Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగేండ్లలో రికార్డు స్థాయిలో ఆర్జన
- 2019-23 మధ్య గడించిన సొమ్ము రూ. 1900 కోట్లకు పైనే : కేంద్ర రైల్వే మంత్రి
న్యూఢిల్లీ : దేశంలో ఈ-టికెట్ల రద్దు రైల్వేకు భారీగా ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. 2019-23 మధ్య భారత రైల్వే రికార్డు స్థాయిలో రూ. 1900 కోట్లకు పైగా వసూలు చేసింది. కొన్ని నిర్ణీత మొత్తాలను సౌకర్యాల రుసుముగా కూడా పొందింది. కేంద్ర రైల్వే మంత్రి పార్లమెంటులో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ-టికెట్లు, కంప్యూటరైజ్డ్ ప్యాసింజర్ రిజర్వేషన్ పాలసీ (పీఆర్ఎస్) కౌంటర్ల ద్వారా జారీ చేయబడిన టికెట్లు.. ఇలా రెండింటిపై రైల్వే ప్రయాణీకుల రూల్ 2015 ప్రకారం టికెట్ రద్దుపై రద్దు లేదా క్లియరేజ్ ఛార్జీ విధించబడుతుంది. దీంతో టికెట్ల రద్దు రైల్వేకు ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది.
పార్లమెంటులో ఒక ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లిఖిత పూర్వక సమాధానాన్ని వెల్లడించారు. కేంద్ర మంత్రి సమాచారం ప్రకారం.. ఐఆర్సీటీసీ, ఈ-టికెటింగ్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఆన్లైన్ రిజర్వ్ చేసిన ఈ-టికెట్లను బుక్ చేసుకునే ప్రయాణీకుల నుంచి భారతీయ రైల్వే క్యాటరింగ్ మరియు టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) సౌకర్య రుసుమును విధిస్తుంది. 2019-20 నుంచి 2022-23 మధ్య (డిసెంబర్ వరకు) ఈ-టికెట్లతో సహా టికెట్ల రద్దు ద్వారా రైల్వేకు మొత్తం రూ. 1949.98 కోట్లు వచ్చాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో కౌంటర్ మరియు ఈ-టికెట్ రెండింటినీ రద్దు చేయడం ద్వారా రైల్వే అత్యధికంగా రూ. 694.08 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రద్దుల ద్వారా రూ. 604.40 కోట్లను సముపార్జించింది. టికెట్ల రద్దుపై ప్రయాణీకులకు కన్వీనియెన్స్ ఫీజు వసూలు చేయడం లేదని కేంద్ర మంత్రి పార్లమెంటుకు తెలిపారు. కాలానుగుణంగా రైల్వేలు జారీ చేసే సూచనల ఆధారంగా ఐఆర్సీటీసీ ద్వారా రద్దు లేదా సౌకర్యవంతమైన ఛార్జీలు సేకరిస్తారు అని వివరించారు. ప్రస్తుతం భారత రైల్వే నిమిషానికి 25,000 టికెట్ల బుకింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నది. ఈ సామర్థ్యాన్ని నిమిషానికి 2.25 లక్షలకు అప్‌గ్రేడ్ చేయడం లక్ష్యమనీ, ఇందుకు సాంకేతిక మెరుగుదల చేయబడుతున్నదనీ, సాఫ్ట్వేర్ జోడించబడుతున్నదని రైల్వే మంత్రి ఇటీవల వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఇది 4 లక్షలకు పెంచడానికీ రైల్వే శాఖ కృషి చేస్తుందన్నారు.