Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటి) విధించిన 500 కోట్ల జరిమానాపై సుప్రీం కోర్టు స్టే విధించింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో పర్యావరణ అనుమతులు ఉన్న 7.15 టీఎంసీల వరకు పని కొనసాగించుకునేందుకు మాత్రమే సుప్రీంకోర్టు అనుమతించింది. కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించుకు కోవాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. తాగునీటి ఎద్దడిని ఎదుర్కోవద్దనీ, ప్రజలు ఇబ్బందులకు గురికాకూడదన్న ఉద్దేశంతోనే ఈ అవకాశం కల్పిస్తున్నట్టు స్పష్టం చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌ల ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో మెరిట్స్ ఆధారంగానే తగిన నిర్ణయాలు ఉంటాయని ధర్మాసనం తెలిపింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించారని ఎన్జిటీ విధించిన రూ. 500 కోట్ల జరిమానాపై సుప్రీంకోర్టు ధర్మాసనం స్టే విధించింది. ఎన్జీటి జరిమానా విధిస్తూ.. ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌ల ధర్మాసనం విచారణ జరిపింది. ప్రతివాదులందరికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో ప్రతివాదులు అంతా... కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని, ఆ తరువాత ఆరు వారాల్లో వాటికి సమాధానంగా రిజాయిండర్లు దాఖలు చేయాలని పిటిషనర్‌ను కూడా ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ ఆగష్టులో చేపట్టనున్నట్టు తెలిపింది.