Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నీటివ్యాపారంపై నీతి ఆయోగ్ కసరత్తు
న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వం ప్రజలపై మరో పెను భారానికి సన్నాహాలు చేస్తోంది. ప్రజల కనీస అవసరమైన నీటితో వ్యాపారం చేయాలని చూస్తోంది. ఇప్పటికే దేశంలో సంపదను, అనేక వనరులను ప్రైవేటుకు, కార్పొరేట్ల పరం చేస్తున్న బిజెపి ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా నీటిని కూడా వారికి అప్పగించాలని చూస్తోంది. అందరికీ నాణ్యమైన నీటిని అందించడానికి బదులుగా డబ్బు చెల్లించే వారికే నీటిని అందించేందుకు మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. నీటి వ్యాపారం కోసం ప్రపంచ ప్రమాణాలను అధ్యయనం చేయడానికి నీతి ఆయోగ్ ప్రణాళికలు సిద్ధం చేయడమే ఇందుకు నిదర్శనం. నీటి వ్యాపారంపై అధ్యయనం చేయాలనే నీతి ఆయోగ్ నిర్ణయం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ నయా ఉదారవాద వైఖరికి కొనసాగింపు అని, దానిని మరింతగా ముందుకు తీసుకెళ్లడమేనని నిపుణులు చెబుతున్నారు. నీటిని ప్రైవేటీకరించడం భారత్‌లో కొత్త కాదు. జాతీయ నీటి విధానం 2002లో సెక్షన్ 13, జాతీయ నీటి విధానం 2012లో సెక్షన్లు 11.6, 12.3 కూడా నీటి నిర్వహణలో ప్రైవేటు జోక్యాన్ని ప్రతిపాదించాయి. ప్రభుత్వ- ప్రైవేట్ భాగస్వామ్యాన్ని నొక్కి చెప్పాయి. ఈసారి మోడీ ప్రభుత్వానిది పూర్తిగా కొత్త ఆలోచన. ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు నీరు, నీటి వనరులకు చట్టబద్ధమైన యజమానులుగా ఉంటాయి. ఇది అమల్లోకి వస్తే జాతీయ వనరు అయినప్పటికీ నీరు బంగారం, వెండి వలే అమ్ముడు పోతుంది. ఈ అంశంపై బలమైన చట్టాన్ని నీతి ఆయోగ్ ప్రతిపాదించవచ్చు. ఇప్పటికే నిరంతరం వరదలు, కరువు ఎదుర్కొంటున్న భారతీయులను నీరు పూర్తిగా వ్యాపారమయం చేయడం అనే ప్రతిపాదన కలవరపెడుతుంది. నీరు వాణిజ్యానికి సరుకుగా మారిన తరువాత నీరు ధర ఎంత ఉంటుందన్నది పేద, మధ్యతరగతి ప్రజలను కలవర పెట్టే ప్రధాన ప్రశ్న. భారత్ వంటి దేశంలో నీటి వ్యాపారం అనే ఆలోచన సమానత్వం అనే భావనకే సవాలుగా నిలుస్తుంది. అందరికీ నీరు అనే దానికి బదులుగా డబ్బులు చెల్లించేవారికి నీరు అనేదాన్ని ఇది ప్రోత్సహిస్తుంది. సమాజంలో కొనుగోలు శక్తిలో వ్యత్యాసం భిన్నంగా ఉంటుంది కాబట్టి, నీటి వ్యాపారంతో కొత్త అసమానతలు ఏర్పడతాయి. నీటి ఘర్షణలు, యుద్ధాలకు దారి తీయవచ్చు. వివిధ రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు మరింత తీవ్రరూపం దాల్చ వచ్చు. నీటి వివాదాలు సామాన్యం కావచ్చు. నీటి వ్యాపారంపై ప్రపంచ ప్రమాణా లను అధ్యయనం చేస్తున్న క్రమంలో నీతి ఆయోగ్ అమెరికా, ఆస్ట్రేలియా, చిలీ దేశాల్లోని వ్యవస్థను పరిశీలిస్తే.. ఆ దేశాలకు భారత్‌కు అనేక వ్యత్యాసాలు ఉన్నాయని నీతి ఆయోగ్ గ్రహించాలి. భారత్‌లో వర్షాల అనిశ్చితి, జనాభా సాంధ్రత, వైవిధ్యమైన వృద్ధి అవసరాలు పైన పేర్కొన్న దేశాల కంటే భిన్నంగా ఉంటాయి. దీనిని నీతి ఆయోగ్ పరిశోధించడం చాలా అవసరం.
ఇంగ్లండ్‌లో చేదు అనుభవం
నీటి ప్రైవేటీకరణలో చేదు అనుభవాలను ఎదుర్కొన్న తరువాత ఇంగ్లండ్ నీటి వ్యాపారాన్ని విరమించుకుంది. దానికి బదులుగా నీటి నిర్వహణ ప్రక్రియ లను మునిసిపలైజ్ చేసింది. నీటి వ్యాపారం నీతి ఆయోగ్ ఉద్దేశ్యం కాబట్టి నీతి ఆయోగ్ హేతు బద్ధమైన, సమర్థవంతమైన, అవినీతి రహిత పర్య వేక్షణ వ్యవస్థల గురించి ఆలోచించాలి. జాతీయ వనరైన నీరు వాణిజ్యానికి వనరు గా ఎలా ఉంటుంది?, ఎంఎన్‌సి కంపెనీల పెట్టుబడులను ప్రభుత్వం ఎలా నియంత్రి స్తుంది? అనే ప్రశ్నలకు నీతి ఆయోగ్ జవాబులు ఇవ్వాల్సి ఉంటుంది.
అసహ్యకరం
లక్షలాది మంది ప్రజలు తాగునీటిని సేకరించడానికి, నిల్వ చేయడానికి మైళ్ల దూరం నడిచి వెళ్లవలసిన పరిస్థితిలో, లాభాలను పెంచుకోవడానికి నీటిని ప్రైవేటీ కరణ చేయడం నేరం. తరువాత, గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరిందని సాకుగా చూపి, మోడీ ప్రభుత్వం మనం పీల్చే గాలిని కూడా ప్రైవేటీకరిస్తుంది.
- సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ట్వీట్