారతానికి ఎదురుదెబ్బ
- మోడీ సర్కారు ఉదాసీన వైఖరిపై రైతు సంఘాల ఆగ్రహం
కేంద్రంలో మోడీ సర్కారు ప్రతి బడ్జెట్లోనూ వ్యవసాయం రంగంపై చిన్న చూపు చూస్తున్నది. ఏటికేడు ఈ రంగానికి బడ్జెట్ కేటాయిపుల్లో కోతలు విధిస్తున్నది. ఈ ఏడాదీ అదే దారిలో నడిచింది. గతేడాది బడ్జెట్‌తో పోల్చుకుంటే ఈ ఏడాది బడ్జెట్ అంచనాలు ఐదు శాతం తగ్గాయి. దీంతో కేంద్ర బడ్జెట్‌పై దేశంలోని రైతులు, రైతు సంఘాల నాయకులు ఆగహ్రం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: దేశంలోని రైతన్నల ఆదాయం రెట్టింపు చేస్తానని 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చిన మోడీ సర్కారు ఆ హామీని నిలబెట్టుకోలేదు. ఆ తర్వాత రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వివాదాస్పద సాగుచట్టాలు తీసుకొచ్చి రైతన్నల మరణాలకు కారణమైంది. ఇప్పుడు దేశంలోనే కీలక రంగమైన వ్యవసాయానికి బడ్జెట్లో కోతలు విధించిందని రైతులు, రైతు సంఘాల నాయకులు, వ్యవసాయ రంగ నిపుణులు తెలిపారు. దేశంలోని రైతుల పట్ల మోడీ సర్కారుకు ఏ మాత్రమూ గౌరవం లేదనడానికి ఇవి ప్రత్యక్ష ఉదాహరణలని చెప్పారు. కేంద్ర బడ్జెట్లో గ్రామీణ భారతానికి ఎదురు దెబ్బ తగిలింది. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో 52 శాతం మందికి పైగా వ్యవసాయ రంగంపై ఆధారపడే ఆదాయాన్ని గడిస్తారు. అయితే, ఈ ఏడాది బడ్జెట్లో వ్యవసాయమూ, దాని అనుబంధ రంగాలకు జరిపిన కేటాయింపులు 2021-22 ఏడాది బడ్జెట్‌తో పోల్చుకుంటే 27 శాతం తక్కువగా ఉన్నాయి. అలాగే గతేడాది బడ్జెట్ అంచనా లతో పోల్చుకుంటే ఐదు శాతం తక్కువ. 2022 వరకు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని 2016లో మోడీ ఇచ్చిన హామీ నీటి మీద రాత వంటిదేనని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, రైతుల ఆదాయంపై ప్రభుత్వ గణాంకాలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని నిపుణులు అన్నారు.
ఆ పథకాలకు బడ్జెట్లో సున్నా
తోటల పెంపకం రైతులకు మద్దతునిచ్చే ధరల నియంత్రణ పథకం (పీఎస్ఎస్), మార్కెట్ ఇంటర్వెన్షెన్ స్కీం (ఎంఐఎస్) కు ఈ ఏడాది బడ్జెట్లో జరిగిన కేటాయింపులు సున్నా. 2021-22 ఏడాదిలో ఈ కేటాయిం పులు రూ. 2,288 కోట్లు కాగా తర్వాతి ఏడాదికి అది రూ. 1500 కోట్లకు పడిపోవడం గమనార్హం. అలాగే, నూనె గింజలు, పప్పులకు కనీస మద్దతు ధరను కల్పించే పీఎం-ఆశ పథకానికి కూడా కేటాయింపులు విస్మరించ బడ్డాయి. మొత్తం బడ్జెట్లో ప్రభుత్వం వ్యవసాయ రంగానికి జరిపిన కేటాయింపులు 3.84 శాతం నుంచి 3.20 శాతానికి తగ్గాయని వ్యవసాయ రంగ విశ్లేషకులు దేవిందర్ శర్మ అన్నారు. కార్పొరేటు రంగాలు, బడా వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలకు అండగా నిలుస్తున్న మోడీ ప్రభుత్వం కొన్నేండ్లుగా వ్యవసాయ రంగానికి కేటాయింపులను తగ్గిస్తున్నదని తెలిపారు. పంట బీమా, ప్రత్యక్ష ఆదాయ మద్దతు వంటి పథకాలకూ బడ్జెట్లో కేటాయింపులు పడిపోయాయి. రైతులకు ఏడాదికి రూ. 6 వేల ఆదాయ మద్దతునిచ్చే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి కేటాయింపులు 13 శాతం తగ్గాయి. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనకు కూడా గతేడాది బడ్జెట్ కేటాయింపులతో పోల్చుకుంటే 12 శాతం పడిపోయాయి. గ్రామీణాభివృద్ధి పథకాలకు జరిపిన కేటాయింపులు 2022 బడ్జెట్ సవరణ అంచనాలో 5.81 శాతం ఉండగా అది ఈ ఏడాది బడ్జెట్ అంచనా ప్రకారం మొత్తం బడ్జెట్లో 5.29 శాతానికి పడిపోవడం గమనార్హం. పీఎం- ప్రణామ్, బీపీకే వంటి పథకాలు వ్యవసాయ రంగానికి దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇస్తాయనీ, ఇన్పుట్ ఖర్చులను తగ్గిస్తాయనీ.. అయితే మోడీ ప్రభుత్వం ఇలాంటి పథకాలకు బడ్జెట్ కేటాయింపుల్లో కోతలు విధించటం రైతులపై అదనపు భారాన్ని మోపుతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.