Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆలిండియా కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్
- ఏఐఏడబ్ల్యూయూ మహాసభలో సౌహార్థ్ర సందేశం
హౌరా నుంచి నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
వ్యవసాయ కార్మికులు లేకపోతే వ్యవసాయం లేదని తెలిపారు. నయా ఉదారవాద ఆర్థిక విధానాల ప్రభావం వ్యవసాయ కార్మికులపై ఎక్కువగా ఉన్నదనీ, వాటిని వేగంగా అమలు చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సంయుక్తంగా పోరు నిర్వహించాలని ఆలిండియా కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్ అన్నారు. హౌరాలో జరుగుతున్న వ్యవసాయ కార్మిక సంఘం 10వ మహాసభ సందర్భంవా ఆయన సౌహార్థ్ర సందేశం ఇచ్చారు. ఏఐకేఎస్కు వ్యవసాయ కార్మిక సంఘానికి సారూప్యత ఉందని తెలిపారు. మోగాలో 1954లో జరిగిన ఏఐకేఎస్ మహాసభ వ్యవసాయ కార్మికుల అంశంపై ప్రత్యేక తీర్మానం చేసిందని తెలిపారు. గత నాలుగు దశాబ్దాలుగా రెండు సంఘాలు సంయుక్తంగా పోరాడుతున్నాయని వివరించారు. ప్రపంచీకరణ విధానాల ప్రమాదాన్ని తొలిసారిగా ప్రజల్లోకి తీసుకెళ్లింది వ్యవసాయ కార్మిక సంఘం అన్నారు. ప్రపంచీకరణ విధానాల అమలుతో రైతులకు కనీస మద్దతు ధరల దొరకడం లేదని, ఉపాధి హామీ, ఆహార భద్రత, కనీసవేతనాలు లేకుండా పోతున్నాయని వివరించారు. మోడీ చెప్పే అచ్ఛేదిన్ రైతులకు, వ్యవసాయ కార్మికులకు కాదని అన్నారు. ప్రధాని మోడీ రైతుల పోరాటాన్ని పంజాబ్లో ఒక ప్రాంతానికి చెందినదని తక్కువ చేసి మాట్లాడారని కానీ దేశవ్యాప్తంగా విస్తరించి మోడీ నోరు మూయించిందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన ఈ ఉద్యమంలో వ్యవసాయ కార్యికులు కూడా కలిసి రావడం వల్లే ఉద్యమం తీవ్రమై కేంద్రం దిగిరావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ సందర్భంగా గురజాడ అప్పారావు చెప్పిన దేశమంటే మట్టికాదోమ్ మనుషులోరు అని తెలుగు కవి చెప్పిన మాటను నిజం చేసి చూపించారని అన్నారు. మతోన్మాదులు, కార్పొరేట్లకు వ్యతిరేకంగా ఉద్యమానికి ఇది సరైన సమయమని వివరించారు. 2024లో దేశంలో మార్పు వస్తుందని, దీనిలో వ్యవసాయ కార్యికులు కీలక పాత్ర పోషించనున్నారని చెప్పడంలో ఏ మాత్రమూ సందేహం లేదని అన్నారు.
భూమి, కనీసవేతనాల కోసం పోరు
సాంబశివ, తెలంగాణ ప్రతినిధి
పేదలకు భూమి, కనీస వేతనాల కోసం విస్తృత పోరాటాలు నిర్వహిస్తున్నామని తెలంగాణ ప్రతినిధి సాంబశివ తెలిపారు. మహాసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లా డారు. రాష్ట్రంలో వ్యవసాయ కార్మికుల పరిస్థితి మరీ దయనీయంగా మారిం దని అన్నారు. దీనిపై నిర్వహించిన పోరాటాల ఫలితంగా అనేక అనుభవాలు, విజయాలు వచ్చాయని చెప్పారు. వరంగల్ లాంటిచోట్ల నిర్వ హించిన భూపోరాటం మంచి అనుభ వమని అన్నారు. సేవా కార్యక్రమా ల్లోనూ తెలంగాణలో వ్యవసాయ కార్మిక సంఘం కీలకపాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలపై నిరం తరం కార్యాచరణతోపాటు ఇం టింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నామని వివరించారు.
