Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫైనాన్స్ బిల్లులో చేర్చే అవకాశం
- దిగువ కోర్టులు, ట్రిబ్యునల్లు అందించే సేవలపై పన్ను
- రాష్ట్రాలకు జీఎస్టీ పెండింగ్ బకాయిలు రూ.16,982 కోట్లు విడుదల :
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- 2021-22 జీఎస్టీ పరిహారాన్ని తప్పుగా లెక్కించిన అంశాన్ని లేవనెత్తిన రాష్ట్రాలు
- పెట్రోల్, డిజిల్‌పై సెస్సును నిలిపివేయాలి: కెఎన్ బాలగోపాల్, కేరళ ఆర్థిక మంత్రి
న్యూఢిల్లీ : అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటుపై జీఎస్టీ కౌన్సిల్లో ఏకాభిప్రాయం వచ్చినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. విజ్ఞాన భవన్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 49వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, కేంద్ర, రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ల ఏర్పాటు, పాన్ మసాలా, గుట్కా వ్యాపారంలో పన్ను ఎగవేతలను అరికట్టడానికి యంత్రాంగం, ఇతర అంశాలపై చర్చించారు. అనంతరం నేషనల్ మీడియా సెంటర్ (ఎన్ఎంసీ)లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి, కేంద్ర రెవెన్యూ కార్యదర్శి సంజరు మల్హోత్రా, సీబీఐసీ చైర్మెన్ వివేక్ జోహ్రీ తదితరులతో కలిసి నిర్మలా సీతారామన్ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం తీసుకున్న నిర్ణయాలను వివరించారు.
నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ ''మేము చాలా వివరంగా రోజంతా సమావేశమయ్యాము. వాతావరణం పూర్తిగా స్నేహపూర్వకంగా ఉంది. కలిసి పని చేయాలనే భావన ఉంది. ఫలితంగా, రెండు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్(జీఓఎం) నివేదికలు ఆమోదించాం. వాటిలో ఒక చిన్న సవరణ, భాషలో కొన్ని మార్పులు ఉన్నాయి'' అని అన్నారు.
జీఎస్టీ ట్రిబ్యునల్ ఏర్పాటుకు ఆర్థిక బిల్లు
జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు సంబంధించిన జీఓఎం నివేదికను భాషలో స్వల్ప మార్పులతో ఆమోదించామని, దానిని రాష్ట్రాలతో పంచుకుంటామని, ఆ తరువాత ట్రిబ్యునల్ ఏర్పాటుకు సంబంధించిన తుది ముసాయిదా రూపొందించనున్నట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. అప్పిలేట్ ట్రిబ్యునల్‌పై జీఓఎం తుది ముసాయిదా కొన్ని రోజుల్లో సభ్యులకు పంపుతాం. కౌన్సిల్ మళ్లీ సమావేశానికి ఎక్కువ సమయం లేనందున, తుది అభిప్రాయాన్ని స్వీకరించడానికి, ఆర్థిక బిల్లులో చేర్చడానికి జీఎస్టీ కౌన్సిల్ చైర్‌పర్సన్‌కు అధికారం ఇచ్చిందని అన్నారు. ''ట్రిబ్యునల్‌పై జీఎస్టీ కౌన్సిల్ అంగీకరించింది. మార్చి 3 నాటికి అవసరమైన మార్పులు ఖరారు చేస్తాం. తద్వారా ఈ ఏడాది ఫైనాన్స్ బిల్లు కూడా ట్రిబ్యునల్ ఏర్పాటుకు సహాయపడుతుంది'' అని అన్నారు. పాన్ మసాలాపై పన్ను విధింపుపై జీఓఎం నివేదికను జీఎస్టీ కౌన్సిల్ అంగీకరించిందని వెల్లడించారు.
రూ.16,982 కోట్ల జీఎస్టీ పెండింగ్ బకాయిలు విడుదల
''రాష్ట్రాలకు పెండింగ్‌లో ఉన్న జీఎస్టీ పరిహారానికి సంబంధించిన మొత్తం బకాయిలు విడుదల చేశాం. జూన్ 2022కి సంబంధించి పెండింగ్‌లో ఉన్న రూ.16,982 కోట్ల జీఎస్టీ పరిహారం మొత్తం క్లియర్ చేస్తున్నాం. అయితే ఇది ప్రస్తుతానికి జీఎస్టీ పరిహార నిధిలో అందుబాటులో లేదు. కేంద్రం ఖజానా నుంచి చెల్లించిన తరువాత భవిష్యత్తులో సెస్ సేకరణల నుంచి తిరిగి దానికి తీసుకుంటాం'' అని అన్నారు. ''దీనికి అదనంగా, అకౌంటెంట్ జనరల్ ధ్రువీకరించిన రాష్ట్రాలు చేసిన అదనపు పరిహారం క్లెయిమ్‌లను కూడా కేంద్రం క్లియర్ చేస్తుంది. ఈ మొత్తం రూ. 16,524 కోట్లు'' అని తెలిపారు.
