Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏక్నాథ్ షిండే వర్గానికి శివసేన పార్టీ పేరు..గుర్తు
- ఈసీ సంచలన నిర్ణయం
న్యూఢిల్లీ : ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం ఊహించని షాక్ ఇచ్చింది. శివసేన పార్టీ పేరు, పార్టీ గుర్తును..ఏక్నాథ్ షిండే వర్గానికి కేటాయించింది. శివసేన పార్టీ గుర్తు విల్లు, బాణంను షిండేకు కేటాయిస్తూ ఈసీ శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకుంది. 2019లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన తరఫున గెలిచిన 55 మందిలో 40 మంది షిండే వెంటే ఉన్నారు. మొత్తం ఎమ్మెల్యేలకు కలిపి 47,82,440 ఓట్లు పోలవగా, షిండే వర్గానికి చెందిన 40 మంది ఎమ్మెల్యేలకు 36,57,327 ఓట్లు దక్కాయి. మొత్తం ఓట్లలో 76శాతం షిండే వర్గానికి దక్కగా, ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన 15 మంది ఎమ్మెల్యేలకు 12శాతం ఓట్లు మాత్రమే ఉన్నాయి. 2018లో శివసేన పార్టీ రాజ్యాంగంలో సవరణలను తమకు చూపించలేదని, అవి తమకు సమ్మతం కాదని ఎన్నికల సంఘం వ్యాఖ్యా నించింది. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని శివసేన తప్పుబట్టింది. వివాదం సుప్రీంకోర్టులో ఉండగానే బీజేపీ ఒత్తిడి కారణంగా షిండే వర్గానికి అను కూలంగా నిర్ణయం తీసుకుందని ఎన్నికల సంఘాన్ని విమర్శించింది. అయితే ఈసీ నిర్ణయంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భిన్నంగా స్పందించారు. కొత్త పేరు, కొత్త సింబల్‌తో ప్రజా కోర్టుకు వెళ్తామన్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఏక్నాథ్ షిండే నాయకత్వంలో శివసేనలో చీలిక తీసుకొచ్చి..మహారాష్ట్రలో అధికారాన్ని బీజేపీ హస్తగతం చేసుకుంది.