Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జర్నలిస్టులు, ప్రతిపక్ష నాయకులు, సాధారణ పౌరులపైనా కేసులు
- వందల కోట్లతో పరువునష్టం ఆరోపణలు, క్రిమినల్ కేసులు నమోదు
- వేర్వేరు రాష్ట్రాల్లో కేసుల విచారణ..తట్టుకోలేకపోతున్న బాధితులు
అదానీ కంపెనీ అక్రమాలు, స్టాక్ మార్కెట్ మోసాలపై 'హిండెన్‌బర్గ్' నివేదిక ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రపంచ మీడియా స్వేచ్ఛగా ఈ నివేదికపై వార్తా కథనాలు రాసింది. భారత్‌లో మాత్రం ప్రధాన మీడియా, వందలాది టీవీ ఛానల్స్ భయపడుతున్నాయి. ఈ వ్యవహారంతో ప్రధాని మోడీ పేరు ముడిపడి ఉన్నందున మీడియా, టీవీ ఛానల్స్ 'హిండెన్‌బర్గ్' నివేదికపై విశ్లేషణ చేయడానికి వెనుకాడుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం..'అదానీ గ్రూప్' వేసే పరువునష్టం కేసులు. మరోవైపు మోడీ సర్కార్ నుంచి ఎదురయ్యే వేధింపులు. అదానీపై వార్తలు రాసిన..వ్యాఖ్యలు చేసిన స్టాక్‌మార్కెట్ ఇన్వెస్టర్స్, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, మరికొంత మందిపై వందలకోట్ల పరువునష్టం కేసులు, క్రిమినల్ కేసులున్నాయి.
న్యూఢిల్లీ : ఆస్ట్రేలియాలో పర్యావరణ కార్యకర్త బెన్ పెన్నింగ్, సీఎన్‌బీసీ, టీవీ 18 జర్నలిస్టులపై అదానీ కంపెనీలు క్రిమినల్ పరువునష్టం కేసులు వేశాయి. 'హిండెన్‌బర్గ్' నివేదిక బయటకు వచ్చాక పెద్ద పెద్ద మీడియా సంస్థలు మాట్లాడటానికి, వార్తలు రాయడానికి జంకుతున్నాయి. దీనికి కారణం అదానీ గ్రూప్‌నకు మోడీ సర్కార్ నుంచి అందుతున్న మద్దతు, సహకారం. గౌతం అదానీ కంపెనీ ఆర్థిక అక్రమాలు, ఆ కంపెనీలకు దక్కుతున్న రుణాలపై ఇన్వెస్టర్స్, జర్నలిస్టులు, సాధారణ పౌరులు, ఎంతో మంది రాజకీయ నాయకులు ఆరోపణలు చేశారు. ఇప్పుడు 'హిండెన్‌బర్గ్' నివేదికతో వారి ఆరోపణలకు మరింత బలం చేకూరింది. పరువునష్టం కేసులు, కోర్టు కేసులు వేస్తూ అదానీ గ్రూప్ కంపెనీ ఇంతకాలం బెదిరిస్తూ వస్తోంది. కోర్టు ఆదేశాలతో ఎంతోమంది నోరు మూయించే ప్రయత్నం చేసింది. కేంద్రంలోని పాలకుల నుంచి అందుతున్న మద్దతు, సహకారంతో ఇదంతా సాగుతోంది. 'అదానీ గ్రూప్' గురించి మాట్లాడితే ప్రతీకారం తప్పదనే పరిస్థితి సృష్టించింది. హిండెన్‌బర్గ్ నివేదిక వచ్చాక అదానీ గ్రూప్ మనుషులు పెద్ద సంఖ్యలో రంగంలోకి దిగారు.
మూడు రాష్ట్రాల్లో ఆరు కేసులు
67 ఏండ్ల పరంజమ్ గుహా థాకుర్తా ఇండిపెండెంట్ జర్నలిస్టు. ఆయనపై అదానీ గ్రూప్ ఆరు పరువునష్టం కేసులు వేసింది. ఇందులో మూడు క్రిమినల్ కేసులున్నాయి. గౌతం అదానీ కంపెనీ అక్రమాలపై వరుస వార్తా కథనాలు రాసినందుకు ఆయనకు దక్కిన ఫలితమిది. ఒక ఉన్నత స్థాయి కోర్టు న్యాయమూర్తి అదానీ గ్రూప్‌నకు అనుకూలంగా వ్యవహరించాడని ఆరోపిస్తూ థాకుర్తా వార్తా కథనం రాశారు. దీనిపైనా ఆయన కోర్టు కేసు ఎదుర్కొంటున్నారు. ఇకపై ఆయన అదానీ పేరెత్తడానికి వీల్లేదు, అదానీపై వార్తలు రాయరాదు..అంటూ ఆ కేసులో న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుల విచారణను ఎదుర్కోవటానికి ఆయన అనేక వ్యయప్రయాసలకు గురవుతున్నారు.
