Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టు తీర్పుపై స్టేకి సుప్రీం నిరాకరణ
న్యూఢిల్లీ : ఎమ్మెల్యేల ఎర వ్యవహారంపై హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద సుప్రీం కోర్టు స్టేకు నిరాకరించింది. ఈ కేసుపై దాఖలైన పిటిషన్లను శుక్రవారం ధర్మాసనం విచారణ జరిపింది. కనీసం విచారణ పూర్తయ్యేంత వరకూ ఎవరినీ అరెస్ట్ చేయవద్దని సీబీఐకు ఆదేశాలు ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వ అభ్యర్ధనపై కూడా సుప్రీం కోర్టు స్పందించ లేదు. సీబీఐను తాము కంట్రోల్ చేయలేమని జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పేర్కొంటూ తదుపరి విచారణ ఈనెల 27కి వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే, బీజేపీ తరఫున సీనియర్ న్యాయవాది జెఠ్మలానీ వాదనలు వినిపించారు. ఈ కేసులో నిందితులపై నమోదైన కేసులు తీవ్రమైనవనీ, ఈ వ్యవహారం ప్రజాస్వామ్యా నికి నష్టం కలిగించేదిగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది దవే కోర్టుకు తెలిపారు. కేసు వివరాలను సీఎం కేసీఆర్ మీడియాకు తెలిపారనీ, ఆయనే స్వయంగా లీక్ చేశారని బీజేపీ తరఫున సీనియర్ న్యాయవాది జెఠ్మలానీ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. కేసుకు సంబంధించిన ఇంకా చాలా విషయాలు తమ వద్ద ఉన్నాయనీ, సీబీఐ, ఈడీ కూడా రోజు లీకులు ఇస్తున్నాయన్నాయని దవే అన్నారు. కేంద్రంలోని అధికార పార్టీకి వ్యతిరేకంగా ఆధారాలున్నాయని తెలిపారు. కేసును సీబీఐకి ఇవ్వాల్సిన అవసరం ఏముందని, కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న సీబీఐ బీజేపీపై ఎలా విచారణ చేస్తుందని దవే ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి తనకు ఎక్కువ సమయం కావాలని దవే కోరును కోరారు. అనంతరం ధర్మాసనం స్పందిస్తూ ఈనెల 27న దీనిపై విచారణ చేపట్టనున్నట్టు తెలిపింది. ఆ రోజు కోర్టు జాబితాలో ఉన్న అన్ని కేసులు ముగిసిన తరువాతే దీనిపై విచారణ చేపడతామని స్పష్టం చేసింది. ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంపై దర్యాప్తును తెలంగాణ హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ఈ తీర్పును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేస్లూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఎమ్మెల్యేల కేసు సీబీఐ చేతికి వెళ్తే ఉపయోగం ఉండదని, ఇప్పటి వరకు జరిగిన విచారణ అంతా... పక్కదారి పడుతుందని ఈనెల 7, 8ల్లో జరిగిన విచారణలో రాష్ట్ర ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాదులు దుష్యంత్ దవే, సిద్ధార్థ లుత్రాలు ప్రత్యేకంగా వాదనలు వినిపించారు. వెంటనే హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని న్యాయస్ధానాన్ని కోరారు. అయితే స్టే ఇచ్చేందుకు సీజేఐ ధర్మాసనం నిరాకరించింది.
కేంద్ర, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తెరపైకి మరో వివాదం
సీబీఐ అధికారులు పత్రాలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారనీ, స్టేటస్ కో ఇవ్వాలని న్యాయవాదులు సీజేఐకు విజ్ఞప్తి చేశారు. ఒకసారి సీబీఐ చేతికి వెళితే... కేసు వెనక్కి రావడం కష్టం అవుతుందన్నారు. వాదనలు విన్న అనంతరం స్టేటస్ కో ఇవ్వడానికి కూడా ధర్మాసనం నిరాకరించింది. కేసులో మెరిట్స్ ఉంటే రివర్స్ చేస్తూ ఆదేశాలు ఇస్తామని ధర్మాసనం పేర్కొంటూ... తదుపరి విచారణ శుక్రవారం (17 తేదీ) నాటికి వాయిదా వేసింది.