Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రాలు ఆశలు పెట్టుకోవద్దు
- ప్రస్తుత చట్టాల ప్రకారం ఇవ్వడం కుదరదు : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
జైపూర్ : జాతీయ పింఛను విధానం (ఎన్పీఎస్) నిధుల విషయంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఎన్పీఎస్ కింద జమ అయిన చందాల సొమ్మును తిరిగి రాష్ట్రాలకు ఇచ్చేది లేదని మరోసారి స్పష్టం చేసింది. ఎన్పీఎస్ నిధులను తిరిగిస్తారని రాష్ట్రాలు అంచనా పెట్టుకోవద్దని, ప్రస్తుతమున్న చట్టాల ప్రకారం అది కుదరదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఎన్పీఎస్ నిధులను ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేసిన రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యల నేపథ్యంలో నిర్మలా ఈ మేరకు స్పష్టతనిచ్చారు. రాజస్థాన్ వేదికగా పలు రంగాల వాటాదారులతో జరిగిన బడ్జెట్ అనంతర చర్చల్లో నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ''జాతీయ పింఛను విధానం కింద ఉద్యోగుల ఈపీఎఫ్వో నుంచి జమ అయిన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం తిరిగివ్వాలని రాష్ట్రాలు చెబుతున్నాయి. ఇలాంటి అంచనాలేమైనా రాష్ట్రాలకు ఉంటే.. అది సాధ్యపడదని చెబుతున్నా. ఆ డబ్బుపై అధికారం ఉద్యోగులదే. ఆ డబ్బులకు వడ్డీ వస్తుంది. పదవీ విరమణ తర్వాతే ఆ డబ్బు ఉద్యోగుల చేతికి వస్తుంది. ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వాల చేతికి ఇవ్వడం అనేది కుదరని పని'' అని మీడియాతో మాట్లాడుతూ నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. దీనిపై ఆర్థికశాఖ కార్యదర్శి వివేక్ జోషీ కూడా మాట్లాడారు. కొన్ని రాష్ట్రాలు పాత పింఛను విధానాన్ని అమలు చేయడం, కేంద్రం కూడా అదే విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేయడం మంచి పద్ధతి కాదని ఆయన అన్నారు. '' ఎన్పీఎస్ నిధుల్లో తమ వాటా సొమ్మును వెనక్కి ఇవ్వాలని కొన్ని రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రస్తుతమున్న చట్టపరమైన నిబంధనల ప్రకారం ఆ మొత్తాన్ని రాష్ట్రాలకు ఇవ్వడం కుదరదు'' అని తేల్చిచెప్పారు. జాతీయ పింఛను విధానం లేదా పాత పింఛను విధానంలో దేన్ని ఎంచుకోవాలనేది రాష్ట్రాల పరిధిలోని అంశమని కేంద్రం ఇప్పటికే పలు సందర్భాల్లో వెల్లడించిన విషయం విదితమే. జాతీయ పింఛను విధానాన్ని దేశంలో కాంగ్రెస్ సహా కొన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజస్థాన్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలు పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించాయి. పంజాబ్ కూడా ఇదే బాటలో నడిచేందుకు సిద్ధమైంది.
నిధులివ్వకుంటే సుప్రీంకు వెళ్తాం : రాజస్థాన్ సీఎం
అదానీ గ్రూప్ షేర్లు భారీగా పతనమైన నేపథ్యంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్పీఎస్ నిధులను కేంద్రం షేర్ మార్కెట్లలో పెట్టి.. ఉద్యోగులను గాలికి వదిలేయడం సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్పీఎస్ నిధులను తిరిగిఇవ్వాలని, లేదంటే సుప్రీంకోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఆర్థికమంత్రి దీనిపై స్పష్టతనిచ్చారు.