Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ కార్మిక సదస్సులో ప్రకాశ్ కరత్
జ్యోతిబసు నగర్ నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
కార్పొరేట్లు, మతోన్మాదులు కలిసికట్టుగా ప్రజలను దోపిడీ చేస్తున్నారనీ, దీనికోసం మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ఘర్షణలు సృష్టిస్తున్నారనీ, దీన్ని ఎదుర్కోవాలంటే ద్విముఖ వ్యూహంతో పనిచేయాలని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్కరత్ పిలుపుని చ్చారు. వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ మహాసభలో భాగంగా రెండోరోజు మతోన్మాదం, కార్పొరేట్ల అనుబంధం, వామపక్షాల కార్యాచరణ, రాజ్యాంగంపై దాడి, ఆహార, ఉపాధి భద్రత, భూ పంపిణీ వంటి అంశాలపై సదస్సు జరిగింది. 2014లో మోడీ గద్దెనెక్కిన నాటి నుంచి కార్పొరేట్లు, మతోన్మాద శక్తుల కలయిక బలోపేతమైందని అన్నారు. ఈ తొమ్మిదేండ్లలో సరళీకరణ విధానాలు మరింత ఊపం దుకున్నాయని తెలిపారు. క్రోనీ క్యాపిటలిజానికి అనుకూలంగా ప్రధాని పనిచేస్తున్నారని తెలిపారు. 1991లో పివి నరసింహారావు సరళీకరణ విధానాలను బడ్జెట్లో ప్రతిపాదించిన సందర్భంలో... తాము సూచించిన విధానాలనే కాంగ్రెస్ అమలు చేస్తున్నదని అద్వానీ పార్లమెంటులో చెప్పారని గుర్తుచేశారు. నెహ్రూ ప్రభుత్వం పంచవర్ష ప్రణాళికలు ప్రభుత్వ రంగాన్ని బలపరుస్తుంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయని అన్నారు. మోడీ అన్ని రంగాలను ప్రయివేటీకరిస్తున్నారనీ, బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని ప్రభుత్వ సంపద పెట్టుబడిదారులకు అప్పగిస్తున్నారని అన్నారు. హిందూత్వ సిద్ధాంతం మతతత్వం పేరుతో సామాజికంగానూ విభజన తీసుకొస్తున్నారనీ, సంపదను కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా అదానీ, అంబానీ, టాటాలు మోడీ పాలనలో సంతృప్తికరంగానే ఉన్నారని చెప్పారు. రతన్‌టాటా కూడా మోహన్‌భగవత్‌తో కలిసి 2015లో హెగ్డేవార్ సమాధి వద్ధకు వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారని తెలిపారు. మోడీ నియంతృత్వం దిశగా ఏకపార్టీ పాలన సాగిస్తున్నారని అన్నారు. హిందూ రాష్ట్ర నినాదం అంటే మైనార్టీలపైనా దళితులపైనా దాడులేనన్నారు. కార్మికవర్గం రైతాంగం, వ్యవసాయ కార్మికుల హక్కులను మోడీ ప్రభుత్వం కాలరాస్తోందని వివరించారు. కార్పొరేట్ల కోసం దేశ రాజ్యాంగాన్నే మార్చాలని బీజేపీ చెబుతున్నదని అన్నారు. హిందూత్వం ఒక్కటే ప్రజలను ఉత్సాహపరుస్తుందని మోడీ చెబుతున్నారని అన్నారు. ఉత్తర భారతంలో హిందూత్వ నినాదం పేరుతో ప్రజల జీవితాలపై దాడి చేస్తున్నారని అన్నారు. దళిత గిరిజనులపై దాడులు చేస్తూ వారిని అణచివేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ సరళీకరణ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే హిందూత్వ శక్తులకు