Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదానీ గ్రీన్ ఎనర్జీలో నార్వేకు చెందిన కేఎల్పీ పెట్టుబడులు
- కాలుష్యం వెలువడే పనులకు 'అదానీ' వాడుతోందని కేఎల్పీ ఆందోళన
హిండెన్‌బర్గ్ నివేదిక వెలువడ్డాక ప్రపంచ వ్యాప్తంగా 'అదానీ కంపెనీ'ల్లో పెట్టుబడులు పెట్టిన స్టాక్‌మార్కెట్ ఫండింగ్ సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. హిండెన్‌బర్గ్ విమర్శనాత్మక నివేదిక (జనవరి 24న వెలువడింది)లో పేర్కొన్న ఆరోపణలు, అక్రమాలు, అనుమానాలు..తేలిగ్గా తీసిపారేసేవి కాదు. స్టాక్ మార్కెట్లో అదానీ కంపెనీల షేర్లను కృత్రిమంగా పెంచారన్నది ప్రధాన ఆరోపణ. కంపెనీ నిర్వహణలో పచ్చి మోసపూరిత విధానాలన్నాయి, భారీగా పెరిగిన షేర్ల విలువను చూపించి..వేల కోట్లు రుణాలు తీసుకుందన్నది 'హిండెన్‌బర్గ్' నివేదిక సారాంశం. ఈ నివేదిక బయటకు వచ్చాక అదానీ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టిన అమెరికా, యూరప్ స్టాక్‌మార్కెట్ ఫండింగ్ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి.
న్యూఢిల్లీ : అదానీకి చెందిన అదానీ గ్రీన్, అదానీ టోటల్ గ్యాస్..మొదలైన కంపెనీలకు 'ఈఎస్జీ' మార్కెట్ ద్వారా పెట్టుబడులు సమకూరాయి. ఈ పెట్టుబడులను బొగ్గు తవ్వకాలకు, బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పత్తికి అదానీ కంపెనీ వాడుతోందని 'హిండెన్‌బర్గ్' నివేదికతో బహిర్గతమైంది. దాంతో అదానీలో పెట్టుబడులు పెట్టిన ఈఎస్జీ ఇన్వెస్టర్స్ రిస్క్‌లో పడ్డారు. నార్వేకు చెందిన అతిపెద్ద పెన్షన్ ఫండ్ 'కేఎల్పీ'దీ దాదాపు ఇదే పరిస్థితి. కాలుష్యం వెలువడే, సమాజానికి, పాలనారంగాలకు హాని తలపెట్టే ప్రాజెక్టులను చేపట్టమని హామీ ఇస్తేనే ఒక కంపెనీ షేర్లను 'ఈఎస్జీ మార్కెట్స్' కొనుగోలు చేస్తుంది. ఈ నమ్మకాన్ని అదానీ గ్రూప్ వమ్ముచేసిందని వార్తలు వెలువడ్డాయి. అదానీ గ్రూప్ కంపెనీల ఆర్థిక వ్యవహారాలు బయటపడ్డాక, స్టాక్‌మార్కెట్ 'డౌజోన్స్' సూచిక నుంచి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ను తొలగిస్తున్నట్టు ఈఎస్జీ, క్లయిమెట్ ఇండెక్స్‌లు, ఎస్ అండ్ పీ గ్లోబల్...ప్రకటించాయి. అదానీకి చెందిన మరో ఐదు కంపెనీల పేర్లను తమ 'పెట్టుబడుల జాబితా' నుంచి తొలగిస్తున్నట్టు కేఎల్పీ జనవరి 30న నిర్ణయించింది.
బొగ్గు గని ప్రాజెక్ట్ పనులు
అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌లో పెద్ద ఎత్తున షేర్లను కొనుగోలు చేసింది. పెద్ద మొత్తంలో కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలకు 'గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్' నిధులు వాడుతున్నారని తెలిసి 'కేఎల్పీ' అవాక్కయ్యింది. ఈ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ షేర్లను ష్యూరిటీ చూపి..అదానీ సంస్థ రుణాలు సేకరించిందన్న విషయం ఫిబ్రవరి 10న బయటకొచ్చింది. ఈ నిధులను ఉపయోగించి అదానీ ఎంటర్ప్రైజెస్ ఆస్ట్రేలియాలోని 'కార్మికాయెల్ బొగ్గు గని' పనులు ప్రారంభించింది. అత్యంత తక్కువ వడ్డీతో ఎస్బీఐ నుంచి బొగ్గు గని ప్రాజెక్టుకు అదానీ సంస్థ వేల కోట్ల రుణాలు సేకరించింది. ఈ విషయం తెలిసాక..కేఎల్పీ సంస్థ అధికారులు మండిపడుతున్నారు. కేఎల్పీ ఇన్వెస్టింగ్ హెడ్ మాట్లాడుతూ, ''బొగ్గు పరిశ్రమలకు ఫండింగ్ నిషేధించాం. కార్మికాయెల్ బొగ్గు గనికి అదానీ పెట్టుబడులు తరలిస్తే..మా నిబంధనల్ని ఉల్లంఘించినట్టే''నని అన్నారు.