మహిళా కార్మికులకు సమగ్రచట్టం
మహాసభలో ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి శివనాగరాణి
మహిళా వ్యవసాయ కార్మికులకు కనీస వేతనం అందడం లేదని, వారికోసం సమగ్రచట్టం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి వి.శివనాగరాణి తెలిపారు. హౌరాలో జరుగుతున్న అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం 10వ మహాసభలో రాష్ట్రాల ప్రతినిధుల చర్చల సమయంలో ఉదయం పలు రాష్ట్రాల ప్రతినిధులు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నుండి శివనాగరాణి మాట్లాడుతూ మహిళలకు కనీస భద్రత లేదని, వేతనాలూ అందడం లేదని పేర్కొన్నారు. పనులు లేకపోవడంతో ఎక్కువమంది కార్మికులు వలసలు పోతున్నారని వివరించారు. ఈ క్రమంలో ప్రమాదాల బారినపడుతున్నారని,వారి పిల్లలూ చదువుకు దూరమవుతున్నారని వివరించారు. ఈ నేపథ్యంలో మహిళల కోసం కనీస వేతన చట్టం చేయాలని కోరారు. అప్పుడే వారికి న్యాయం జరుగుతుందని చెప్పారు. మహిళా వ్యవసాయ కార్మికుల కోసం ఆంధ్రప్రదేశ్లో కన్వీనిరగ్ కమిటీ పనిచేస్తోందని పేర్కొన్నారు. నాలుగు జిల్లాల్లో ఇప్పటికే కమిటీలు వేశామని చెప్పారు.
బెంగాల్ పోరాటం స్ఫూర్తిదాయకం
వారికి అండగా ఉంటాం
వ్యవసాయ కార్మిక మహాసభ తీర్మానం
బెంగాల్లో ప్రజాతంత్ర వాదులపైనా టీఎంసీ, బీజేపీ దాడులను తట్టుకుని ముందకు సాగుతున్న నాయకుల పోరాటం స్ఫూర్తిదాయమకమనీ, వారికి సంఘీభావం తెలపడంతోపాటు మద్దతుగా నిలవాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం 10వ మహాసభ నిర్ణయించింది. ఈ మేరకు తీర్మానాన్ని తమిళనాడు ప్రతినిధి ఎన్.చంద్రం ప్రవేశపెట్టగా ఇస్లాం అస్లాన్ బలపరిచారు. తృణమూల్ గూండాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్యకర్తలకు సంఘీభావం ప్రకటించారు. బెంగాల్లో ఉన్న ప్రజా ఉద్యమంపై జరుగుతున్నదాడులను అడ్డుకునే క్రమంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. వామపక్షాలను, ప్రజాతంత్ర వాదులను పూర్తిగా తొలగించాలనే ఉద్దేశంతో టీఎంసీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. దీనికోసం కేంద్రంలోని బీజేపీ, బెంగాల్లోని టీఎంసీ కలిసి ఐక్యంగా పనిచేశాయని వివరించారు. టీఎంసీ పాలనలో బెంగాల్ గ్రామీణ ప్రాంతంలో పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వంలో ఉన్న పెద్దలు బలవంతంగా తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని అన్నారు. పంటలకూ తగినంత ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం అవడంతో ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు. ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలూ తగ్గుతున్నాయని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకాన్ని టీఎంసీ గూండాలు వారి ఆర్థికవనరుగా వాడుకుం టున్నారని, పెద్దఎత్తున అవినీతి జరుగుతోందని తీర్మానంలో పేర్కొన్నారు. టిఎంసి విధానాల వల్ల వ్యవసాయ కార్మికులు ఎక్కువగా నష్టపోయారని పేర్కొన్నారు. ఈ క్రమంలో టీఎంసీ ికి వ్యతిరేకంగా పెద్దఎత్తున పోరాటాలు సాగుతున్నాయని అన్నారు.
వారిని ఏకం చేసేందుకు కృషి జరుగుతోందని, వామపక్ష ఉద్యమం పునరుజ్జీవం కావడానికి వ్యవసాయ కార్మిక ఉద్యమం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బెంగాల్లో వర్గ శక్తులను ఐక్యం చేయడానికి వ్యవసాయ కార్మిక ఉద్యమం కృషి చేయాలని ఈ మహాసభలో తీర్మానించారు.