వ్యతిరేకంగా కూడా పోరాటం చేయడం ద్వారానే బీజేపీని ఓడించలగమని పేర్కొన్నారు. బీజేపీ విధానాలకు వ్యతిరేకరంగా రాజకీయ ప్రత్యామ్నాయం కోసం పోరాడాలని తెలిపారు. ప్రజల మౌలిక అవసరాల కోసం పోరాడుతూనే వారి హిందూత్వ సిద్ధాంతానికి వ్యతిరేకంగా పోరాడాలని సూచించారు. మోడీ మాట్లాడితే దేశ ఆర్థిక వ్యవస్థ ఐదో, మూడో స్థానంలో ఉందని ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. హిందూత్వం అంటే సామా జిక దోపిడీ అమలు చేయడమేనని వివరించారు. ఆహార భద్రత అంశంపై ప్రొఫెసర్ మధుర స్వామినాథన్ మాట్లాడుతూ దేశంలో ఆహార భద్రత అవసరాన్ని వివరించారు. ఆహార భద్రత అంటే భౌతికంగా అవసరాలు తీరడమే కాదని, ఆర్థికంగా అలసరాలు తీరాలని అన్నారు. సరైన ఆహారం, పౌష్టికాహారం ప్రజలకు అందాల న్నారు. నీరు, శానిటేషన్ మెరుగ్గా కల్పించాలన్నారు. ఈ ఏడాది పంటలు బాగా పండి 240 కోట్ల టన్నుల దిగుబడి వచ్చిందని, అయినా పౌష్టికా హారాన్ని అందించలేక పోతున్నామని తెలిపారు. ఆహార భద్రత విషయంలో 150 దేశాల్లో మనదేశం 137 స్థానంలో ఉందని, నేపాల్, బంగ్లాదేశ్ కన్నా తక్కువస్థాయిలో ఉన్నామని చెప్పారు. గ్రామీణ ఉపాధి రోజు రోజుకూ తగ్గుతున్న విషయాన్ని గుర్తు చేశారు. వ్యవసాయేతర రంగాల్లోనూ ఉపాధి క్షీణించిందని, మహిళలు వలస బాట పడుతున్నారని అన్నారు. వేతనాల్లోనూ పురుషులకు మహిళలకు మధ్య వ్యత్యాసం చాలా తీవ్రంగా ఉందని అన్నారు. వేతనాల్లోనూ వ్యత్యాసం ఉందని 360 రూపాయలు పురుషులకు ఉంటే 269 రూపాయలు మహిళలకు ఇస్తున్నారని తెలిపారు. యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వేతనాలు చాలా తక్కువ అన్నారు. జమ్మూకాశ్మీర్, పంజాబ్, తమిళనాడు, హర్యానాలో వేతనాలు ఫర్వాలేదని వివరించారు. 2011-12 లెక్కల ప్రకారం ఆహార సంక్షోభం తీవ్రమైందని అన్నారు. ప్రజా పంపిణీలో కనీసావసర వస్తువులు కూడా సరఫరా చేయాలన్నారు. భూ పంపిణీపై ప్రొఫెసర్ రామ్‌కుమార్ మాట్లాడుతూ దేశంలో 1.20 కోట్ల ఎకరాల సాగుకు ఉపయోగపడే మిగులు భూమి ఉందనీ, దాన్ని పంచడంలో ఇప్పటి వరకూ ఎవరూ ఆసక్తి చూపలేదని తెలిపారు. పైగా పరిశ్రమలకు కేటాయించేసి గ్రామీణ ప్రాంత ప్రజలను తీవ్ర ఇబ్బందులు పాల్జేస్తున్నారని చెప్పారు. భూదాన్ భూములను చెప్పినా అవి ఎక్కడ ఉన్నాయో ఎవరి చేతుల్లో ఉన్నాయో ఇప్పటికీ లెక్క తెలియదని వివరిం చారు. భూ సంస్కరణల అమల్లోనూ తీవ్రలోపం జరిగిందని అన్నారు. ఏపీ తెలంగాణాలో 54శాతం భూమిలేని పేదలు ఉన్నారని వివరించారు. రాజ్యాంగంపై దాడి అనే అంశంపై వికాస్ రంజన్ భట్టాచార్య మాట్లాడు తూ దోపిడీకి, మతోన్మాదానికి వీలుగా రాజ్యాంగాన్ని మార్చేస్తున్నారని తెలిపారు. ప్రశ్నించిన వారిని చంపడమో, అరెస్టులు చేయడం ద్వారా వారి పంతాన్ని నెగ్గించుకునే దిశగా పాలన చేస్తున్నారని విమర్శించారు. విజయరాఘవన్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి వెంకట్ పాల్గొన్నారు.