Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అలాంటి ప్రణాళికలకు దిశానిర్దేశం చేసేందుకు ప్లీనరీ
- 2024లో బీజేపీ ని ఓడించడమే ప్రధాన లక్ష్యం
- ఛత్తీస్‌గఢ్ లో ఫిబ్రవరి 24 నుంచి మూడు రోజుల పాటు కాంగ్రెస్ 85వ ప్లీనరీ
- 15,000 మంది ప్రతినిధులు.. మీడియాతో కాంగ్రెస్ నేతలు
న్యూఢిల్లీ : కాంగ్రెస్ లేకుండా ప్రతిపక్షాల ఐక్యత సాధ్యం కాదని ఆ పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ అన్నారు. అటువంటి ప్రణాళికలకు దిశానిర్దేశం చేసేందుకు ప్లీనరీ జరగుతుందని అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని రారుపూర్‌లో కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశం ఫిబ్రవరి 24 నుంచి 26 వరకు జరగనున్నది. ఈ సందర్భంగా ఆదివారం నాడిక్కడ ఎఐసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నేతలు కెసి వేణుగోపాల్, జైరాం రమేష్, పవన్ కుమార్ బన్సాల్, కుమారి సెల్జా, తారిక్ అన్వార్ లు ప్లీనరీ ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తొలుత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కెసి వేణుగోపాల్ మాట్లాడుతూ పార్టీ స్టీరింగ్ కమిటీ సెషన్ మొదటి రోజు సమావేశమై, పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)కి ఎన్నికలు నిర్వహించాలా? వద్దా? అని నిర్ణయిస్తుందని అన్నారు. ప్లీనరీ సమావేశాల అజెండాను తొలిరోజు జరిగే స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఖరారు చేస్తామనీ, ఆ తరువాత సబ్జెక్టుల కమిటీ తీర్మానాలకు తుది రూపం ఇస్తుందని వేణుగోపాల్ తెలిపారు. 2005లో హైదరాబాద్‌లో జరిగిన చివరి ప్లీనరీ తరువాత, ఢిల్లీ వెలుపల కాంగ్రెస్ ప్లీనరీ జరగడం ఇదే ప్రథమమని అన్నారు. ప్లీనరీ సెషన్ 2024 పార్లమెంటరీ ఎన్నికల వైపు ప్రయాణంలో ''ముఖ్యమైన మైలురాయి'' అని, దేశవ్యాప్తంగా సుమారు 15,000 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొంటారని పేర్కొన్నారు. ప్లీనరీకి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు 1,338 మంది, కో-ఆప్టెడ్లు 487 మంది ఉన్నారని, మొత్తం 1,825 మంది ప్రతినిధులు ఉన్నారని చెప్పారు. అంతేకాకుండా ఈ సమావేశానికి మొత్తం 9,915 మంది ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు హాజరవుతారని వేణుగోపాల్ తెలిపారు.