''గౌతం అదానీ కంపెనీ వ్యవహారాలపై మాట్లాడరాదు..అంటూ కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాల్ని ధిక్కరించలేం. అదానీ కంపెనీలు వేసిన కేసులను ఎదుర్కొనేందుకు పెద్దమొత్తంలో డబ్బులు ఖర్చు అవుతున్నాయి. మూడు రాష్ట్రాల్లో కేసుల విచారణకు హాజరవుతున్నాం. మానసికంగా, శారీరకంగా మమ్మల్ని వేధించటమే ఇది'' అని థాకుర్తా సహ ఉద్యోగి అబీర్ దాస్‌గుప్తా చెప్పుకొచ్చారు. ''మా సమయాన్ని, కుటుంబాల్ని ప్రభావితం చేస్తున్నారు. ఎంతో సమయాన్ని కోల్పోవటమేగాక, ఆదాయాన్ని సైతం వదులుకోవాల్సి వస్తోంది'' అని చెప్పారు.
మోడీకి అనుకూలంగా మీడియా
హిండెన్‌బర్గ్ నివేదికలో పేర్కొన్న అంశాలు..'భారత ఆర్థిక వ్యవస్థ'పై జరిగిన తీవ్రవాద దాడిగా మోడీ అనుకూల మీడియా చెబుతోంది. 'ఆర్థిక తీవ్రవాదం' పేరుతో అనేకమంది ఆరోపణల్ని, విమర్శల్ని కొట్టిపారేస్తోంది. హిండెన్‌బర్గ్ నివేదికపై భారతీయ మీడియా చర్చించడానికి ఇష్టపడటం లేదని, 400 టీవీ ఛానల్స్‌లో అత్యధికం అనుకూలంగా ఉండటం మోడీ సర్కార్‌కు కలిసివచ్చిందని న్యూస్‌లాండ్రీ జర్నలిస్ట్ 'మనీషా పాండే' అన్నారు. ''ఒక బడా కార్పొరేట్ కంపెనీపై వచ్చిన నివేదికగానే కాదు, ఇది భారత ప్రధాని మోడీ, ఆయన పాలనపై వచ్చిన ఆరోపణలుగా చూడాలి'' అని చెప్పారు.
హిండెన్‌బర్గ్ ఏం చెప్పింది?
హిండెన్‌బర్గ్ నివేదికలో పేర్కొన్న ముఖ్యమైన ఆరోపణ..భారత స్టాక్‌మార్కెట్‌ను కృత్రిమంగా ప్రభావితం చేయటం. మలేషియాలోని ఒక కంపెనీ అదానీ షేర్లను కొనుగోలు (ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా) చేసింది. దీంతో అదానీ షేర్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి. షేర్లు కొనుగోలు చేసిన ఆ కంపెనీ అదానీదే. స్టాక్ మార్కెట్లో షేర్ ధర భారీగా పెరిగాక, ఆ ధరను పరిగణనలోకి తీసుకొని ఎల్ఐసీ,ఎస్బీఐ వేల కోట్ల రుణాలు ఇచ్చాయి. అదానీ కంపెనీల అక్రమాల్లో మచ్చుకు ఇదొక ఉదాహరణ మాత్రమే. ప్రధాని మోడీకి గౌతం అదానీ అత్యంత సన్నిహితుడు అన్నది అందరికీ తెలిసిందే. కేంద్ర ప్రభుత్వంతో ఆయనకు ఉన్న సంబంధాలు, సహకారంతో రుణాలు అందాయని అర్థమవుతోంది. దీంతో ఓడరేవులు, విమానాశ్రయాలు, బొగ్గు క్షేత్రాలు, వంట నూనెల తయారీ..ఇలా అనేక రంగాల్లో 'అదానీ గ్రూప్' గుత్తాధిపత్యం పతాక స్థాయికి చేరింది.