Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇక్కడ అనవసరమైన వ్యాఖ్యలు చేయొద్దు
- ఏ వర్గాన్నీ సంతోషపెట్టడానికి మేం ఇక్కడ లేం
- యూనిఫాం వివాహ వయస్సు విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం
- పిటిషన్ తిరస్కరించిన న్యాయస్థానం
న్యూఢిల్లీ: 'రాజకీయాల్లో ఏ వర్గాన్ని సంతోషపెట్టడానికి మేము ఇక్కడ లేం' అని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పురుషులు, మహిళలకు ఒకే విధమైన వివాహ వయస్సు (యూనిఫాం మ్యారేజ్ ఏజ్) ఉండాలని కోరుతూ బిజెపి నేత, న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం మహిళలు, పురుషులకు వరుసగా 18 సంవత్సరాలు, 21 సంవత్సరాలు వివాహ కనీస వయస్సుగా నిర్దేశిస్తుంది. సోమవారం భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ జెబి పార్దివాలాలతో కూడిన ధర్మాసనం విచారించింది. పిటిషనర్ స్త్రీ,పురుషులిద్దరికీ వివాహ వయస్సు 21 ఏండ్లుగా ఉండాలని కోరినప్పటికీ, ఈ పిటిషన్‌లోని అభ్యర్ధనను కొట్టివేయాలని పేర్కొంది. ''కేవలం 18 ఏండ్ల వయస్సును నిర్దేశించే నిబంధనను కొట్టివేయడం వల్ల మహిళలకు కనీస వివాహ వయస్సు ఉండదు. 32 ఏండ్ల కింద ఈ న్యాయస్థానం పార్లమెంటుకు శాసనం చేయడానికి లేదా చట్టాన్ని రూపొందించడానికి మాండమస్లను జారీ చేయలేదనేది న్యాయమైన చట్టం' అని కోర్టు నొక్కి చెప్పింది. అయితే ఈ విషయాన్ని హైకోర్టు నిర్ణయిస్తుందని ఉపాధ్యారు పేర్కొన్నాడు. దీనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ''మాపై మీ అవాంఛనీయ వ్యాఖ్య మాకు అక్కర్లేదు. మిమ్మల్ని లేదా రాజకీయాల్లోని ఏ వర్గాన్ని సంతోషపెట్టడానికి మేము ఇక్కడ లేం. మీరు ఇక్కడ అనవసరమైన వ్యాఖ్య చేయవద్దు. ఇది రాజకీయ వేదిక కాదు. మేము మీకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు' అని సీజేఐ డివై చండ్రచూడ్ వ్యాఖ్యానించారు.
ఫిబ్రవరి 2021లో ఆ పిటిషన్‌పై సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. ఆ తరువాత జనవరి 2023లో ఢిల్లీ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులను తనకు బదిలీ చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. అయితే ఈ సమస్య పార్లమెంటు పరిధిలోకి వస్తుందనీ, ఈ అంశాన్ని పార్లమెంటు అంతిమ విజ్ఞతకే వదిలేయాలని ధర్మాసనం పేర్కొంది. 'మేం రాజ్యాంగానికి ప్రత్యేక సంరక్షకులం కాదు. పార్లమెంటు కూడా అలా చేయగలదు. పార్లమెంటు కూడా చట్టాన్ని రూపొందించగలదు. నిర్ణయించగలదు' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అందువల్ల ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు కోర్టు నిరాకరించింది. 'కాబట్టి ఈ పిటిషన్లో జోక్యం చేసుకోవడానికి మేం నిరాకరిస్తున్నాం. పిటిషనర్‌కు అందుబాటులో ఉన్న పరిష్కారాలను పొందవచ్చు' అని పేర్కొన్న ధర్మాసనం, పిటిషన్‌ను కొట్టివేసింది. డిసెంబర్ 2021లో మహిళలకు చట్టబద్ధమైన వివాహ వయస్సును 18 నుంచి 21 సంవత్సరాలకు పెంచే ప్రతిపాదనను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది.