Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లోక్‌సభలో కేంద్రం తీరుపై ఆయా రాష్ట్రాలు అసంతృప్తి
న్యూఢిల్లీ : రాష్ట్రాలకు జీఎస్టీ నష్టపరిహారాల చెల్లింపు గడువు పెంచాలనే అంశం లోక్‌సభలో మళ్లీ చర్చనీయాంశమైంది. ఈ అంశంపై కేరళకు చెందిన వివిధ పార్టీల ఎంపీలు లేవనెత్తారు. ఆ రాష్ట్రానికి బీజేపీ ఎంపీలు సైతం గడువు పెంచాలని కేంద్రాన్ని కోరటం గమనార్హం.
రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే జీఎస్టీ నష్టపరిహార చెల్లింపు గడువు పెంచాలని కేరళ సహా మిగతా రాష్ట్రాల ఎంపీలు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. దేశంలో ఒక మంచి ఆర్థిక సమాఖ్య విధానాన్ని కొనసాగించాలని, తద్వారా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుందని ఆయా రాష్ట్రాల ఎంపీలు కేంద్రానికి తెలిపాయి. ఆర్ఎస్పీ ఎంపీ ప్రేమ్‌చంద్రన్ మాట్లాడుతూ, జీఎస్టీ నష్టపరిహారాన్ని అందజేయటంలో రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేస్తోందన్నారు. కేరళ ప్రతిఏటా దాదాపు రూ.5వేల కోట్లు నష్టపోతోందన్నారు. నష్టపరిహారం చెల్లింపులో కేంద్రం అనుసరిస్తున్న విధానం ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా ఉందని, దీనివల్ల ఆయా రాష్ట్రాల్లో రెవెన్యూ లోటు పెరిగిందని విమర్శించారు.
ఐజీఎస్టీ చెల్లింపుల్లో కేరళకు అన్యాయం జరుగుతోందని ప్రేమ్‌చంద్రన్ ఆరోపించారు. దీనిపై స్పందించిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, 2017-18 నుంచి ఇప్పటివరకూ రూ.41,779 కోట్లు ఐజీఎస్టీ కింద కేరళకు అందాయని, కేవలం రూ.750 కోట్లు మాత్రమే రావాల్సి ఉందని, కేరళ అకౌంట్స్ జనరల్ నుంచి ఆర్థిక నివేదికలు రానందున ఈ నిధులు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. అకౌంట్స్ జనరల్ ఆడిట్ నివేదికలు 2021లోనే కేంద్రానికి కేరళ పంపిందని, ఈ నివేదికల్ని పరిశీలించకుండానే జీఎస్టీ నష్టపరిహారంపై కేంద్రం ఎలా ఒక అంచనాకు వస్తోందని తాజాగా ఎల్డీఎఫ్ ప్రభుత్వం ప్రశ్నించింది. జీఎస్టీ నష్టపరిహారం చెల్లింపు గడువు, నిధుల మొత్తం పెంచాలని కేరళ, తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీసగడ్, పశ్చిమ బెంగాల్, బీజేపీ పాలిత రాష్ట్రాలు కోరుతున్నాయి.