పర్యావరణ, సామాజిక హితం, ప్రభుత్వ పాలనతో సంబంధమున్న వాటికి మాత్రమే తమ నిధులు వాడాలన్నది 'ఈఎస్జీ మార్కెట్' ప్రధాన లక్ష్యం. ఈ లక్ష్యానికి విరుద్ధంగా బొగ్గు తవ్వకాలకు, కాలుష్యం వెదజల్లే ప్రాజెక్టుకు నిధులు తరులుతున్నాయని తెలిసి ఈఎస్జీ, కేఎల్పీ ఇన్వెస్టర్స్ ఆగ్రహంతో ఉన్నారు. ''అదానీ గ్రూప్ పెట్టుబడులు కార్మికాయెల్ బొగ్గు తవ్వకాలకు తరలివెళ్లాయి'' అని 2020 నుంచీ అదానీ గ్రూప్ వ్యవహరాల్ని పరిశీలిస్తున్న అంతర్జాతీయ నిపుణుడు ఎర్లాండ్స్సాన్ చెప్పారు. యూరోపియన్ యూనియన్‌లో 'ఈఎస్జీ' లక్ష్యాలను ప్రోత్సహిస్తున్న స్టాక్‌మార్కెట్ ఫండ్స్ 500కు పైగా ఉన్నాయి. ఈ ఫండ్స్ అన్నీ అదానీ గ్రూప్ కంపెనీల షేర్లను కొనుగోలు చేసినట్టు 'బ్లూమ్‌బర్గ్' తెలిపింది. అంతర్జాతీయంగా వీటి విశ్వసనీయత ఇప్పుడు దెబ్బతిన్నది.
రిస్క్.. రుణాలిచ్చిన బ్యాంక్‌దే : ఎర్లాండ్స్సాన్
అంతర్జాతీయంగా పేరొందిన సంస్థలు అదానీ కంపెనీల షేర్లను కొనుగోలు చేశాయి. పెద్ద మొత్తంలో షేర్లను కలిగివున్న సంస్థలు రిస్క్‌లో పడ్డట్టే. ఇందులో మరో ముఖ్య విషయం ఏమంటే, అదానీ గ్రీన్ స్టాక్స్‌ను చూపి ఎస్బీఐ నుంచి పెద్ద మొత్తంలో రుణాలు సేకరించటం. షేర్ల అత్యధిక విలువను పరిగణలోకి తీసుకొని బ్యాంక్ అతితక్కువ వడ్డీతో రుణాలు ఇచ్చింది. బొగ్గు గని ప్రాజెక్ట్‌లో క్రెడిట్ రిస్క్‌ను తగ్గించటంలో 'గ్రీన్ స్టాక్స్' ఉపయోగపడ్డాయి. ఇప్పుడు అదానీ గ్రీన్ స్టాక్ ధర 70శాతం పడిపోయింది. బ్యాంక్ ఇచ్చిన వేల కోట్ల రుణం 'రిస్క్'లో పడ్డట్టే !
అదానీ 25వ స్థానానికి పతనం
50 బిలియన్ డాలర్ల క్లబ్ నుంచి ఔట్ ..ఫోర్బ్స్ వెల్లడి
తీవ్ర ఆర్థిక మోసాల ఆరోపణలు ఎదుర్కొంటున్న గౌతం అదాని సంపద క్రమంగా హరించుకుపోతోంది. హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌తో అదానీ కంపెనీలు స్టాక్ మార్కెట్లో రోజురోజుకు బొక్కబోర్ల పడుతున్నాయి. దీంతో అదాని సంపద లక్షల కోటు ఆవిరవుతోంది. వరుస పతనంతో అదాని సంపద తాజాగా 50 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.3.9 లక్షల కోట్లు)కు పడిపోయిందని ఫోర్బ్స్ సోమవారం వెల్లడించింది. దీంతో ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ స్థానం 25కు పడిపోయిందని ఫోర్బ్స్ రియల్‌టైం బిలియనీర్ ఇండెక్స్ తెలిపింది. గుజరాత్‌కు చెందిన ఈ పెట్టుబడిదారుడు నెల క్రితం 147 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.12 లక్షల కోట్ల పైగా) సంపదతో ప్రపంచంలోనే రెండో స్థానంలో, ఆసియాలో అతిపెద్ద కుబేరుడిగా ఉన్నారు. ముకేశ్ అంబానీ ప్రపంచంలో 85 బిలియన్ డాలర్ల సంపదతో ఎనిమిదో స్థానంలో నిలిచారు. అదానీ కంపెనీలు తీవ్ర ఎకౌంట్స్ మోసాలకు, కృత్రిమంగా షేర్ల ధరలను పెంచుకుంటున్నాయని హిండెన్‌బర్గ్ తన రిపోర్ట్‌లో వెల్లడించిన విషయం తెలిసిందే. ఆ దెబ్బకు అదానీపై జాతీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్లు విశ్వాసాన్ని కోల్పోయారు. దీంతో అదానీ గ్రూపు కంపెనీల్లోని షేర్లను కొనడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఈ ప్రభావంతో ఆ స్టాక్స్ విలువ నెల రోజులగా క్రమంగా పడిపోతోంది.
అప్పులిస్తునే ఉంటాం : బీఓబీ
అదానీ కంపెనీల పరపతిపై తీవ్ర అనుమానాలు, అరోపణలు చోటు చేసుకుంటున్న క్లిష్ట సమయంలోనూ విత్త సంస్థలు అప్పులివ్వడానికి ముందుకు రావడం గమనార్హం. అదాని గ్రూపునకు మరిన్ని అప్పులిస్తామని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎండీ సంజీవ్ చద్దా పేర్కొన్నారు. పూచీకత్తు ప్రమాణాలు కచ్చితంగా పాటిస్తే రుణాలు ఇచ్చేందుకు అభ్యంతరం లేదన్నారు. అయితే ఇప్పటి వరకు అదానీ కంపెనీలకు బీఓబీ ఎంత అప్పులిచ్చిందనే విషయాన్ని ఆయన వెల్లడించకపోవడం విశేషం.