Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని పిటీషన్
న్యూఢిల్లీ : జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్)పై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దేశంలో వైద్య కోర్సుల్లో ప్రవేశానికి ఏకైక ప్రవేశమార్గం నీట్ అనేది భారత రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణం, ప్రాథమిక సమానత్వ హక్కును ఉల్లంఘించడం, ఫెడరలిజయం సూత్రాలను విస్మరించడంగా ప్రకటించాలని సుప్రీంకోర్టులో తమిళనాడు ప్రభుత్వం శనివారం ఒరిజినల్ సూట్ వేసింది. న్యాయవాది సబరిష్ సుబ్రమణ్యం ద్వారా ఈ సూట్‌ను కోర్టులో దాఖలు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 131 ప్రకారం వేసిన ఈ పిటీషన్లో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చింది. 'నీట్లో సాధించిన మార్కులే అన్ని వైద్య, అనుబంధ కోర్సుల్లో ప్రవేశానికి ప్రమాణం అని చెప్పడం భారత రాజ్యాంగంలోని నిబంధనలు, రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఏకపక్షంగా ఉల్లంగించడమే' అని సుప్రీకోర్టు ప్రకటించాలని పిటిషన్లో తమిళనాడు ప్రభుత్వం కోరింది. 'నీట్ పరీక్షను ప్రవేశపెట్టడం, కొనసాగించడం వల్ల తమిళనాడు రాష్ట్రంలోని విద్యార్థులు ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు, తమిళనాడు రాష్ట్ర విద్యా మండలి అనుబంధ పాఠశాలల విద్యార్థులపై ప్రతికూల ప్రభావం పడ్డడం వలన' సుప్రీంకోర్టును తమిళనాడు ప్రభుత్వం ఆశ్రయించాల్సి వచ్చిందని పిటీషన్లో పేర్కొంది.
'నీట్‌తో వైద్య కళాశాలల్లోని ప్రభుత్వ సీట్లలో విద్యార్థులను చేర్చుకునే రాష్ట్రాల అధికారాన్ని హరించడం వల్ల సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలిగిస్తుంది. విద్య అనేది రాష్ట్రాలకు సంబంధించిన అంశం, దీనిపై చట్టాలను రూపొందించడం రాష్ట్రాల హక్కు, రాష్ట్ర విశ్వవిద్యాలయాల కోసం విద్యను నియంత్రించే హక్కు రాష్ట్రాలకు ఉంది. ప్రైవేట్, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ కళాశాలలు అనే తేడా లేకుండా అన్ని వైద్య కళాశాలల్లో ప్రవేశానికి నీట్‌ను ప్రవేశపెట్టడం సమాఖ్య నిర్మాణానికి, విద్యకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే రాష్ట్రాల స్వయంప్రతిపత్తిని ఉల్లంఘించడమే' అని పిటీషన్ వాదించింది.
అలాగే, నీట్ వల్ల రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో నివసించే, స్టేట్ బోర్డ్ స్కూల్స్‌లో చదువుతున్న విద్యార్థులపై ప్రతికూల ప్రభావం పడింది. నీట్ పరీక్ష సిబిఎస్ఇ/ఎన్‌సిఇఆర్‌టి సిలబస్‌పై ఆధారపడినందున ఈ విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరవుతున్నప్పుడు విపరీతమైన ప్రతికూలతను ఎదుర్కొంటున్నారని, నీట్ అనేదితమిళనాడు స్టేట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సెట్ చేసిన సిలబస్‌కు భిన్నంగా ఉందని తమిళనాడు ప్రభుత్వం పేర్కొంది.
అదేవిధంగా ఆర్థిక వనరుల కొరత, కోచింగ్ తరగతులకు ప్రాథన్యత, సంవత్సరం వ్యవధి తీసుకొని పరీక్షను మళ్లీ రాయకపోవడం వంటి అనేక ఇతర కారణాల వల్ల కూడా పైన పేర్కొన విద్యార్థులు ప్రతికూలంగా ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం పిటీషన్లో స్పష్టం చేసింది. 'అందువల్ల, ఈ విద్యార్థులు ఇంటర్ పరీక్షలలో ఎక్కువ మార్కులు సాధించినప్పటికీ, ఎక్కువ అవకాశాలు ఉన్న అర్భన్, సెమీ-అర్బన్ విద్యార్థులతో సమానంగా పోటీ పడలేరు' అని తమిళనాడు ప్రభుత్వం తన పిటీషన్లో పేర్కొంది.