దిగువ కోర్టులు, ట్రిబ్యునల్లు అందించే సేవలపై పన్ను
''రివర్స్ ఛార్జ్ మెకానిజం దిగువ కోర్టులు, ట్రిబ్యునల్లు అందించే సేవలపై పన్ను విధించాలని నిర్ణయం తీసుకున్నాం. చట్టం, ప్రక్రియ సంబంధిత విషయాలపై మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. కంటైనర్ల కోసం ఉపయోగించే డేటా లాగర్లు, ట్రాకింగ్ పరికరాలు కొన్ని షరతులకు లోబడి 18 శాతం నుంచి సున్నాకి తగ్గిస్తున్నాం'' అని నిర్మలా సీతారామన్ తెలిపారు. ''రాబ్‌పై జీఎస్టీ రేట్లకు సంబంధించిన (యూపీ, ఇతర రాష్ట్రాలకు విలక్షణమైన ఒక రకమైన ద్రవ బెల్లం) నిర్ణయం తీసుకున్నాం. మేము రాబ్‌పై జీఎస్టీ రేటును 18 శాతం నుంచి సున్నాకి తగ్గిస్తున్నాము. అది వదులుగా విక్రయించబడితే, ముందుగా ప్యాక్ చేయబడి లేబుల్ చేయబడితే 5 శాతం జీఎస్టీ విధిస్తాం. పెన్సిల్, షార్పనర్లపై జీఎస్టీకి సంబంధించి చాలా చర్చలు జరిగాయి. ఇది 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గిస్తున్నాం'' అని వివరించారు.
''రూ.20 కోట్ల మొత్తం టర్నోవర్ కలిగిన చిన్న పన్ను చెల్లింపుదారులు, రూ.5 కోట్ల నుంచి రూ.20 కోట్ల టర్నోవర్ ఉన్న రిజిస్టర్డ్ సంస్థల కోసం వార్షిక రిటర్న్‌లను ఆలస్యంగా దాఖలు చేయడం కోసం ఆలస్య రుసుము హేతుబద్ధీకరణపై నిర్ణయం తీసుకోబడింది. కొన్ని రిటర్న్‌ల కోసం క్షమాభిక్ష పథకం కూడా ప్రవేశపెడతాం'' అని అన్నారు. కౌన్సిల్ ఆమోదించిన వాషరీస్ ద్వారా సరఫరా చేయబడిన బొగ్గు తిరస్కరణలపై మినహాయింపు ఇచ్చినట్టు తెలిపారు.
2021-22 జీఎస్టీ పరిహారాన్ని తప్పుగా లెక్కించిన విషయాన్ని రాష్ట్రాలు లేవనెత్తాయని తమిళనాడు ఆర్థిక మంత్రి పి తైగ రాజన్ అన్నారు. సమావేశ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్య ఆధారిత మిల్లెట్ ఉత్పత్తులపై రేటు తగ్గింపు ప్రతిపాదన ఫిట్మెంట్ కమిటీకి తిరిగి పంపబడిందని అన్నారు. ఆన్లైన్ గేమింగ్ నివేదికపై జీఓఎం అజెండాలో లేదని అన్నారు. అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటుపై కౌన్సిల్ దాదాపు ఏకాభిప్రాయానికి వచ్చిందన్నారు. అయితే అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటుపై రాతపూర్వక పత్రాన్ని తరువాత ఆశిస్తున్నామని అన్నారు. అప్పిలేట్ ట్రిబ్యునల్, రాష్ట్ర ట్రిబ్యునల్, నిర్మాణాత్మక సమస్యల కోసం ఎంపిక కమిటీపై స్పష్టతపై మండలి చర్చించిందన్నారు. తమిళనాడుతో సహా కొన్ని రాష్ట్రాలు జాతీయ ట్రిబ్యునల్‌లోని రాష్ట్ర అప్పిలేట్ ట్రిబ్యునల్ బెంచ్‌ల ఏర్పాటుపై సమస్యలను లేవనెత్తాయని తెలిపారు.
పెట్రోల్, డీజిల్‌పై సెస్సును నిలిపివేయాలి
పెట్రోల్, డీజిల్‌పై సెస్సును నిలిపివేయాలి కేరళ ఆర్థిక మంత్రి కెఎన్ బాలగోపాల్ డిమాండ్ చేశారు. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చర్చించడానికి తమకు ఎజెండాలు ఉన్నాయని, దాదాపు అన్ని రాష్ట్రాలు జీఎస్టీ కామన్ సెషన్ వ్యవధిని పొడిగించాలని కోరాయన్నారు. జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను, కేంద్ర పన్నుల్లో ఎక్కువ వాటాను డిమాండ్ చేశామని అన్నారు. పెట్రోల్, డీజిల్‌పై సెస్సును నిలిపివేయాలని అడుగుతున్నామని అన్నారు.