Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సహకార సంఘాలపై కేంద్రం తీరు సరికాదు
- రాష్ట్రాల అధికారాల్లో జోక్యం
- ఫెడరల్ స్ఫూర్తిని ఉల్లంఘిస్తున్న మోడీ సర్కారు
- కేరళ ప్రభుత్వం నుంచి తీవ్ర వ్యతిరేకత
తిరువనంతపురం : దేశంలో సహకారం సంఘాలపై పెత్తనం చలాయించాలని చూస్తున్న కేంద్రం తీరును కేరళ సర్కారు తప్పుబట్టింది. కేంద్రం గతంలో చేసిన సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు ప్రకటనను వ్యతిరేకించింది. మోడీ సర్కారు సమాఖ్య స్ఫూర్తిని ఉల్లంఘిస్తున్నదని ఆరోపించింది. వాస్తవానికి సహకార సంఘాలు అనేది రాష్ట్ర జాబితాలోని అంశం. భారత రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్లో రాష్ట్ర జాబితాలో ఉన్న 32 అంశాల్లో సహకార సంఘాలు అనేవి ఒకటి. దీంతో మంత్రిత్వ శాఖ ఏర్పాటుతో సహకార సంఘాలను తన చేతిలోకి లాక్కోవాలని మోడీ సర్కారు యోచిస్తున్నదని నిపుణులు, విశ్లేషకులు ఆరోపిం చారు. రాష్ట్ర జాబితాలో కేంద్రం వేలు పెట్టాలనుకోవడం ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని తెలిపారు.
2021-22 బడ్జెట్ ప్రసంగంలో బహుళరాష్ట్ర సహకార సంఘాలు (ఎంఎస్సీఎస్) గురించి ప్రకటన వచ్చింది. కేంద్రం సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటుపై 2021, జులైలో ప్రకటన చేసింది. దీంతో ఎంఎస్సీఎస్పై కేంద్రం తీరును అప్పటి నుంచి అనేక రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా వందేండ్లుగా సహకార సంఘాలను విజయవంతంగా నడుపుతున్న కేరళ రాష్ట్రం మోడీ సర్కారు ఎత్తులను ఆది నుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నది.
ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం
బహుళ రాష్ట్ర సహకార సంఘాల ( సవరణ) బిల్లు, 2022 ను లోక్‌సభలో గతేడాది డిసెంబర్ 7న ప్రవేశపెట్టారు. బడ్జెట్ సెషన్ రెండో భాగంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ నివేదికను ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఉన్న చట్టానికి అనేక సవరణలతో ఈ బిల్లును తీసుకొచ్చారు. ఏదైనా సహకార సంఘం ఉనికిలో ఉన్న ఎంఎస్సీఎస్లో కలిసేలా ఈ బిల్లు దారి కల్పిస్తుంది. అలాగే కేంద్రం సహకార ఎన్నిక యంత్రాంగంను ఏర్పాటు చేస్తుంది.
రాష్ట్రాలను సంప్రదించలేదు
కేంద్రం చేస్తున్న ఈ చర్యనే కేరళ వద్దంటున్నది. రాష్ట్రాల అధికారాల్లో కేంద్రం జోక్యం చేసుకుంటున్నదని కేరళ సహకార మంత్రి వి.ఎన్ వాసవన్ అన్నారు. 'ఒకే దేశం, ఒకే భాష' తర్వాత బీజేపీ 'ఒకే దేశం, ఒకే రిజిస్ట్రేషన్' విధానాన్ని తీసుకురావాలని యోచిస్తున్నదని ఆరోపించారు. రాష్ట్రాల హక్కులను లాక్కోవడమే దీని ఉద్దేశమని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సహకార రంగం అనేది రాష్ట్ర జాబితాలో ఉన్న అంశమైనప్పటికీ.. కేంద్రం రాష్ట్రాలను సంప్రదించలేదని విజయన్ సర్కారు ఆరోపించింది. సమాఖ్య స్ఫూర్తి, రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధంగా కేంద్ర మంత్రి డిపార్ట్మెంట్ కార్యదర్శి, రిజిస్ట్రార్‌కు నేరుగా ఆదేశాలు ఇచ్చారని వాసవన్ ఆరోపించారు.
ఎంఎస్సీఎస్ రాజ్యాంగానికి విరుద్ధం
బహుళ రాష్ట్ర సహకార సంఘాల చట్టం, 1984 అమలులోకి వచ్చిన తర్వాత ఎంఎస్సీఎస్ ఉనికిలోకి వచ్చింది. ఎంఎస్సీఎస్పై కేరళ ఆందోళనను వెలిబుచ్చింది. ఈ సొసైటీలు ఇతర విధులతో పాటు నిధులను సేకరించేందుకు, వడ్డీరేట్లను స్వతంత్రంగా నిర్ణయించడానికి అధికారం కలిగి ఉంటాయని కేరళ మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం లేదా సహకార విభాగం ఇలాంటి సొసైటీలను నియంత్రించలేవనీ, అది తప్పుడు నిర్వహణకు దారి తీస్తుందని, ప్రజలు తమ కష్టార్జితాన్ని కోల్పోతారని తెలిపారు. ఎంఎస్సీఎస్ అనేది రాజ్యాంగానికి విరుద్ధమని నిపుణులు అన్నారు.
కేరళ ఎందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది?
కేరళ ఒక బలమైన సహకార వ్యవస్థకు పేరు గాంచింది. 1910 నుంచి వందేండ్లకు పైగా చరిత్రను కలిగి ఉన్నది. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ముందు కూడా ట్రావెన్కోర్ (1914), కొచిన్ (1913), మలబార్ (1932) ప్రాంతాల్లోనూ సహకార చట్టాలు ఉండేవి. ప్రస్తుతం కేరళలో మొత్తం 941 పంచాయతీలలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్) 1607, మత్స్యకార సంఘాలు 1562 ఉన్నాయి. అలాగే, 23,167 సహకార సంఘాలు ఉన్నాయి. రాష్ట్రంలోని ఉరాలుంగల్ కార్మిక ఒప్పంద సహకార సంఘం (యూఎస్సీసీఎస్), బ్రహ్మగిరి డెవలప్మెంట్ సొసైటీ (బీడీస్), కేరళ రాష్ట్ర సహకార బ్యాంకు లిమిటెడ్ (కేరళ బ్యాంకు), ఎస్సీ, ఎస్టీ సహకార సంఘం, వనిత సహకార సంఘాలు వంటివి చాలా విజయవంతంగా నడుస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రజల ద్వారా నడుస్తున్న ఈ సహకార వ్యవస్థను కేంద్రం నాశనం చేయాలని, స్వార్థ ప్రయోజనాలను రుద్దాలని ప్రయత్నిస్తున్నదని వాసవన్ అన్నారు. కేంద్ర సహకార శాఖ నిర్ణయాలను, దానితో కలిగే ముప్పు దృష్ట్యా వ్యతిరేకించాలని తెలిపారు.